Nelloore| హిజ్రాల సంఘం నాయకురాలి హత్య

అమ్మవారి గుడికి వెళ్లివస్తున్న హిజ్రా నాయకురాలు హత్యకు గురయ్యారు. ఆ సంఘం సభ్యులు భారీగా నెల్లూరుకు చేరుకుంటున్నారు.

Update: 2024-11-27 06:26 GMT

ఓ హిజ్రా నాయకురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేసి తిరిగి వస్తుండగా దారి కాచిన దుండగులు దారుణంగా  మారణాయుధాలతో దాడిచేసినట్లు సమాచారం. ఈ సంఘటన నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా స్పందించారు. దీంతో నెల్లూరు GGH (government general hospital) తోపాటు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. తమ నాయకురాలు హత్యకు గురైన సమాచారం అందుకున్న నెల్లూరు, తిరుపతి నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు జీజీహెచ్ వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకున్న హిజ్రాలు ధర్నా చేస్తున్నారు.


"తమ నాయకురాలిని హత్య చేసిన దుండగులను అరెస్టు చేయాలి" అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో హిజ్రాలు నెల్లూరు జిజిహెచ్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు కూడా ఊహించని రీతిలో పెద్ద సంఖ్యలో మోహరించారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

నెల్లూరు జిల్లా కేంద్రానికి అనుకునే ఉన్న కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం పార్లపల్లెకు సమీపంలోని టపాతోపు అనే ఊరి వద్ద మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న హిజ్రాల సంఘం నాయకురాలు హాసినిని వెంబడించిన కొందరు దుండగులు హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న హిజ్రాలు భారీగా అక్కడికి చేరుకుని, హాసినిని నెల్లూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హాసిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం ఉదయం హాసిని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి మార్చురీకి తరలించారు.

హిజ్రాల సంఘం నాయకురాలు హాసిని హత్యకు గురైందని సమాచారం అందుకున్న నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని హిజ్రాలు కూడా భారీగా నెల్లూరుకు చేరుకున్నారు. దీంతో పోలీస్ అధికారులు మార్చడి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మార్చరీ బయటి రోడ్డుపై బైఠాయించిన హిజ్రాలు కన్నీరు మున్నీరవుతూ కనిపించారు. తమ నాయకురాలిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై కొడవలూరుఎస్సై కోటిరెడ్డి ' ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ,
కొడవలూరు మండలం టపాతోపు వద్ద అమ్మవారి గుడి ఉంది. "మంగళవారం రాత్రి హిజ్రాల సంఘం నాయకురాలు హాసిని పూజలు చేసి తిరిగి వస్తుండగా, వెంబడించిన కొందరు దాడి చేశారు" అని సమాచారం అందిందని ఎస్ఐ కోటిరెడ్డి చెప్పారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ఉందని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి హిజ్రాల సంఘం నాయకురాలు హాసిని నెల్లూరులోనే నివాసం ఉంటున్నట్లు ఆయన చెబుతున్నారు.
హిజ్రాల సంఘంలోని గొడవలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చనే సందేహం ఆయన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా,
నెల్లూరు జిల్లాలో హిజ్రాల సంఖ్య ఎక్కువ. వీరు నివాసం ఉండే ప్రదేశాల్లో మూడు నెలల కిందట కూడా ఒకసారి దాడి జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో కొందరు హిజ్రాల నివాసాల నుంచి నగదు కూడా ఎత్తుకుపోయినట్లు సమాచారం ఉంది. ఆ సంఘటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ తరహా ఘటనలకు ఆస్కారం ఉండేది కాదని నెల్లూరు మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.
Tags:    

Similar News