అధికారులే పెద్దలుగా... బ్రహ్మోత్సవాలు పూర్తి..

అధికారులు కొత్తవారే. సమన్వయంతో పనిచేశారు. భక్తులకు మలయప్పస్వామి దర్శనం కల్పించారు. బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేశారు.

Update: 2024-10-12 13:07 GMT

తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించడం ద్వారా బ్రహ్మోత్సవాలు శనివారంతో పూర్తయ్యాయి. రాజకీయ ప్రతినిధులతో కూడిన పాలక మండలి లేదు. కొత్త అయినా అధికారులే పెద్దలుగా, పరిపాలనా అనుభవంతో ఉత్సవాలను విజయవంతం చేశారు. టీటీడీలో సీనియర్ అధికారులు సిబ్బందిని సమన్వయం చేశారు. తద్వారా యాత్రికులకు ఇబ్బంది లేని విధంగా స్వామివారి దర్శనం కల్పించారు. వసతులు కూడా అందుబాటులో ఉంచారు. సుదీర్ఘ విరామం తరువాత టీటీడీ పాలక మండలి లేదు. ఆ స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ లేదు. అయినా అధికారులే పెద్దలుగా ఉత్సవాలను దిగ్విజయం చేశారు.


టీటీడీ ఈఓ జే. శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ శ్రీధర్, తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు బాధ్యతలు వికేంద్రీకరించుకోవడం ద్వారా సిబ్బంది, సీనియర్ల సహకారంతో బ్రహ్మోత్సవాలను సక్రమంగా నిర్వహించడం ద్వారా అందరి అభినందనలు అందుకున్నారు.

శ్రీవేంకటేశ్వరస్వామి వారి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంటే కోట్ల మంది హిందువులకు పండుగ లాంటిదే. ఏడాదికోసారి జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కలియుగ దైవం శ్రీనివాసుడి మహిమానిత్వాన్ని భక్తలోకానికి చాటుతుంది. రోజుకు 70 వేల నుంచి 90 వేల వరకు తిరుమలకు వస్తుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పది రోజులపాటు ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు జరిగే గరుడవాహన సేవకు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు సరాసరిగా తిరుమలకు వస్తారు. కానీ, ఈసారి 3.50 లక్షల మంది వచ్చారని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి అదేరోజు రాత్రి ప్రకటించారు.
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు నిర్వహించడంలో గతంలో టీటీడీలో పని చేసిన అనేకమంది ఐఏఎస్ అధికారులు పీవీఆర్కే. ప్రసాద్, ఏపీవిఎన్. శర్మ, లక్ష్మీనారాయణ, ఎంకెఆర్. వినాయక్, డీవీఎల్ఎన్. మూర్తి, ఐవీ సుబ్బారావు,కేవీ. రమణాచారి, పీ. కృష్ణయ్య, ఐవైఆర్ కృష్ణారావు, సాంబశివరావు, పీ.బాలసుబ్రమణ్యం, కెఎస్. శ్రీనివాసరాజు వంటి వారందరో శాయశక్తులా కృషిచేసి సఫలీకృతులయ్యారు.
గతంలో...
వారందరి హయాంలో కూడా సాధారణ రోజులలో పరిస్థితి ఎలా ఉన్నా, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయాలలో గరుడసేవ రోజు కొంత గందరగోళం జరిగింది. సామాన్య భక్తులకు కొంత అసౌకర్యం, గరుడవాహన సేవను తిలకించే పరిస్థితి లేకుండా తిరిగి వెళ్లిన సందర్భాలు ఎదురయ్యాయి. గత ఐదేళ్లలో అస్తవ్యస్త విధానాలతో అనవసర ఆంక్షల వల్ల భక్తులు తిరుమలకు రావాలంటేనే భయపడే పరిస్థితి. భక్తుల ఆగ్రహాలు గేట్లు విరిచేసి, బారికేడ్లు పెరికి వేసి స్వామివారి దర్శనం కోసం భక్తులు దూసుకెళ్లిన సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. అధికారుల నిర్ణయాలతో భక్తులు తిరగబడి ఏకంగా తిరుమలలో ధర్నాలు, నిరసన కూడా చేసిన పరిస్థితి ఏర్పడింది.
వాటికి భిన్నంగా
అర్ధదశాబ్దం తరువాత మళ్లీ తిరుమల కొండపై శ్రీవారి వారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించారు.‌ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రశాంతకరమైన వాతావరణంలో నిర్వహించడంలో ఉన్నతాధికారులు చాలావరకు సఫలమయ్యారు. ఏటా గరుడసేవ రోజు సామాన్య భక్తులు పడే అవస్థలను ఈసారి 75 శాతం వరకు తగ్గించగలిగారు.‌ తిరుమాడ వీధుల్లోని గ్యాలరీలలో వాహన సేవల కోసం వీక్షించిన భక్త జనాన్ని కంటికి రెప్పలా చూసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తులకు ఆహార పదార్థాలు, బాదంపాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీరు అందించారు. స్వయంగా గ్యాలరీలోకి వెళ్లిన ఈఓ శ్యామలరావు భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు.
నిరీక్షణ అసహనంగా మారకుండా దేవుడిపై దృష్టి ఉంచేలా భక్తులను గ్యాలరీల్లో కూర్చోబెట్టగలిగారు.‌ పవిత్రతకు పెద్దపీట వేస్తూ, భక్తులు కోరుకున్నది... భగవంతుడే అనుగ్రహించాడు.. అనేవిధంగా సామాన్య భక్తులను కూడా వాహన సేవలకు దగ్గరగా పిలిపించి స్వామివారి దర్శనం చేయించడంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి చూపించిన ప్రత్యేక చొరవ ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు కలిగిన సంతృప్తికరమైన విధానంగా చెప్పొచ్చు.

గరుడవాహన సేవ రోజు నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో కూర్చున్న 1.70 లక్షల మంది భక్తులకు వాహనసేవ దర్శనంతో పాటు అప్పటికప్పుడు వెలుపల రోడ్లపై గరుడసేవ తిలకిస్తామో లేదో అంటూ ఆందోళనగా తిరిగారు.  వారిని కొన్నిచోట్ల ఖాళీ గ్యాలరీల్లోకి రప్పించి దాదాపు 40 వేల మందికి పైగా భక్తులను స్వామివారి గరుడ వాహనసేవ దర్శనానికి అనుమతించడంతో ఆనంద పరవశులయ్యారు.
మొదట పలుచగా...
ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆరంభంలో నాలుగు రోజులపాటు సాధారణ రోజుల్లో ఏర్పడే రద్దీ కూడా లేకుండా, పలుచగా కనిపించింది. గరుడవాహన సేవ రోజు యధావిధిగా దాదాపు 3.5 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దాదాపు భక్తులందరికీ స్వామివారి వాహనసేవ చూసే భాగ్యం కల్పించారు.
రింగ్ రోడ్డులో పడిగాపులు
గ్యాలరీలోకి ప్రవేశించేందుకు తిరుమల రింగ్ రోడ్డు చుట్టూ భక్తులు వేలాదిమంది పడిగాపులు కాశారు. చుట్టూ వలయంలా బారికేడ్లు గేట్ల వద్ద పోలీసులను భక్తులు అనేక ప్రాంతాల్లో నిలదీశారు. కొన్ని గేట్ల వద్ద తోపులాటలు జరిగాయి. గ్యాలరీలోని భక్తులపై చూపించిన ప్రత్యేక శ్రద్ధ వెలుపల రోడ్లపై అవస్థలు పడుతున్న భక్తులపై ఉన్నతాధికారులు చూపించలేకపోయారు. వారికి ఆహార పదార్థాలు, మంచినీరు అందక ఇబ్బంది పడ్డారు. గరుడవాహన సేవ చూసేందుకు తిరుమలలో దాదాపు 32 ప్లాస్మా టీవీలు ఏర్పాటు చేశామని టీటీడీ ప్రకటించినా, అవి భక్తులు తిరిగే రోడ్లపై కాకుండా అవసరం లేని చోట ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. భక్తులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా అనేక ప్రాంతాల్లో గేట్లు, బారికేడ్లు ఏర్పాటు వల్ల తిరుమల వలయంలా మారిపోయింది. దీంతో సామాన్య భక్తుల పరిస్థితి ఇబ్బందికరంగా కనిపించింది.
కనిపించని హడావిడి...
ఆలయ నాలుగు మాడవీధుల్లో ప్రధానంగా వాహనసేవల్లో ఈసారి రాజకీయ నాయకుల హడావిడి, హంగామా గందరగోళం లేకుండా, ప్రశాంతంగా జరిగాయి. వీఐపీ పాసుల సంఖ్య చాలా వరకు కుదించడం, పైరవీలకు ఒత్తిడికి తలొగ్గకుండా చర్యలు తీసుకోవడం సమాన్య భక్తులకు మేలు జరిగిందని చెప్పవచ్చు. టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేయకపోవడం కూడా అధికారులకు కొంత కలిసి వచ్చింది. అయినప్పటికీ అధికార అనధికార ప్రముఖుల కుటుంబీకుల హడావిడి కొంత వాహనాల ముందు కనిపించింది. మొత్తంగా కలిపి మూడు వేలకు లోపు గానే వీఐపీ పాసులు మంజూరు చేసినట్లు సమాచారం. అందులో కూడా తిరుపతి ఎమ్మెల్యే సిఫార్సుతో 50 పాసులు, మాజీ ఎమ్మెల్యే సిఫార్సుతో 30 పాసులు, ఇంకొంతమంది ప్రముఖుల సిఫార్సులతో మొత్తం మూడు వేలకు పైగా విఐపి పాసులు జారీ చేశారు.
ఓవర్ యాక్షన్
స్వామివారి వాహన సేవ ముందు రోప్ పార్టీల పేరుతో పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అనవసరంగా నెట్టివేయడం విమర్శలకు అవకాశం కల్పించింది. వాహనసేవ ముందు హ్యాండ్ మైకులతో విపరీతమైన అరుపులు గోలగోలగా గోవిందనామ స్మరణలకు అడ్డు తగిలాయి. భక్తుల భద్రత కోసం నియమించిన ఐదువేల మంది పోలీసులు భక్తులను నిలువరించడం కోసం మాత్రమే తమ విధులు అన్నట్లుగా వ్యవహరించారు. భక్తులకు సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందారు. మరో 1600 మంది విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది కూడా వాహన సేవలో జనాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారే కానీ ఇతర విధులు నిర్వహించలేకపోయారు.
అంతా బాగుంది..
మొత్తంపై చిన్న పొరపాట్లు ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఈసారి బ్రహ్మోత్సవాలు గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రశాంతంగా ముగిశాయి. సంతృప్తికర దర్శనం కల్పించారనే మాటలు వినిపించాయి. ఈ పరిస్థితిని కల్పించడంలో కీలకపాత్ర పోషించిన టీటీడీ ఈఓ జే. శ్యామల రావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి టీటీడీలోని సీనియర్, అధికారులు సిబ్బందిని సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.‌ టీటీడీలో బ్రహ్మోత్సవాలు సఫలం చేయడంలో వారి పనితీరు వల్ల విమర్శలకు ఆస్కారం లేకుండా చేశారు. కొన్నేళ్లపాటు టీటీడీలో పనిచేస్తే గానీ, ఉత్సవాల నిర్వహణపై అవగాహన ఏర్పడే అవకాశం ఉండదు. ఈ పరిస్థితికి భిన్నంగా కేవలం మూడు మాసాల కిందటే వచ్చిన ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఇంతటి అవగాహన, పరిపాలనపై పట్టు పెంచుకున్నారు. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు వీరబ్రహ్మం, గౌతమి, ఐపీఎస్ అధికారి సీవీఎస్ఓ శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తదితర ముఖ్యఅధికారులతో సమన్వయం చేసుకున్నారు. దీంతో విమర్శలు, ఆరోపణలకు ఆస్కారం లేని విధంగా ఉత్సవాలు నిర్వహించడంలో సఫలమయ్యారని చెప్పకతప్పదు.
లైటింగ్ కోసం ఖర్చు ఎంతంటే...
పగలు తిరుమల ఒక రకంగా కనిపిస్తుంది. రాత్రిళ్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక లోగిలిలో స్వయంగా ఆస్వాదించడం మినహా, మాటలకు అందని భావం అది. బ్రహ్మోత్సవాల వేళ కలియుగవైకుంఠం విద్యుద్దీపాల వెలుగులో దేదీప్యమానమైంది. ఇది నిత్యం కనిపించేదే. దేవతామూర్తుల కటౌట్లు, ఆలయానికి విద్యుద్దీకరణ పనులకు రూ. 3.50  కోెట్లతో పనులు చేశారు. తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు, చుట్టుపక్కల దేవతామూర్తుల చిత్రాలు ఆధ్యాత్మిక వెలుగులు విరజిల్లాయి.
Tags:    

Similar News