ఒక డీఏతో సర్ధుకోండి..వీలున్నప్పుడు పీఆర్సీ చూస్తాం
ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై, రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు ప్రధాన భాగస్వాములని, వారి బాగోగులు చూడడం తమ బాధ్యత అని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలలు పట్టిందని అన్నారు. గత ప్రభుత్వం వల్ల ఉద్యోగులు కూడా బాధితులైనట్టు పేర్కొన్నారు. పీఆర్సీ గురించి అడుగుతున్నారని, ఆర్థిక పరిస్థితులు భాగా లేవని, దారులన్నీ మూసుకుని పోయాయని, వీలున్నప్పుడు పీఆర్సీ చూస్తామని, అన్నీ కుదిరితే పీఆర్సీ మ్యాటర్ ఆఫ్ డేస్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని హామీలిచ్చారు.
కీలక హామీలు:
- డీఏ బకాయిలు: ఉద్యోగులకు రూ.34,000 కోట్ల బకాయిలు, నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఒక డీఏను వచ్చే నెల (నవంబర్ 1) నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
- ఎర్న్‌డ్ లీవ్‌లు: ఎర్న్‌డ్ లీవ్‌లను 50-50 విడతల్లో క్లియర్ చేస్తామని చెప్పారు.
- సకాలంలో జీతాలు, పెన్షన్లు: ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించామని, ఎక్కడా ఆలస్యం జరగలేదని గుర్తు చేశారు.
- హెల్త్ కార్డులు: ఉద్యోగుల హెల్త్ కార్డుల వ్యవస్థను 60 రోజుల్లో స్ట్రీమ్‌లైన్ చేస్తామని తెలిపారు.
- పోలీసు సరెండర్ లీవ్‌లు: పోలీసులకు రెండు విడతల్లో సరెండర్ లీవ్‌ల చెల్లింపులు చేస్తామని, రూ.210 కోట్లను (రూ.105 కోట్లు + రూ.105 కోట్లు) జనవరిలోగా అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆర్థిక సవాళ్లపై విమర్శలు:
గత ప్రభుత్వం ఎక్సైజ్‌కు సంబంధించి భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ మార్పులు, ఉద్యోగుల సంఖ్య పెరగడం, ఆదాయం తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు.
ఉద్యోగులకు పిలుపు:
ప్రతి ఉద్యోగి ఆనందంగా దీపావళి జరుపుకోవాలని, రేపటి నుంచి మరింత ఉత్సాహంగా పని చేయాలని కోరారు. సంపద సృష్టిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, వచ్చే ఏడాది మొదటి స్థానానికి చేరేందుకు కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సహకారంతో సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, అందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రం నంబర్ వన్‌గా మారుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు.