కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఓ బ్లాక్ మెయిలర్!
వాస్తవాలు తెలుసుకోకుండా ఆమె కథనాలను ప్రసారం చేసిన మీడియాపైనా పరువు నష్టం దావాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కూన రవికుమార్ హెచ్చరించారు.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-08-19 15:02 GMT
శ్రీకాకుళం జిల్లా లోలుగు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య తనపై చేసిన ఆరోపణలను ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఖండించారు. ఎమ్మెల్యే కూన తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ సౌమ్య ఇటీవల మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే?
‘కేజీబీవీ లోలుగు ప్రిన్సిపాల్ సౌమ్యపై అనేక ఫిర్యాదులొచ్చాయి. జూన్ 2న తెరవాల్సిన పాఠశాల 12 తెరిచారు. ఆమె విధులకు సరిగా హాజరు కారు. పిల్లలకిచ్చే నిత్యావసర సరకులు దుర్వినియోగం, నిధులు కైంకర్యం, కొందరు పిల్లలను తన పనులకు వాడుకుంటుందని ఆరోపణలున్నాయి. ఒక పేద దళిత కుటుంబానికి చెందిన బాలిక నల్లగా ఉందని ఆమెకు అడ్మిషన్ నిరాకరించారు. ఈ ఆరోపణలపై కలెక్టర్ విచారణ జరిపించిన తర్వాత ఆమెను బదిలీ చేశారు. ఆమె స్థానంలో వచ్చిన కొత్త ప్రిన్సిపాల్‌ను కూడా ఆమె బెదిరించారు. మహిళలు కూడా సిగ్గుపడేలా ఆమె వ్యవహరిస్తున్నారు. నేనెప్పుడూ ఆమెకు నేరుగా ఫోన్ చేయలేదు. ఒకవేళ ఎప్పుడైనా చేసుంటే పిల్లల సీటు కోసం నా బాధ్యతగా చేసుంటాను. వీడియో కాన్ఫరెన్స్‌లో బూర్జ, ఆమదాలవలస ప్రిన్సిపాళ్లతో కలిసి ఆమెతో మాట్లాడాను. ఆమె నాపై చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలు. కానీ అవేమీ తెలుసుకోకుండా మీడియాలో కథనాలు వచ్చాయి. నాపై ఆరోపణలు చేసిన ప్రిన్సిపాల్ సౌమ్యతో పాటు సంబంధిత మీడియా ప్రతినిధులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. పరువు నష్టం దావా వేస్తాను. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకీ ఫిర్యాదు చేస్తాను.
అమెవన్నీ డ్రామాలే..
ప్రిన్సిపాల్ సౌమ్యవన్నీ డ్రామాలే. నటనలో ఆమె మహా నటి సావిత్రిని మించిపోయింది. ఇప్పటికే అన్ని డ్రామాలూ అయిపోయాయి. ఆత్మహత్య డ్రామా కూడా అయింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆమె గతంలో సస్పెండయ్యారు. సాటి ఉద్యోగులను, ఉన్నతాధికారులను అట్రాసిటీ కేసు పెడ్తానని, ఆత్మహత్య చేసుకుని ఆ లేఖలో మీ పేరు రాస్తానని బెదిరించేది. ఎస్సీ అట్రాసిటీ కేసులను దుర్వినియోగం చేయడంలో సిద్ధ హస్తురాలు ఆమె. సౌమ్య ఓ ఎమోషనల్ బ్లాక్ మెయిలర్. ఆమెది ఏ కులం? మతం మార్చుకున్నాక పాత కులం వర్తించదని హైకోర్టు చెప్పింది. సౌమ్య ఆరోపణలు నమ్మొద్దని దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సౌమ్యను పరామర్శించడానికి ఈరోజు వైసీపీ నేతలు వెళ్లారు. మీది (వైసీపీది) బ్లూ ఫిలిం పార్టీ. మీ గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబులా కాదు. కూన బాడీలో పసుపు రక్తం ఉంది. సౌమ్యను అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామనుకుంటున్నారు. కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారు. కూన రవికుమార్ ఎదుగుదలపై ఓర్వలేని వారు, వెధవలు చేస్తున్న కుట్ర.. అవి నన్నేమీ చేయలేవు. అన్నిటినీ సమర్థంగా ఎదుర్కునే ధైర్యం నాకుంది. ఎవరూ ఏమీ చేయలేరు’ అని ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పారు.