పీపీపీ మోడ్‌లోనే మెడికల్‌ కాలేజీలు

10 మెడికల్‌ కాలేజీలకు రూ. 4950 కోట్లు వ్యయం అవుతుంది. ప్రజాప్రయోజనం కోసం పీపీపీలే ఉత్తమ విధానమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;

Update: 2025-09-15 15:42 GMT

పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్‌ కాలేజీల్లో ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమంపై కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ï650 మెడికల్‌ సీట్లు మాత్రమే గతంలో ఉండేవి.. తాను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్‌ సీట్లు తేగలిగాం. వైద్య కళాశాలలు పెట్టాలంటే నిధులు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. 10 మెడికల్‌ కాలేజీలకు రూ. 4950 కోట్లు వ్యయం అవుతుంది. కేవలం 5 శాతం నిధులు మాత్రమే గత పాలకులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ కాలేజీల నిర్మాణం కోసం మరో రూ.4 వేల కోట్ల వరకూ అవసరం అవుతాయి. పీపీపీ ద్వారా వైద్య చికిత్సల నాణ్యత పెరుగుతుంది. సీట్లు పెరుగుతాయి. దీన్ని కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రయోజనం కోసం పీపీపీలే ఉత్తమ విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

వైద్యారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు ఓ వినూత్న విధానం. చికిత్స కంటే ఆస్పత్రిలో ఉండడానికే ఎక్కువ వ్యయం అవుతోంది. సాంకేతిక విధానం ద్వారా రియల్‌ టైమ్‌ లో ఆరోగ్య పర్యవేక్షణ జరిగేలా కార్యాచరణ చేపడతాం. తురకపాలెం లాంటి ఘటనలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. ఆర్‌ఆర్‌ పేట ఘటన కచ్చితంగా మానవతప్పిదమే అని సీఎం అన్నారు. ఎక్కడా నీటి కాలుష్యం జరగడానికి వీల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ హెల్త్‌ రికార్డులతో పాటు సంజీవనీ ప్రాజెక్టు చేపడుతున్నాం. మొదట చిత్తూరు జిల్లాలో, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రీవెంటివ్, క్యూరేటివ్‌ అన్న అంశాల ఆధారంగా సంజీవని ప్రాజెక్టు చేపట్టాం. యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ఓ గేమ్‌ ఛేంజర్‌ గా తయారవుతుందని సీఎం పేర్కొన్నారు.
విద్యార్ధులకు 10 ఏళ్ల క్రితం ఉండే విజ్ఞానాన్ని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం అవసరమైన విద్యను అందించేలా పాఠ్యాంశాలు ఉండాలి. అప్పుడే విద్యార్ధుల నైపుణ్యం పెరుగుతుంది. 2019 వరకూ విద్యారంగంలోని అన్ని ప్రమాణాలు అత్యున్నతస్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాత అన్నీ దిగువకు పడిపోయిన పరిస్థితి ఉంది. దానికి కారణాలు ఏంటన్నది అధ్యయనం చేయాలి. ఆర్టీజీఎస్‌ ద్వారా టెక్నాలజీ ఆడిటింగ్‌ జరగాలి. అపార్‌ ఐడీ ద్వారా విద్యార్ధుల విద్యాపరమైన సమాచారాన్ని కేంద్రం ట్రాక్‌ చేస్తోంది. ఆ సమాచారం ఆధారంగానే మన డేటా కూడా అప్డేట్‌ కావాలి. 45 రోజుల్లో ఆపార్‌ ఐడీ అప్డేషన్‌ జరగాలి. వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్సు నుంచి ఇక అంతా రియల్‌ టైమ్‌ సమాచారమే ఉండాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో 1 కోటి మంది విద్యార్ధులు నాలెడ్జ్‌ ఎకానమీ భాగస్వాములు కావాలన్నారు. విద్యారంగం– పారిశ్రామిక రంగం కలసి పనిచేయాలి.
అందుకే రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యాలు పెంచుకునేలా యువతను ప్రోత్సహించాలి. అంగన్‌వాడీల నుంచే విద్యార్ధుల్లో లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ లేకుండా రుణం ఇస్తోంది. దీనిని వినియోగించుకుని విద్యార్ధులకు బాసటగా నిలిచేలా ఓ పథకాన్ని ప్రారంభిస్తాం. జిల్లాల్లో ఎప్పటికప్పుడు జాబ్‌ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయాలి. 4.5 లక్షల మంది ప్రస్తుతం ఏపీలో వర్క్‌ ఫ్రమ్‌ హోం పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కోవర్కింగ్‌ స్పేస్‌ లు కూడా పెడితే మరో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించొచ్చు. రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Tags:    

Similar News