అమరావతిలో జనవరి కి రెండు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు

జిల్లా కలెక్టర్ ల సమావేశంలో ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని వెల్ల‌డి.;

Update: 2025-09-16 07:21 GMT
క్వాంటం కంప్యూటర్స్ భవనాల నమూనా

అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వ‌చ్చే జ‌న‌వ‌రి క‌ల్లా రెండు క్వాంటం కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయ‌నుంది. 2027 నాటికి మ‌రో మూడు కంప్యూట‌ర్లు ఏర్పాటు చేస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ‌ల కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని చెప్పారు.  స‌చివాలయంలో జ‌రుగుతున్న జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు రెండ‌వ రోజు ఆయ‌న అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారు.  గ్లోబ‌ల్ క్వాంటం డెస్టినేష‌న్‌గా ఏపీని మార్చాల‌నే దిశ‌గా ప‌నులు చేప‌డుతున్నామ‌న్నారు. ఇందుకోసం రెండు ద‌శ‌లుగా రోడ్ మ్యాప్ రూపొందించుకుని ముందుకెళుతున్నామ‌న్నారు. 2030 క‌ల్లా అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ నుంచి ఏటా 5వేల కోట్ల మేర క్వాంటం హ‌ర్డ్‌వేర్ ఎగుమ‌తుల‌ను సాధించాల‌న్న‌దే ల‌క్ష్య‌మ‌ని, దీంతో పాటు ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్య శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నామ‌ని తెలిపారు.

రూ.వెయ్యి కోట్ల ప్రోత్స‌హ‌కాల‌తో క్వాంటం వ్యాలీలో క‌నీసం 100 అంకుర సంస్థ‌లు (స్టార్ట‌ప్‌లు) ఏర్పాటు చేయాల‌నేది సంక‌ల్ప‌మ‌న్నారు. క్వాంటం వ్యాలీ రాక‌తో రాష్ట్రంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తాయ‌న్నారు. వైద్య ఆరోగ్యం, బీమా, ఫైనాన్స్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ అండ్ మిష‌న్ లెర్నింగ్‌, మెటీరియ‌ల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, ఆప్టిమైజేష‌న్ అండ్ లాజిస్టిక్స్‌, క్లైమేట్, ఎన‌ర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట స‌హా మొత్తం 14 రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ లాగ‌ర్థ‌మ్స్‌తో అద్భుత ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని తెలిపారు.
50 ఎక‌రాల్లో క్వాంటం వ్యాలీ
రాజ‌ధాని అమ‌రావ‌తిలో అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ నిర్మాణం కొర‌కు సీఆర్డీఏ ఇప్ప‌టికే 50 ఎక‌రాల భూమిని కేటాయించింద‌ని తెలిపారు. ఇక్క‌డ క్వాంటం వ్యాలీ భ‌వ‌న నిర్మాణానికి సంబంధించి భ‌వ‌న న‌మూనాలు సిద్ధం చేశామ‌ని వెల్ల‌డించారు.ఈ భవనంలో దాదాపు 80 నుంచి 90 వేల మంది పనిచేయనున్నారు. భవన సముదాయంలో భవిష్యత్తులో 3 లక్షల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్లు పనిచేయనున్నాయని చెప్పారు. క్వాంటం వ్యాలీలో పెట్టుబ‌డులు, కార్య‌క‌లాపాలు సాగించ‌డానికి ఐబీఎం, టీసీఎస్‌, ఎల్ అండ్ టీ సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయ‌ని, ఈ సంస్థ‌ల‌తో ఇప్ప‌టికే ఎంఓయూ కూడా కుదుర్చుకున్నామ‌న్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తి క్వాంటం కంప్యూటింగ్ కంపెనీ (ఏక్యూసీసీ) ఏర్పాటు చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ నియామ‌కాలు కూడా జ‌రిగాయ‌న్నారు. ఈ రంగంలో అపారమైన ఉపాది, ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని చెప్పారు.
జిల్లాల్లో క్వాంటం రాయబారులు కలెక్టర్లే
జిల్లా స్థాయిలో ప్రజలు, విద్యార్థుల్లో క్వాంటం రంగంపై అవగాహన కల్పించడానికి జిల్లాల్లో రాయబారులుగా వ్యవహరించాల్సింది జిల్లా కలెక్టర్లేనని భాస్కర్ కాటంనేని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా జిల్లాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రధానంగా కళాశాలల్లో యువతకు దీనిపట్ల అవగాహన పెంపొందించి ఈ క్వాంటం కంప్యూటింగ్ కోర్సులు చదివేలా కూడా ప్రోత్సహించాలన్నారు. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో క్వాంటం కంప్యూటింగ్ కర్రికులమ్ గా ఉండేలా చూడాలన్నారు. క్వాంటం సూత్రాలపూ విద్యార్థుల్లో పూర్తీ అవగాహన కల్పించేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సైన్స్ సొసైటీకి సిద్ధంగా ఉండేలా మన విద్యార్థులు సిద్ధంగా ఉండేలా చేయడంపైన కలెక్టర్లు ద్రుష్టి సారించాలన్నారు.
క్వాంటం వ్యాలీ భవన నమూనాకు సీఎం ప్రశంస
రాజధాని అమరావతిలో నిర్మించనున్న అమరావతి క్వాంటం వ్యాలీ భవన సముదాయ నమూనాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. నమూనా బాగుందని, అనేక కసరత్తులు చేసిన తర్వాత తక్కువ సమయంలోనే మంచి నమూనా రూపొందించారని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేనిని అభినందించారు.
Tags:    

Similar News