ఓటర్ల విజ్ఞతే భవితకు నాందిః ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయ సూరి

2024 ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని.. అలా ఓటు వేసినప్పుడే దేశ, రాష్ట్ర భవిష్యత్‌కు నాంది అవుతుంది.

Update: 2024-04-19 11:09 GMT

దేశ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలి. దేశ, రాష్ట్ర సమిష్టి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ బాగుంటుందని ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విశ్రాంత ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయసూరి అన్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తీరుతెన్నులు’ అంశంపై చర్చా గోష్టి నిర్వహించారు. దీనికి ప్రధాన వక్తగా హాజరైన చిన్నయసూరి ప్రసంగించారు. గతంలో కంటే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగింది. 1952లో ఓటింగ్‌ శాతం 43 ఉంటే 2019 నాటికి అది 80 శాతానికి పెరిగిందన్నారు. ఒక వైపు

ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరుగుతున్నా ప్రజలలో రాజకీయ పరిజ్ఞానంతో పాటుగా విద్యా ప్రమాణాలు అభివృద్ధి చెందుతున్నా, మరో వైపు రాజకీయ అవినీతి, నిరంకుశ నాయకత్వం, సహజ వనరుల దోపిడీ కూడా అదే స్థాయిలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నేడున్న రాజకీయ పార్టీలలో సుస్థిరతను, అభివృద్ధిని, ప్రజాస్వామ్య సంవిధానాన్ని అందించ గలిగే నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని, ఆ దిశగా ప్రజలు సమాలోచనలు చేయాలని ఆయన కోరారు. పొలిటికల్‌ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం తగ్గిపోతోంది. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించ కపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రజలు కాకుండా వ్యక్తి కేంద్రంగా పార్టీలు, ప్రభుత్వాలు కొనసాగుతయని, ఇది అత్యంత ప్రమాదకరమైందన్నారు. నేడు రాజకీయాల్లో ధనవంతులు, వ్యాపార వేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఓటర్లను డబ్బులు, మద్యం వంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతాల వారీగా విభజిస్తూ దేశ, రాష్ట్ర సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తూ, వారి వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటున్నారన్నారని ద్వజమెత్తారు. రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక పరమైన భేదాలు క్షీణించాయన్నారు. పార్టీల అధినేతల మధ్య కుస్తీ పోటీలుగా రాజకీయాలు మారాయన్నారు. ఈ పరిణామాలు సమాజ వికాసానికి విఘాతం కలుగ జేస్తాయని ఆవేధన వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. రంగయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమైందని, అయితే పార్టీల సభ్యుల ప్రమేయం లేకుండానే అభ్యర్థుల ఎంపికలు జరుగుతున్నాయని, ఇక ఆ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు రాజకీయాలనేవి కార్పొరేట్‌ శక్తుల మధ్య పోటీలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ నైతిక విలువలు, త్యాగాలు ప్రాతిపదికగా నాడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక జరిగితే నేడు గెలుపు గుర్రాల పేరుతోను, ధన బలం, కుల బలం ఆధారంగా ఎంపిక చేస్తున్నారన్నారని మండి పడ్డారు. అలాంటి వారినే అభ్యర్థులుగా రాజకీయ పార్టీలు ఎంపిక చేస్తున్నాయన్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వడానికి ఉపయోగపడే అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. వ్యక్తి ప్రయోజనం కన్నా సమాజ ప్రయోజనాలకు తోడ్పాటు అందించే వారిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ చర్చా గోష్టిలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వపు రిజిస్ట్రార్‌ రావెల సాంబశివరావు, మద్రాసు విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్‌ జి. కోటేశ్వర ప్రసాద్, ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌ నేత పి మల్లికార్జున రావు, మానవత సంస్థ చైర్మన్‌ పావులూరి రమేష్‌ తదితరులు ప్రసంగించారు.
Tags:    

Similar News