విభిన్న ప్రతిభావంతులను అన్ని రంగాల్లోనూ ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం వారి ఆకాంక్షలకు అనుగుణంగా పలు ప్రకటనలు చేశారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని 7 వరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..."గత ప్రభుత్వంలో దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేశారు. కక్షపూరితంగా దాడులు చేశారు. 2019-2024 మధ్య కనీసం దివ్యాంగుల దినోత్సవం కూడా నిర్వహించలేదు. వారికి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలా అండగా నిలిచింది. దివ్యాంగులు బలహీనులు కాదు. నేను వారిని విభిన్న ప్రతిభావంతులుగా చూస్తాను. కొంచెం మద్దతు ఇస్తే చాలు వారు విజయం సాధిస్తారు. వారికి అందరికంటే పట్టుదల ఎక్కువ. సమాజంలో అందరిలానే దివ్యాంగులు కూడా సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం పొందాలనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దివ్యాంగుల ఎదుగుదలకు అవసరమైన విధానాలు, చట్టాలు రూపొందిస్తున్నాం."అని సీఎం చంద్రబాబు అన్నారు.
దివ్యాంగులకు పింఛన్లకు నాందీ పలికింది ఎన్టీఆర్
"దివ్యాంగులకు మొదటిసారి రూ.30 పింఛను ఇచ్చింది ఎన్టీఆరే. 2014కు ముందు దివ్యాంగులకు రూ.500 ఉన్న పింఛన్ను మేము అధికారంలోకి వచ్చాక రూ.1500 చేశాం. అదే ప్రభుత్వంలోనే మరోసారి పెంచి రూ.3,000 చేశాం. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగ పింఛన్ను రూ.6,000 చేశాం. డయాలసిస్ పేషెంట్లు, తలసేమియా బాధితులకు రూ.10 వేలు ఇస్తున్నాం. తీవ్ర వైకల్యం ఉంటే రూ.15,000 వరకు పింఛన్ అందిస్తున్నాం. ప్రతీ నెలా 7.68 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ.471 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ఏడాదికి దాదాపు రూ.6,000కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ విభిన్న ప్రతిభావంతులకు ఇంత పెద్ద మొత్తంలో పింఛను ఇవ్వడం లేదంటే అదీ వారిపై కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గడువును పొడిగించాం. దివ్యాంగులకు ఈ ఏడాది 1,800 మోటార్ వాహనాలను అందిస్తున్నాం. వీటితో పాటు ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు, వీల్ చైర్లు... మొత్తం 13,935 సహాయక పరికరాలు పంపిణీ చేశాం."అని సీఎం చంద్రబాబు తెలిపారు.
దివ్యాంగుల చదువుకు ప్రాధాన్యత
"మెగా డీఎస్సీ ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను నియమించాం. వినికిడి, దృష్టి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా 10 పాఠశాలలు నిర్వహిస్తున్నాం. ఆధునిక అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేశాం. హోమ్ స్కూలింగ్ తీసుకువచ్చాం. 679 భవిత కేంద్రాల ద్వారా ఎర్లీ ఇంటర్వెన్షన్, థెరపీ అందిస్తున్నాం. SASCI పథకం కింద దివ్యాంగుల హాస్టల్ భవనాల అభివృద్ధికి రూ. 4.32 కోట్లు మంజూరు చేశాం. చిన్నారుల్లో వైకల్యాలను ముందుగానే గుర్తించేలా హెడ్ టు టో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాం. APSRTC బస్సుల్లో నగరాల్లో ఉచిత ప్రయాణం, జిల్లాల సర్వీసుల్లో 50 శాతం రాయితీ ఇస్తున్నాం. విశాఖలో 23 ఎకరాల్లో ‘నేషనల్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్’ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం."అని ముఖ్యమంత్రి తెలిపారు.
విజయానికి వైకల్యం అడ్డంకి కాదు
"విజయానికి వైకల్యం అడ్డు కాదని కరుణ కుమారి, అజేయ్ కుమార్ రెడ్డి, దీపిక నిరూపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బ్లైండ్ ఉమెన్ క్రికెటర్ కరుణా కుమారి ప్రస్థానం ఎందరికో ప్రేరణగా నిలిచింది. కేవలం శబ్దంతోనే అంతర్జాతీయ క్రికిట్‌లో రాణించింది. అంధుల ప్రపంచ కప్ ఫైనల్‌లో 42 పరుగులు చేసి మనకు కప్ అందించింది. ఆమె గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుని ఈ స్థాయికి వచ్చినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. చిన్న వయసులో ఓ ప్రమాదంలో చూపు కోల్పోయిన ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి పట్టుదలతో అనుకున్నది సాధించారు. తొలి బ్లైండ్ T20 ప్రపంచ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌గా 2017లో బ్లైండ్ T20 ప్రపంచ కప్‌ను, 2018 బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిపించారు. అర్జున అవార్డు అందుకున్న మొట్టమొదటి బ్లైండ్ క్రికెటర్ గా నిలిచారు. అలాగే చిన్నతనంలో చూపు పోగొట్టుకున్న దీపిక వరల్డ్ టీ 20 బ్లైండ్ ఉమెన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గానే కాకుండా పారా అథ్లెటిక్ గానూ ప్రతిభ చాటడం గొప్ప విషయం. జాతీయ క్రీడల్లో 100 మీటర్ల స్ర్పింట్, లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించి స్పూర్తిగా నిలిచింది."అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇంధ్రధనుస్సులాంటి ఏడు వరాలివే...
1. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం.
2. స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్-పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధి నామినేట్.
3. ఆర్ధిక సబ్సిడీ పథకాన్ని SC, ST, BC, మైనారిటీల తరహాలోనే దివ్యాంగులకు వర్తింపు.
4. SAAP ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు.
5. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లో కేటాయింపు.
6. బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజ్‌తో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్ధులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ.
7. ప్రజా రాజధాని అమరావతిలో దివ్యాంగ్ భవన్. జిల్లాల్లో కూడా దివ్యాంగ భవనం నిర్మిస్తాం. దివ్యాంగులకు అనుకూలం, సౌకర్యవంతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం.. అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.