24 గంటల పాటు అందుబాటులో ఉండాలి
ఏపీలో భారీవర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాలని నిర్దేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ, అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.