చంద్రబాబుతో అదానీ భేటీ
అదానీకి ఆహ్వానం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం వీరద్దరు సమావేశం అయ్యారు. వీరితో పాటు ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో, రాష్ట్రంలో అదాని గ్రూప్ చేపట్టిన మౌళిక సదుపాయాల కల్పనల ప్రాజెక్టులు, విశాఖపట్నం డేటా సెంటర్, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చ జరిగింది. అదాని గ్రూప్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇది వరకే ప్రకటించారు. మరో వైపు విశాఖ డేటా సెంటర్ లో కూడా అదానీ గ్రూప్ మేజర్ భాగస్వామిగా ఉన్నారు. ఇది వరకు సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా గౌతం అదానీ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. విశాఖ డేటా సెంటర్ తో పాటు అదానీ గ్రూప్ ఏపీలో పెట్టబోయే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కి ఉపయోగపడనుంది, దీని ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంలో కీలకంగా మారవచ్చు. ఈ భేటీ ద్వారా ఏపీ ప్రభుత్వానికి, అదాని గ్రూప్ మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడనున్నాయి. అంతకుముందు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న గౌతమ్ అదానీకి పుష్పగుచ్చాలు అందజేసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు.