చరిత్రలో కలుస్తున్న 'తిరుపతి గుర్తులు'..!

కాలం మారింది. పట్టణం కూడా మారుతోంది. కొండగుర్తులు చరిత్రలోకి వెళుతున్నాయి. వాటి స్థానంలో పిల్లర్ నంబర్లు వచ్చాయి. ఎలాగంటే..

Update: 2024-10-23 05:30 GMT

తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి 893 సంవత్సరాల చరిత్ర ఉంది. 1130 ఫిబ్రవరి 24వ తేదీ శ్రీవైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయాన్ని దగ్గర ఉండి నిర్మాణం చేయించారనేది చరిత్ర. ఆ వాసనలు పదిలంగా ఉన్నప్పటికీ నగరంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా, పట్టణాలు నగరాలుగా కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. తిరుపతి నగరానికి కొండగుర్తులు సింరాగంలా ఉండేవి. పట్టణంలో కొండగుర్తులు చరిత్రలో కలిసిపోతున్నాయి. ఆ స్థానంలో పిల్లర్ నంబర్లు తెరమీదకు వచ్చాయి. హైదరాబాద్ తరువాత తిరుపతికి కూడా ఆ వాసనలు సోకాయి.
దశాబ్దాలుగా తిరుపతిలో అభివ‌‌ృద్ధి నత్తనడకన అనడం కంటే, నామమాత్రం అని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, ఆ తరువాత విజయవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయి. ఆలస్యంగా అయినా సరే, ఆ తరహా కొత్తదనం తిరుపతిలో కూడా అందుబాటులోకి వచ్చింది. 2014 తరువాతే తిరుపతి నగరం ఆధునిక సొబగులు దిద్దుకోవడం ప్రారంభించింది. కోవిడ్ వల్ల ఆలస్యం జరిగినా, పనులు పూర్తయ్యాయి. అంతకుముందు..

తిరుపతి నగరంలో చెరగని గుర్తులు కొన్ని ఉన్నాయి. కరకంబాడి నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో ఎస్వీ పూర్ హోం దాటగానే రోడ్డుకు ఇరుపక్కలా రెండు మద్దిమాన్లు (భారీ చెట్లు) ఉండేవి. కాస్త ముందుకు వస్తే, ఎస్బీఐ ఎదురుగా ఒంటి మద్దిమాను ఉండేది. ఇవి రెండు తిరుపతి వాసులకే కాదు. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బండగుర్తులు.
వారి సంభాషణ కూడా అలాగే ఉండేది.
"ఏం బా.. యాడుండావు. ఇప్పుడు ఒంటి మద్దిమాను దాటినా, కపిలతీర్ధం వస్తాండా ఆడే ఉండు"
లేదు లేన్నో.. నువ్వు లీలామహల్ సర్కిల్ కాడికి రా. నేను అడికే వస్తా"
"ఓన్నా ఈ పక్క టీఎంసీ దగ్గిర గురవారెడ్డి సమాధుల దగ్గరికి పోవాలంటే దారెట్టా.." సంభాషణలు ఇలా ఉండేవి.
ఇలా ఉండేది.
"తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రుయా ఆస్పత్రికి పాత బస్సు తిరిగేది. బస్సు బయలుదేరడానికి ముందు నుంచి లీలామహల్ సర్కిల్ పాతమున్సిపల్ ఆఫీస్, మెటర్నిటీ ఆస్పత్రి, రామకృష్ణా డీలక్స్, స్విమ్స్, రుయా ఆస్పత్రి" బస్సు బయలుదేరతాంది రండిమా.. తొందరగా ఎక్కాలి. పో రైట్.. రైట్.. కండక్టర్ విజిల్ వేయడానికి ముందు ఇలా పట్టణంలోని మార్గంలో ఉండే పేర్లన్నీ వినిపించేవి. ఇప్పుడు ఆ పద్ధతి చాలా వరకు తగ్గింది.
దీనిపై తిరుపతిలోని సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కాళహస్తి గిరిబాబు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు.
"మా ఊర్లో మద్దిమాన్లు మాయమైనాయి. తిరపతి నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో మద్దిమాన్లకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది" అని గుర్తు చేసుకున్నారు. ఆ పేరుతో ఓ కూడలిగా.. కొండగుర్తుల్లో ఒకటిగా మద్దిమాన్లు ఉండేవి. తూర్పు వైపు నుంచి నగరంలోకి ప్రవేశించే వారికి ఈ మద్దిమాన్లు స్వాగతం పలికేవి. అలాంటి మద్దిమాన్లను పదేళ్ల క్రితం రోడ్డు విస్తరణ పేరుతో కొట్టేసారు. వాటిని కొట్టేసి పదేళ్లయినా నేటికీ ఆ సెంటర్ ను మద్దిమాన్ల సెంటర్ గానే పిలుస్తున్నారు" అదే ఇక్కడ ప్రత్యేకత. ఈ ఫొటోలతో ప్రత్యేక సందర్భాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన రోజుల్లో నేటితరం పిల్లలకు ఈ చెట్ల ప్రాధాన్యం, చరిత్రను వివరిస్తున్నాం" అని గిరిబాబు వివరించారు.
నగర సొబగులు
తిరుపతి నగరం దశాబ్దాల తరువాత గత పదేళ్ల కాలంలో కాస్త పట్టణీకరణ దిశగా అడుగులు వేసింది. సిటీ కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. దీనికి తగ్గట్లుగానే తిరుచానూరు నుంచి కపిలతీర్ధం సమీపంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు ఏడు కిలోమీటర్లు రూ.650.50 కోట్లతో శ్రీనివాససేతు పేరిట ఫ్లైఒవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దీనికి తోడుగా, వివాహాలు, ఇతరత్రా అవసరాలకు అవసరమైన నగలు దుస్తులు కొనుగోలుకు చెన్నైకి వెళ్లాల్సిన అవసరం లేని విధంగా నగరంలో భారీ షాపులు, మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. రేణిగుంట మార్గంలో కాటన్ మిల్లు దాటగానే ప్రారంభమయ్యే ప్లైఓవర్ బ్రిడ్జీతో అనుసంధానం చేశారు. కరకంబాడి మార్గంలో ఎస్వీ పూర్ హోం సమీపం నుంచి లీలామహల్ సర్కిల్ వద్ద మరో ఫ్లైవోవర్ అనుసంధానించారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య లేకుండా నివారించడానికి సాధ్యమైంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బంది లేకుండా తిరుమలకు వెళ్లడానికి మార్గం సుగుమం చేశారు. అలాగే చిత్తూరు మార్గంలో ఉన్న ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో కూడా మరో ఫ్లైఓవర్ బ్రిడ్జీ నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఈ వసతుల నేపథ్యంలో నగరం కొత్త అందాలు సంతరించుకుంది. వాహనదారులకు ఇక్కట్లు కూడా తప్పాయి. కానీ,
పిల్లర్ నంబర్ వచ్చే..

సాధారణంగా తిరుపతిలో ఆటో ఎక్కి, ఎక్కడికి వెళ్లాల్సింది చెబితే చాలు. ఇటీవల తిరుచానూరు నుంచి ఆర్టీసీ బస్టాండ్ మధ్య ఎక్కడ దిగాలన్నా, ఆ ఏరియా చెబితే ఓకే అనే వారు. బస్టాండ్ నుంచి కపిలతీర్థం వరకు కూడా అలాగే ఉండేది. ఇటీవల కొందరు అలిపిరి బైపాస్లో ప్రయాణించాలనుకునే వారికి ఏ పిల్లర్ నంబర్ సార్ అని అడుగుతున్నారు. దీంతో స్థానికులు కూడా షాక్ అవుతున్నారు. ఇదేందబ్బా కొత్తగా అంటే, పాతపేర్లు మాకు తెలుసు సార్, పిల్లర్ నంబర్ చెబితే సులభంగా ఉంటాది. మాకు ఇబ్బంది ఉండదు అంటున్నారు. అంతేకాకుండా, నగరంలో ఇటీవల ఓ హోటల్ ప్రారంభించారు. నగరంలో హోర్డింగ్ లు కూడా ఏర్పాటు చేశారు. హోటల్ ఎక్కడ ప్రారంభిస్తున్నది రాయడంతో పాటు బండగుర్తుగా ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ కూడా ప్రస్తానించారు. దీంతో మెల్లమెల్లగా పాత గుర్తులకు వీడ్కోలు పలుకుతున్నట్లే కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకెన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.
ఖాళీ  ప్రదేశంలో...

ఫ్లైఓవర్ పిల్లర్ల మధ్య ఖాళీ స్థలాన్ని వినియోగించడానికి కూడా నగర పాలక సంస్థ యంత్రాంగం సమాలోచనలు చేసింది. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చేయడంతో పాటు, కొందరికి ఈ ఖాళీ ప్రదేశం ఉపాధి కల్పించడానికి కూడా మార్గం సుగుమం చేసింది. ఖాళీ ప్రదేశంలో అర్బన్ ఫుడ్ ప్లాజాలు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంది. దీనివల్ల చిరు వ్యాపారులకు కాస్త ఉపాధి దొరకడం తోపాటు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయడం, ఆదాయ వనరుగా మార్చుకునే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ వెసులుబాటు ప్రస్తుతం అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద కొద్ది దూరం  మాత్రమే ఉంది.
Tags:    

Similar News