రుషికొండ ప్యాలెస్‌ను కార్పొరేట్లు తన్నుకుపోతారా?

వడ్డించిన విస్తరిలాంటి విశాఖ సాగరతీరంలోని రుషికొండ ప్యాలెస్‌ను తన్నుకుపోవడానికి ఆతిథ్య సంస్థలు తహతహలాడుతున్నాయి.

Update: 2025-10-18 14:33 GMT
రుషికొండ ప్యాలెస్‌

రుషికొండ ప్యాలెస్‌! ఇటీవల కాలంలో పరిచయం అక్కర్లేని, పేద, ధనిక వర్గాల్లో అదే పనిగా నానుతున్న పేరిది. వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన ఈ అత్యంత అధునాతన భవంతి కూటమి ప్రభుత్వం వచ్చాక వివాదాల్లో చిక్కుకుంది. ఈ ప్యాలెస్‌ను ఏం చేయాలన్న దానిపై కూటమి సర్కారు ఏడాదిన్నరగా ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ భవంతిలోకి వెళ్లడం, రావడం, వెళ్లినప్పుడల్లా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించడం, త్వరలోనే ఏదో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం షరా మామూలై పోయింది. ప్రజ ల అభిప్రాయం, నిపుణుల సూచనల మేరకు నడుచుకుంటామని ఒకసారి, మంత్రుల కమిటీ చర్చిస్తుందని మరోసారి చెబుతూ వస్తోంది. కానీ అంతకు మించి ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతోంది. ఈ ప్యాలెస్‌ నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ఆ భవన సముదాయంలోని కొన్ని బిల్డింగుల పైకప్పు (సీలింగ్‌) పెచ్చులూడి పడిపోతోంది. క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. అంతేకాదు.. లోపల రూ.కోట్ల విలువ చేసే ఫర్నిచరు కూడా నిరుపయోగంగా ఉండడంతో తుప్పు పడుతోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించినప్పుడు దాని దుస్థితి బయట ప్రపంచానికి తెలిసింది. దీంతో ప్రజల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు మంత్రుల కమిటీని నియమించింది.


కళ్లు మిరుమిట్లు గొలిపే భవంతి లోపల భాగం

తొలి భేటీకే 40 రోజులు..
రూ.452 కోట్లు వెచ్చించి నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలన్న దానిపై ఆగస్టు 28న పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిలతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీ ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్దేశించింది. అయితే 40 రోజుల తర్వాత ఈనెల 12న మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి భేటీ అయింది. విలాసవంతమైన ఈ ప్యాలెస్‌ నుంచి ఆదాయాన్ని ఎలా రాబట్టాలన్న దానిపై ప్రజల సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించింది.

కళ్లు మిరుమిట్లు గొలిపే భవంతి లోపల భాగం 

వడ్డించిన విస్తరి కోసం తహతహ..
రుషికొండ ప్యాలెస్‌ను చూడడానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. అంతలా నిర్మించిన ఈ భవంతిపై ఇప్పుడు కార్పొరేట్‌ పెద్దల కళ్లు పడ్డాయి. అన్నీ సిద్ధం చేసి వడ్డించిన విస్తరిలాంటి ఈ ప్యాలెస్‌ను తన్నుకుపోవాలని పలువురు తహతహలాడుతున్నారు. రుషికొండ ప్యాలెస్‌ను కైవసం చేసుకోవాలని కొందరు, అక్కడున్న తొమ్మిది ఎకరాల స్థలాన్ని దక్కించుకోవాలని మరికొందరు తాపత్రయ పడుతున్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే నెపంతో రుషికొండ ప్యాలెస్‌లోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. శుక్రవారం అమరావతిలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ అభిప్రాయ సేకరణ జరిపింది. దీనికి వివిధ సంస్థలకు చెందిన 45 మంది వర్చువల్‌గాను, ప్రత్యక్షంగాను పాల్గొన్నారు.
ఇలా ముందుకొచ్చారు..!
+ ముంబైలో ఆరికా, జోద్‌పూర్‌లో ఉమైద్‌ భవన్‌ల మాదిరిగా రుషికొండ భవనాలు, భూములు అభివృద్ధి చేస్తామని లెమన్‌ ట్రీ సంస్థ ముందుకొచ్చింది.
+ రుషికొండ భవనాలతో పాటు దిగువన ఉన్న ఖాళీ స్థలాల్లో మెడికల్‌ ఇన్నోవేషన్‌ హబ్, వెల్‌నెస్‌ సెంటర్, హోటల్, ఫుడ్‌ డోమ్‌ వంటివి అభివృద్ధి చేయడానికి హెచ్‌ఈఐ హాస్పిటాలిటీ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది.
+ ఈ భవనాలు, స్థలాల్లో వెల్‌నెస్, హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఇండియన్‌ హోటల్‌ కంపెనీ లిమిటెడ్‌ తెలిపింది.
+ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు మహింద్రా గ్రూపు, లగ్జరీ రిసార్ట్, కన్వెన్షన్‌ సెంటర్, హోటల్‌ నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని మారియట్‌ హోటల్‌ గ్రూపు ప్రకటించాయి.
+ అక్కడున్న తొమ్మిది ఎకరాల్లో మైస్, హోటల్‌ నిర్మాణం చేపడతామని మోర్‌ హౌసింగ్‌ సంస్థ, ఫైవ్‌ స్టార్‌ రిసార్ట్, యోగా సెంటర్, సైకిల్‌ ట్రాక్, ప్లే ఏరియా, పార్క్, బాంక్వెట్‌ హాల్, అధునాతన జిమ్, యాంఫీ థియేటర్‌ వంటివి ఏర్పాటుకు వరుణ్‌ మోటార్స్‌ ముందుకొచ్చాయి.
+ ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, సంస్కృతి ప్రోత్సాహం కోసం వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని పతంజలి, అంతర్జాతీయ సంస్థలతో కలిసి భూముల అభివృద్ధికి ప్రణాళిక అందజేస్తామని మెగ్లాన్‌ లీజర్స్‌ సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
నిపుణులేమన్నారంటే?
రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలన్న దానిపై నిపుణులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. భవనాలు, భూములతో వెల్‌నెస్‌ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని సుమీ గ్రూప్‌ ప్రతినిధి ప్రియాంక సహాయ్, పీపీపీ విధానంలో అంతర్జాతీయ భాగస్వామ్యంతో భవనాలు నిర్వహించాలని పర్యాటకరంగ నిపుణుడు యోగేంద్ర సూచించారు. సింగపూర్, అమెరికా, అరబ్‌ దేశాల దౌత్య కార్యాలయాల నిర్వహణకు కొన్ని బ్లాకులు కేటాయించి, మిగిలినవి హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని ఏపీ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు స్వామి, కార్తీక్‌లు చెప్పారు. హైదరాబాద్‌ హైటెక్స్‌ తరహాలో వైటెక్స్‌ను అభివృద్ధి చేయడం మేలని కార్పొరేట్‌ కన్సల్టెంట్‌ డైరెక్టర్‌ కేపీరావు సూచించారు.

ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం 

పర్యాటక శాఖ అధీనంలోనే ఉండాలి.. 
‘విశాఖ రుషికొండ ప్యాలెస్‌ పర్యాటక శాఖ అధీనంలోనే ఉండాలి. అక్కడ నిర్మించిన భవనాలు ప్రైవేటు వ్యక్తులకో, కార్పొరేట్‌ సంస్థలకో కట్టబెట్టడానికి వీల్లేదు. మునుపటిలా వాటిలోకి ప్రజలను అనుమతించేలా నిర్ణయించాలి. లేదంటే ప్రజలు తిరగబడతారు. ఏటా రెండు కోట్ల మంది పర్యాటకులు దేశ, విదేశీ పర్యాటకులు విశాఖ వస్తుంటారు. అందువల్ల రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్యాలెస్‌లో కొంతభాగాన్ని బుద్ధిస్టు మ్యూజియంగా మార్చాలి’ అని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో అన్నారు.

సీహెచ్‌ నర్సింగరావు 

వైఎస్సార్‌సీపీకి మించిన దుర్మార్గం.. 
ఏపీ పర్యాటక రంగ పాలసీయే తప్పు. పర్యాటకరంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా అభివృద్ధి చేస్తామనడం తప్పు. ప్రభుత్వమే అభివృద్ధి చేయాలి. ప్రైవేటు రంగంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి. ప్రభుత్వానికి ఆర్థికంగానూ నష్టం వాటిల్లుతుంది. రుషికొండ పర్యాటక రంగం నియంత్రణలోనే ఉండాలి. ఏదో వంకతో రుషికొండ ప్యాలెస్‌ను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని అంగీకరించం. ఈ ప్రయత్నాల్లో ఎవరు అనకొండ? గత ప్రభుత్వం రుషికొండ భవనాలకు అంత విలాసవంతంగా ఖర్చు చేయడమే తప్పు. ఇప్పడు కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మోసం చేయాలని చూడడం దుర్మార్గం’ అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.

Similar News