మలుపు తిరిగిన రాసలీల వ్యవహారం

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడ్డారా? హనీ ట్రాప్ జరిగిందా? మొత్తానికి ఈ వ్యవహారం రోజుకు మలుపు తీసుకుంటోంది.

Update: 2024-09-12 13:10 GMT

ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వ్యవహారం గురువారం కొత్త మలుపు తిరిగింది. తనను లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసిన మహిళ గురువారం ఎట్టకేలకు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో నివేదికలు రానున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమును విచారణ చేసే అవకాశం ఉంది.

తెలుగుదేశం పార్టీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హనీట్రాప్ లో పడ్డారా? లేక లైంగిక వేధింపులు జరిగాయా? ఈ వ్యవహారం చిత్తూరు జిల్లాలో చర్చ జరుగుతోంది.
"సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు" అని తెలుగుదేశం పార్టీ మహిళ నాయకురాలు ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఆ మేరకు వీడియోలను కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారంలో ఆమె ఎట్టకేలకు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి
ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు చేయించుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ నివేదికలు బయటికి రానున్నాయి.
"ఈ వ్యవహారంలో నన్ను ఉదేశపూర్వకంగానే ఇరికించారు. ఇందులో నా తప్పు లేద" అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెబుతున్నారు.
తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులు కొట్టివేయాలని కూడా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. " ఆరోపణలపై ఇలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా, ఆరోపణలో నిజానిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే కోనేటి ఆధీమూలం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
"ఈ ఏడాది జూలై ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది" అని కూడా ఆయన తన పిటీషన్ లో ప్రస్తావించారు.
" 50 ఏళ్ల నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్రపన్నారు" అని కోనేటి ఆదిమూలం ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం పూర్వపరాల్లోకి వెళితే..
లైంగికంగా వేధించారు
నన్ను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడు. ఎవరికైనా చెప్తే చంపివేస్తానని కూడా బెదిరించాడంటూ, ఇది నియోజకవర్గంలోని కేవీపీ పురానికి చెందిన ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేసిన ఆ మహిళ కోనేటి ఆదిమూలం తో కలిసి ఓ ప్రైవేటు లాడ్జిలో గడిపిన వీడియోలను కూడా మీడియాకు వెల్లడించారు. ఒకే పార్టీకి చెందిన వాళ్ళం కావడంతో పలు కార్యక్రమాల్లో నేను ఆదిమూలంతో కలిసి పాల్గొన్నట్లు ఆ మహిళ వివరించింది. ఆ తనువుతో తన నుంచి మొబైల్ నెంబర్ తీసుకున్న ఆదిమూలం తిరుపతిలోని బీమా హోటల్ కు రమ్మని పదేపదే కోరాడని, అక్కడికి వెళ్లిన తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఆ మహిళ ఆరోపించారు. దీంతో ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్రంలోని అధికారంలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం టిడిపి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆసుపత్రికి ఆదిమూలం
ఈ సంఘటన నేపథ్యంలో ఒత్తిడికి గురైన సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకున్న ఆయన రెండు రోజుల క్రితమే చిత్తూరు జిల్లా పుత్తూరు కు చేరుకున్నట్లు సమాచారం. అయితే ఆయన ఇంటి వద్దకు ఎమ్మెల్యే గల్మన్లు ఎవరిని అనుమతించడం లేదని సమాచారం. కుటుంబ సభ్యులు కూడా ఎవరితో మాట్లాడడం లేదని చెబుతున్నారు.
కేసు నమోదు
చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. తనపై లైంగిక వేధింపులు పాల్పడడం కాకుండా అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనలు తిరుపతిలోని బీమాస్ ప్యారడైజ్ రూమ్ నెంబర్ 105, 109 లో జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులు పేర్కొంది. దీంతో బీమాస్ పేరడైజ్ హోటల్లో సీసీ ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు.
బాధితురాలి ఫిర్యాదును ఆధారంగా చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలకు తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. మొదట ఈ పరీక్షలకు నిరాకరించిన బాధితురాలు వరలక్ష్మి ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయారు.
మళ్లీ రెండు రోజుల క్రితం ఆమె పోలీసుల వద్దకు రావడంతో వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకుంటానని సూచించిన మేరకు, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలకు తరలించారు. గురువారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటికి పంపారు.
దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి తెలిపాారు.
"సత్యవేడు ఈష్యులో బాధితురాలు నిన్న సాయంత్రం 3.30 గంటలకు ఆసుపత్రి కి వచ్చింది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు తెలిపే ఆధారాలకు కావాల్సిన పరీక్షలు నిర్వహించాము. 15 నుంచి 20 రోజుల తర్వాత శ్యాంపుల్ రిపోర్టులు వస్తాయి" అని డాక్టర్ పార్థసారథి రెడ్డి తెలిపారు.
ప్రభుత్వానికి నివేదిక
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎపిసోడ్లో తిరుపతి ఇంటెలిజెన్సీ డిఎస్పి కన్జాక్షన్ సారధ్యంలో విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆయన ప్రత్యర్థుల పాత్ర ఏంటినే ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
కేసు కొట్టేయండి
తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు మంగళవారం క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ లేకుండానే కేసు నమోదు చేయడాన్ని ఆయన ఆక్షపించారు. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత బాధితురాలు అని చెప్పుకుంటున్న వరలక్ష్మి వైద్య పరీక్షలకు అంగీకరించడం గమనార్హం.
ఎట్టకేలకు వైద్య పరీక్షలు చేయించుకున్న వరలక్ష్మి, వైద్య నివేదికలు అందిన తర్వాత వాటి ఆధారంగా ఎమ్మెల్యే ఆదిమూలమును తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా ఇప్పటికే, బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించిన నేపథ్యంలో, తిరుపతిలోని బీమాస్ ప్యారడైజ్ హోటల్ 109, 105 గదులను సీజ్ చేయడంతో పాటు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు సమాచారం. ఈ కేసులో బాధితురాలు వరలక్ష్మి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పక్షాన కేసువాదిస్తున్న ఇరువురు న్యాయవాదులు మహిళలే.
రాజకీయ కుట్రే
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేటి ఆదిమూలంను ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధి గురువారం సాయంత్రం పలకరించారు.
"అన్న చెప్పడానికి చాలా బాధగా ఉంది. దళితుడిని అయినా, ఆత్మస్థైర్యంతో రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎదిగాను. ఏ విషయంలో కూడా నేను ఎక్కడ రాజీ పడలేదు. నన్ను అనవసరంగా ఇందులో ఇరికించారు" అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలత చెందారు.
"50 సంవత్సరాల నా రాజకీయ జీవితానికి మరొక పూసి, రాజకీయంగా దెబ్బతీయాలని కుట్ర పన్నారు" అని వ్యాఖ్యానించారు. "గుండె సంబంధిత వ్యాధితో స్టంట్ కూడా వేయించుకున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో పసలేదు. రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఇది" అని తన బాధను పంచుకున్నారు.


Tags:    

Similar News