జనసేన నాలుగు రోజుల వ్యూహం... దీపారాధనతో ప్రారంభం..

శ్రీవారి లడ్డూలో కల్తీపై మంటలు ఆరకుండా టీడీపీ కూటమి జాగ్రత్తలు తీసుకుంటోందా? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన నేపథ్యంలో కార్యాచరణ సిద్ధం చేసింది.

Update: 2024-09-29 12:50 GMT

జనసేన పార్టీ శ్రేణులు మూడు రోజుల కార్యచరణ ప్రకటించాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు డిప్యటీ చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ మూడు రోజుల కార్యక్రమాలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈనెల 30వ తేదీ నుంచి ఆ కార్యక్రమాలు అమలుకు శ్రీకారం చుట్టనున్నారు.

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందనే వ్యవహారం అధికార టీడీపీ కూటమిలోని జనసేన, బీజేపీ మంటలను వ్యాపిస్తూనే ఉన్నాయి. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ శనివారం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజాదికాలు చేసిన విషయం తెలిసిందే. అదే బాటలో హిందూ సెంటిమెంట్ ఆరనివ్వకుండా జనసేన కూడా 30వ తేదీ ఆలయాల్లో దీపారాధన చేయాలని నిర్ణయించింది.

జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష విరమణ చేయడానికి అక్టోబర్ ఒకటిన తిరుపతికి రానున్నారు. మూడో రోజుల పాటు ఆయన తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. దీంతో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సమావేశం ఆదివారం తిరుపతిలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సారధ్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి పార్టీ నేతలు హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇవీ కార్యక్రమాలు
1. సోమవారం: (30వ తేదీ) అన్ని ఆలయాల్లో దీపారాధన చేయాలని పార్టీ శ్రేణులకు సూచిస్తూ నిర్ణయం చేశారు.
2. అక్టోబర్ ఒకటి: ఓం నమో అనే మంత్ర పఠనం చేయాలి. అన్ని ఆలయాలు, యోగా కేంద్రాల్లో నిర్వహించాలి
3. అక్బోబర్ రెండో తేదీ: తిరుపతిలో నగర సంకీర్తన. శ్రీవారిని కీర్తిస్తూ ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు.
4. అక్టోబర్3వ తేదీ అన్ని ఆలయాల్లో భజన కార్య్రమాలు చేయడానికి శ్రద్ధ తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

జిల్లా కమిటీ సమావేశం తరువాత తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. "డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాకను పురస్కరించుకుని కార్యక్రమాలు ఖరారు చేశాం" అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని కూడా ఆయన వెల్లడించారు. ప్రాయశ్చితదీక్ష విరమించడానికి పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తారని తెలిపారు.
పవన్ కల్యాణ పర్యటన ఇలా..
అక్టోబర్ ఒకటో తేదీ సాయంత్రం మూడు గంటలకు పవన్ కల్యాణ్ రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి సమీపంలోని అలిపిరికి వచ్చి, శ్రీవారి పాదాలమండపం వద్ద పూజలు చేస్తారు. అక్కడి నుంచి నడకమార్గంలో తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
అక్టోబర్2: ఉదయం పది గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత తిరుమలలోని తరగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని పరిశీలిస్తారు. తరువాత ఇంకొన్ని ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. మూడో తేదీ: తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.


Tags:    

Similar News