ఘనంగా ముగిసిన ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు

11 రోజుల పాటు అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహించారు.

Update: 2025-10-02 16:22 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన దసరా ఉత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. దుర్గమ్మ అంటే అపారమైన శక్తి, అనంతమైన కరుణ, పిలిస్తే పలికే కొంగుబంగారం, వెన్నంటి నడిపించే కల్పవల్లిగా భాసిల్లిన జగన్మాత 11 అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చి, శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయి.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనా నాయక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ పర్యవేక్షణలో పండితులు యాగశాలలో పూర్ణాహుతి, కలశ ఉద్వాసన ఇతర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.
విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము,‘ అని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. పురాణ ఇతిహాసాల ప్రకారం దసరా ఉత్సవాలకు విశిష్టత ఉందని, దుర్గతులను తొలగించే సర్వోన్నత శక్తి ఆరాధన కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని పండితులు పేర్కొన్నారు. ‘యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా‘ అంటూ జగత్తు అంతా నిండిన పరాశక్తి అందరికీ శుభాలను అందించాలని వారు ఆకాంక్షించారు.
Tags:    

Similar News