మాకెందుకులే అనుకుంటే సరిపోదు..తిప్పి కొట్టాలి
మాజీ సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని, వీటిని ప్రభుత్వంతోపాటుగా పార్టీ నాయకులు కూడా సమాంతరంగా తిప్పి కొట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలను తప్పి కొట్టాలని, ప్రభుత్వంతో పాటు పార్టీ నాయకులు కూడా సమాంతరంగా ఆ పని చేయాలని, మాకెందుకులే అని అనుకుంటే సరిపోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకులు, ఇన్‌చార్జ్‌లతో సమావేశమై, పార్టీ కార్యకర్తలకు వైసీపీని, వైఎస్ జగన్ ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని, దీనిని తిప్పి కొట్టాలని మార్గ నిర్దేశం చేశారు. జగన్, వైసీపీ వాళ్లు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని ఆదేశించారు. కల్తీ మద్యం కేసు, మాజీ వైసీపీ మంత్రి జోగి రమేష్ అంశం ప్రస్తావన కొంత మంది నేతలు తీసుకుని రావడంతో కల్తీ మద్యంపై సిట్ విచారణ కొనసాగుతోందని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.