సీఎం బాబు మాటలతో.. రైతుల్లో రెక్కలు తొడిగిన ఆశలు
సీఎం చంద్రబాబు మాటలతో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల ఆశలకు రెక్కలు తొడిగాయి. టమాట రైతులకు ఏమాత్రం మేలు చేస్తుంది?
By : SSV Bhaskar Rao
Update: 2024-06-27 12:49 GMT
రాయలసీమ ప్రాంతం ఉద్యానవన పంటల సాగులో మేటిగా ఉంది. అందులో మామడి, వేరుశనగ తరువాత టమాట ఉత్పత్తిలో ఆసియాలోనే చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ ప్రధమ స్ధానంలో ఉంటుంది. కుప్పం పూల తోటలు, పండ్ల తోటల సాగులో అగ్రగామిగా ఉందనే విషయం తెలిసిందే. అయితే..
"కూరగాయలు, పండ్లు, పూలు పండించే రైతులకు సొసైటీ ఏర్పాటు చేస్తా. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం తీసుకుని వస్తా. టమాటాకు సంబంధించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ నిలువ చేసే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుంటాం"
అని సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో చెప్పిన మాటలు ఇవి.అందుకు కారణం...
కుప్పంలో గత ఐదేళ్ల కాలంలో ఎయిర్ స్ట్రిప్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి కావడం వల్ల పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా ఇది కుప్పం ప్రాంతానికే కాదు. చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత రైతాంగానికి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే..
ఏడాదిలో మదనపల్లె టమాటా దిగుబడి మార్చి నుంచి ఏప్రిల్ లేదా మే నెల వరకు ఉంటుంది. మే, జూన్ తర్వాత దిగుబడి తక్కువగా ఉంటుంది. దిగుబడి అధికంగా ఉన్నప్పుడు ధరలు లేక రైతులు నష్టపోవడం అనివార్యంగా మారుతోంది. ఈ సమయంలోనే ధర కోసం రైతులు నిరసనలకు దిగడం సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు ఇక్కడ షరామామూలే. ఈ పరిస్థితుల్లో..
ఆసియాలోనే ప్రసిద్ధి
చిత్తూరు జిల్లాలో 14,588 హెక్టార్లలో సాగవుతున్న టమాట తోటల నుంచి ప్రతి సంవత్సరం 2,62,584 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ డివిజన్లోని మదనపల్లి, అంగళ్లు, వాల్మీకిపురం, గుర్రంకొండ, చింతపర్తి, పలమనేరు, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె ప్రాంతాలలో టమాటా తోటలు సాగు చేస్తున్నారు. వాల్మీకిపురం వ్యవసాయం మార్కెట్ కమిటీ పరిధిలో రెండు వేల ఎకరాల్లో టమాటా తోటలు సాగులో ఉన్నాయి. ఆ టమాటాలను మదనపల్లి ఆ తర్వాత అంగళ్ళు, గుర్రంకొండ, పలమనేరు, చింతపర్తి మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ సరిస్థితుల్లో..
"టమాట పంట నిలువ చేయడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ నిలువ చేసే కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు" చేయిస్తా అని సీఎం ఎన్. చంద్రబాబు హామీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంత వాతవారణ పరిస్థితులకు మిగతా పంటల నిలువ చేసిన విధంగా టమాట సాధ్యం కాదనే మాటలు వినిపిస్తున్నాయి.
గుజ్జు పరిశ్రమలే దిక్కు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్ఫ్ పరిశ్రమలు 57 వరకు ఉన్నాయి. ఇవన్నీ బంగారుపాళెం, పూతలపట్టు, పలమనేరు, చిత్తూరు, తిరుపతికి సమీపంలో మామిడి దిగుబడి గుజ్జు తీసే పరిశ్రమలు ఉన్నాయి. చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలోని పూతలపట్టు, బంగారుపాళెం, చిత్తూరు సమీపంలో టమాట ప్రాసెసింగ్ పరిశ్రమాలు చేస్తున్నాయి. వాటిలో మామడి కాయలు ప్రాసెస్ చేసే పరిశ్రమల్లో రెండు రకాలు ఉన్నాయి. అందులో క్యానింగ్ (టిన్స్ ల నింపడం) పరిశ్రమలు ఏడు పనిచేయడం లేదు. అసెటిక్ పరిశ్రమలు (పెద్ద బాక్సుల్లో నింపడం) 31 వరకు ఉన్నాయి. టమాట గుజ్జు తీస్తున్న పరిశ్రమల విషయమై ఉద్యానవన శాఖ చిత్తూరు డిప్యూటీ డైరెక్టర్ బీ. శ్రీనివాసులు ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు.
"జిల్లాలో తొమ్మిది చిన్న పరిశ్రమల్లో టమాట పల్ఫ్ తీస్తున్నారు. గంటకు 7.5 టన్నుల టమాట ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది." అని డీడీ శ్రీనివాసులు చెప్పారు. "చాలా పరిశ్రమలు రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేస్తున్నాయి. రైతులకు ఇబ్బంది లేకుండా, పరిశ్రమల యజమానులకు నష్టం లేకుండా, కిలో రూ. ఆరు వరకు కొనుగోలు చేయిస్తున్నట్టు" ఆయన వివరించారు.
టమాటా దిగుబడి అధికంగా ఉండే సీజన్లో రైతులకు నష్టాలు తప్పవు. కిలో రూ. ఐదు అంతకంటే తక్కువ అయ్యే వరకు పరిశ్రమలు
కొనుగోలు చేయడం లేదు.
దీనిపై స్పందించిన ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాసులు "ఆ పరిస్థితి నుంచి కాపడాలనే నికరంగా కిలో రూ. 6కు కొనుగోలు చేసే విధంగా చర్యలు" తీసుకున్నాం. సంక్షోభ సమయాలో్ల తరచూ పరిశ్రమల యజమానులతో సంప్రదింపులు సాగిస్తుంటాం" అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
"ఈ ప్రాంతంలో మామడికాయలు ప్రాసెస్ చేయడానికి అవసరమైన గుజ్జు పరిశ్రమలే ఉన్నాయి. టమాట ప్రాసెస్ చేయడానికి ర్యాంప్ ఏర్పటు చేయాలంటే మాత్రం ఆ యజమాని రూ.1.60 లక్షలు యంత్రాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది" అని శ్రీనివాసులు వివరించారు. ఉత్పత్తి చేసిన గుజ్జు మార్కెటింగ్ చేసుకోవడంలో కూడా యజమానులకు ఇబ్బందులు లేకపోలేదనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. నిజమే కదా. ఎగుమతులకు ఆస్కారం లేకుంటే, ఆ గుజ్జు ఏమి చేస్తారనేది కూడా ప్రశ్నార్ధకమే. కాగా,
టమాట అధికంగా దిగుబడి సాగించే ప్రాంతాలు మదనపల్లె, గుర్రంకొండ, అంగళ్లు, చింతపర్తి, వాల్మీకిపురం, పీలేరు ప్రాంతాల పల్లెలకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వస్తుంది. అంతదూరం తీసుకుని వెళ్లడానికి కూడా ఇబ్బందికరం అని ఆయా ప్రాంతాల రైతులు చెబుతున్నారు. "రైతులు ఎక్కువగా మదనపల్లె మార్కెట్కు తీసుకుని రావడానికి సుముఖత చూపిస్తారు" అని మండీ యజమాని షెక్ మస్తాన్ చెబుతున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ పరిధిలో ఎంత ఉత్పత్తి ఉంటుందో.. ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం మీద అంత దిగుబడి ఉంటుంది. అందు పత్తికొండ, దేవనకొండ, ప్యాపిలి, అస్పరి, మద్దికెర, డోన్, బినేకల్లు ప్రాంతాల్లో టమాట సాగు చేస్తారు. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో కేవలం 7,230 హెక్టర్లలో సాగు చేస్తే, 2,16,900 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయినా, ఈ ప్రాంతంలో గుజ్జు తీసే పరిశ్రమలు లేకపోవడం వల్ల రైతులతో ధరలు దోబూచులాడుతున్నాయి. 2019 -20లో 4,044 హెక్టార్లలో సాగు చేస్తే 1,05,144 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2020 -21 లో 4,124 హెక్టార్లకు 1,07,224 మెట్రిక్ టన్నులు, 2021- 22 4,244 హెక్టర్లు, 1,10, 344 మెట్రిక్ టన్నులు, 2022 -23లో 9,163 హెక్టర్లకు గణనీయంగా 4,30,454 మెట్రిక్ టన్నులు, 2023 -24లో 7,230 హెక్టర్లకు 2,16, 900 మెట్రిక్ టన్నల దిగుబడి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మూడు నెలలకు పైగానే దిగుబడి ఇచ్చే ఈ పంట ద్వారా ఒకసారి నష్టం వస్తే, మరో సీజన్ కు లాభం వస్తుందనే ఆశతోనే రైతులు వరుసగా టమాట సాగుకు సాహసం చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతుంది. ఈ ప్రాంతంలో గుజ్జు తీసే పరిశ్రమలు లేకపోవడం కూడా రైతులకు శాపంగా మారింది. ఈ అంశాలపై ఉద్యానవన శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీ. శ్యామలాదేవి ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు.
టమాటాలు కోల్డ్ స్టోరేజీలో నిలువ చేసే అంశం ప్రస్తావిస్తూ, "కొల్డ్ చైన్ అవసరం" అన్నారు. అంటే "రైతులు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ కు తీసుకుని రావడం. ధర లభించినప్పుడు తీసుకుని వెళ్లడానికి శీతల వాహనం ఉండాలి" ప్రస్తుతం అవే మనకు కొరత అనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. మాల్స్ లో మాత్రమే ఆ తరహా సదుపాయం ఉందనే విషయం తెలిసిందే. "నెల వరకు టమాటా ప్లాంట్ లో నిలువ ఉంచవచ్చు. ఆ తరువాత అంత రుచి ఉండకపోవచ్చు" అనే అభిప్రాయం ఉమాదేవి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో నింజా సంస్థ ద్వారా పండ్లు మాత్రమే నిలువ ఉంచుతున్నారని ఆమె గుర్తు చేశారు.
"మా ప్రాంతంలో గుజ్జు తీసే పరిశ్రమలు లేవు" అని ఉమాదేవి వివరించారు.
ప్లాంట్ నుంచి బయటికి తెచ్చిన రెండు రోజుల్లోపు వాడకుంటే నీటి శాతం అధికంగా ఉండే టమాట చెడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో ఏర్పాటు చేసినా, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకోవడం అనేది యజమానులకు ఒకరకంగా సాహసమే.