Smart Street Bazaar | పేదలకు 'పర్యాటక' ఉపాధి...

నెల్లూరు మైపాడు బీచ్ వద్ద పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-10 07:09 GMT
నెల్లూరు బీచ్ వద్ద స్మార్ట్ బజార్ స్ట్రీట్

పర్యాటక ప్రాంతాలు పేదల జీవితానికి భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. పీ4లో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ వద్ద రాష్ట్రంలో మొదటిసారి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటు చేశారు. సముద్రం ఒడ్డున ఆహ్లాదంగా గడపడానికి వచ్చే పర్యాటకుల ద్వారా ఆదాయం పెంచే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆసరా ఇచ్చింది.


నెల్లూరు జిల్లా పర్యటనకు సీఎం నారా చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం రానున్నారు. ఈ పర్యటనలో సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఈదగాలి సమీపంలో విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. 310 కోట్ల రూపాయలతో ఏర్పాటైన ఈ బయో ఇథనాల్ ప్లాంట్ ద్వారా దాదాపు 500 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. నందగోకులం లైఫ్ స్కూలును కూడా సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.

బీచ్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ బజార్..
నెల్లూరు మైపాడు బీచ్ వద్ద పైలట్ ప్రాజెక్టుగా స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటుకు 8.4 కోట్ల రూపాయలతో 200 షాపులక ఏర్పాటుకు రూపకల్పన చేశారు. మొదటి దశలో 30 కంటైనర్లలో స్మార్ట్ దుకాణాలుగా తీర్చిదిద్ది 120 సిద్ధం చేశారు.
మరో లోకంలోకి వెళ్లినట్టే..
మైపాడు బీచ్ వద్ద ఉన్న స్మార్ట్ స్రీట్ బజారు ఓ పత్యేక లోకాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేశారు. కంటెనర్లను స్టాల్స్ గా తీర్చిదిద్ది ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటకులకే కాకుండా దుకాణ దారులకు కూడా రక్షణ కల్పించే విధంగా సీసీ కెమెరాలతో నిఘా, వైఫై సదుపాయం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. 
"నెల్లూరు మైపాడు బీచ్ వద్ద 120 మంది మధ్యతరగతి జీవులకు p4 పథకంలో చిరు దుకాణాలు ఏర్పాటుకు సహకారం అందించాం" అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నారాయణ వెల్లడించారు.
"రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో కూడా స్మార్ట్ స్ట్రీట్ బజార్లు ఏర్పాటుకు విస్తరిస్తాం. పేద వర్గాలకు చెందిన వారికి ఆర్థికంగా భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం" అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.

విజయవాడ నగరంలో స్ట్రీట్ ఫుడ్ ను సీఎం నారా చంద్రబాబు పరిచయం చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం కాగానే ఆ వీధి మొత్తం అనేక రకాల ఆహార పదార్థాలు, చిన్నపిల్లలకు అవసరమైనవి. మాంసాహారం తో పాటు జంక్ ఫుడ్ కూడా అందుబాటులో ఉండేది.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో దుకాణం ఏర్పాటు నిలిచిపోయింది.
అదే తరహాలో.. నెల్లూరులో..
విజయవాడ తరహాలోని నెల్లూరు మైపాడు బీచ్ వద్ద పేద వర్గాలకు మెప్మా ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు మంత్రి నారాయణ, ఆయన కుటుంబీకులు ఎన్నికలవేళ ఇచ్చిన వాగ్దానంలో భాగంగా 120 మందికి లక్ష రూపాయలు నగదు డిపాజిట్ చేశారు. మైపాడు బీచ్ వద్ద ఏర్పాటు చేసే స్మార్ట్ స్ట్రీట్ బజారులో కంటైనర్లతో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఇక్కడ కూల్ డ్రింక్స్, టీ కాఫీలు, అనేక రకాల టిఫిన్స్, జంక్ ఫుడ్ కేంద్రాలు, ఇతర అల్పాహారాలు తయారుచేసి విక్రయించి ఉపాధి పొందడానికి అవసరమైన ఏర్పాట్లకు నెల్లూరు నగర కార్పొరేషన్, మెప్మా విభాగంతో పాటు మంత్రి నారాయణ సహకారం అందించారు. మైపాడు బీచ్ వద్ద ఏర్పాటు.చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాట్లను మంత్రి నారాయణ తో పాటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అజీజ్, నెల్లూరు జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పిల్లలకు తిరుతిండ్లు, మహిళలకు అవసరమైన అలంకరణ వస్తువులు, అంటే మొత్తం మీద పర్యాటక ప్రదేశానికి వచ్చే యాత్రికులకు అవరమైన వస్తువులు, ఆహారపదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా దుకాణాల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
మహిళలకు శిక్షణ
నెల్లూరు మైపాడు బీచ్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ బజారు ఏర్పాటుకు ముందే మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అంతకుముందే చెన్నై నగరంలోని బర్మా బజారుకు మెప్మా సిబ్బందితో మహిళలను తీసుకువెళ్లి అక్కడి పరిస్థితిని, వ్యాపారం నిర్వహించే విధానాన్ని అధ్యయనం చేయించారు. అదే తరహాలో దుకాణాలు కంటైనర్లలో ఏర్పాటు చేయించడం ద్వారా, వాటి నిర్వహణ ఎలా ఉండాలని అంశం పైన కూడా నెల్లూరులో శిక్షణ ఇచ్చారు. ఎంపిక చేసిన 120 మంది పేదలకు స్మార్ట్ స్ట్రీట్ బజారు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా పి.ఫోర్ పథకంలో భాగంగానే సహకారం అందించారు.
కార్యాచరణ ఇలా..

నెల్లూరు నగరం మైపాడు గేట్ సెంటర్ వద్ద 120 మందికి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటుకు కార్యాచరణ ఎలా తయారు చేశారంటే..
నగరంలోని 120 మందిని మెప్మాలో ఉన్న మహిళలను ఎంపిక చేశారు. వారికి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కంటైనర్ను కొనుగోలు చేయించారు. దీనికోసం నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేశారు. అందులో 2 లక్షల రూపాయలు మెప్మా, నెల్లూరు నగరపాలక సంస్థ భరించింది. మరో రెండు లక్షల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించారు. ఈ రుణాలు ఐదు సంవత్సరాలు లోపు చెల్లించే విధంగా కాల పరిమితి విధించారు.
మంత్రి కుటుంబం అండ..

స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటును పీ.ఫోర్ పథకంలో దాతగా మంత్రి పొంగూరు నారాయణ ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారం అందించారు. 120 మంది ఎంపిక చేసిన సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మంత్రి నారాయణ వారి ఖాతాలో జమ చేయడానికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు.
"ప్రతి వ్యాపారి ఖాతాలో 50,000 డిపాజిట్ చేశాం. మిగతా మొత్తం కూడా అందిస్తాం" అని మంత్రి నారాయణ వెల్లడించారు.
స్మార్ట్ స్ట్రీట్ బజారు ఏర్పాటు ద్వారా పర్యాటక ప్రాంతాల్లో వసతులు మెరుగుపరచడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే ప్రాంతంలో చిరు ఆహార దుకాణాలు ఏర్పాటు చేయిస్తే పర్యాటకులకు వెసులుబాటుగా ఉంటుంది. ఈ ప్రాంతంపై ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవనం సాగించడానికి వీలుగా కార్యాచరణ తయారు చేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
"నెల్లూరులో మొదటిసారి పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరించడం ద్వారా పేదలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం" అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
పట్టణాల్లో ఒకే చోట ఈ తరహా దుకాణాలు ఏర్పాటు చేయించడం ద్వారా పేదలకు జీవన భద్రత ఏర్పడుతుంది. పర్యాటక ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ట్రాఫిక్ సమస్య కూడా ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటునట్లు మంత్రి నారాయణ వివరించారు.
Tags:    

Similar News