రాయలసీమ ప్రాంతీయ బోర్డు ‘రాజధాని’ ఎక్కడ?

కర్నూలుకు కాకుండా తిరుపతికి ఆ హోదా దక్కనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి

Update: 2025-12-04 03:27 GMT

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రాంతీయ అభివృద్ధి మండలి వల్ల కర్నూలుకు మరొక సారి అన్యాయం జరిగే సూచనలు కనబడుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి ప్రకటించిన అభివృద్ధి మండలికి కర్నూలు ను కేంద్రం చేసే ఆలోచన లేనట్లుంది. ఈ ప్రాంతానికి తిరుపతి ప్రాంతాయాభివృద్ధి కేంద్రం హోదా దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమయితే, కర్నూలు జిల్లాకు మరొక సారి నిరాశ ఎదురవుతుంది.

ఎందుకంటే, గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయరాజధాని, హైకోర్టు ఏర్పాటు అని ఈ జిల్లా వాళ్లని కవ్వించాడు. అది జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం హైకోర్టు బెంచ్ అనింది. అదీ కదలడం లేదు. శ్రీబాగ్ ఒప్పందం అని కర్నూలు, అనంతపురం జిల్లా వాళ్లు ఇంకా అరుస్తూనే ఉన్నారు. ఎపుడో 1956 కోల్పోయిన రాజధానికి పరిహారంగా ఏదో ఒక మాంచి హోదా ఇస్తారనే ఆశ వాళ్లలో ఇంకా చావలేదు. అయితే, ఇదంతా అత్యాశే. ఇపుడు ప్రాంతీయాభివృద్ధి మండలి కేంద్రం కూడా కర్నూలు వచ్చేలా లేదు. మరొక వైపు కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు కార్యాలయమైనా కర్నూలు లో పెట్టండనే డిమాండ్ ఆరోజుల్లో జగన్ పట్టించుకోలేదు. ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవాడం లేదు.

ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు ప్రాంతీయ మండలలలో ఒకటి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించినది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్య పాలనాధికారిగా పనిచేసే ఆ కేంద్రంలో 9 జిల్లా ల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.   భూకేటాయింపులు, పరిశ్రమలకు రాయితీలు, ఇతర అభివృద్ధి ప్రణాళికలను ఈ బోర్డు రూపొందిస్తుందని చెబుతున్నారు. ఇదెలా జరుగుతుందో స్పష్టత లేదు. ప్రజాప్రతినిధులకు ఇందులో ఎంత ప్రమేయం ఉంటుందో స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి ఆలోచన కాదని ఈ బోర్డు ఎంత స్వతంత్రంగా పనిచేస్తుందో తెలియడం లేదు. ఈ బోర్డులకు  కేంద్రాలు ఏర్పాటుచేసి అధికార వికేంద్రీకరణ అని అమరావతి మీద చూపుతున్న వల్లమాలిన ప్రేమనుంచి దృష్టి మళ్లించేందుకు ఇదంతా చేస్తున్నారని రాయలసీమ గుసగుసలు వినబడుతున్నాయి. ఇవి తొందర్లోనే బయటకు బలంగా వినిపించే అవకాశం కూడా ఉంది.

రాయలసీమ పరిధిలోని అనంతపురం, సత్య సాయి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కూడా రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి మండలి పరిధిలోకి తీసుకువస్తున్నారు. ఈ 9 జిల్లాల అభివృద్ధికి తిరుపతి ‘రాజధాని’ అవుతుందనే వార్త ప్రధానంగా వినబతూ ఉంది.

ఇలాంటి బోర్డు సృష్టి కొత్తదేం కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2007లో ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. నాటి పుత్తూరు శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడును అధ్యక్షుడుగా నియమించారు. అది అంతకు మించి ముందుకు కదల్లేదు. ఇదేమవుతుందో చూడాలి.


Tags:    

Similar News