డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు..!
విశాఖ జిల్లాలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌పై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపనున్నాయి.
By : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-10-18 15:22 GMT
తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. మిత్రపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ఎవరిపైనైనా విమర్శలు ఎక్కుపెట్టే ఆయన ఈసారి కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న విశాఖ గూగుల్ డేటా సెంటర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఏమన్నారంటే?
లక్షా 80 వేల ఉద్యోగాలు రావు..
‘నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. విశాఖ జిల్లాలో ఏర్పాటయ్యే గూగుల్ డేటా సెంటర్‌పై చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చాలామందికి ఉద్యోగాలొస్తాయి అనే సంశయం ఉంది. బేసిక్‌గా డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు.. డేటా ఎంటర్ చేసే సెంటర్ కూడా కాదు. ఇది ఇన్ఫర్మేషన్ స్టోరేజీ సెంటర్. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా పంపించే పరిస్థితి ఉుంది. కాబట్టి ఎంత నంబరాఫ్ ఉద్యోగాలొస్తాయన్నది క్రైటీరియా కాదు.. అంతేగానీ.. లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అప్రోప్రైయేట్ కాదు. అన్ని డైరెక్ట్ ఉద్యోగాలు మాత్రం రావు’ అని కుండ బద్దలు కొట్టారు.
ఉచిత బస్సు ప్రయాణంపై కూడా..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైంది. టికెట్ తీసుకున్న మగవాళ్లను కూడా బస్సు నుంచి దించేస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులే ఈ మాట చెప్పారు. మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి’ అని వెల్లడించారు. గూగుల్ డేటా సెంటర్‌తో లక్షలాది ఉద్యోగాలొస్తాయని, స్త్రీ శక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి పదేపదే గొప్పగా చెప్పుకుంటున్న కూటమి నేతలు మిత్రపక్ష పార్టీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్షలాది ఉద్యోగావకాశాలు రావడం బూటకమంటూ వైఎస్సార్‌సీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.