’ఐదు సార్లు నువ్వే సీఎం కావాలి..అది నేను చూడాలి‘
ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఇప్పటంలో పర్యటించిన పవన్ కల్యాణ్ దానిని నిలబెట్టుకున్నారు.
By : Vijayakumar Garika
Update: 2025-12-24 07:47 GMT
’ఐదు సార్లు నువ్వే సీఎం కావాలి..అది నేను చూడాలి‘ అని నాగేశ్వరమ్మ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పర్యటించారు. గతంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. 2022లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన మద్దతుదారుల ఇళ్లను కూల్చివేయగా, అప్పుడు ప్రతిపక్ష నేతగా పర్యటించిన పవన్ కల్యాణ్ బాధితులకు అండగా ఉంటానని, తిరిగి అధికారంలోకి వచ్చాక కలుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఉప ముఖ్యమంత్రి హోదాలో బుధవారం ఆయన గ్రామానికి వెళ్లారు.
నాగేశ్వరమ్మ ఇంటికి పవన్
పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లారు. గత పర్యటన సమయంలో, నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్‌ను తన కుమారుడిలా భావించి, "ఎన్నికల్లో గెలిచి పెద్ద పదవిలో ఉన్నప్పుడు మళ్లీ మా ఇంటికి రావాలి" అని కోరారు. బుధవారం పవన్ కల్యాణ్ ఆమె ఇంటికి రావడంతో నాగేశ్వరమ్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఆయన్ను హత్తుకుని, "ఐదు సార్లు నువ్వే సీఎం కావాలి..అది నేను చూడాలి" అని ఆకాంక్షించారు. అనంతరం, పవన్ కళ్యాణ్ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆర్థిక సాయం ప్రకటన
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇండ్ల నాగేశ్వరమ్మకు, ఆమె కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
నాగేశ్వరమ్మకు రూ. 50,000 ఆర్థిక సాయం.
ఆమె మనవడి చదువు నిమిత్తం రూ. 1 లక్ష ఆర్థిక సాయం.
అదనంగా, మనవడి విద్యాభ్యాసం కోసం తన ప్రతీ నెల వేతనం నుండి రూ. 5,000 అందజేస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాకతో ఇప్పటం గ్రామంలో సందడి నెలకొంది. గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తమ సమస్యలను, కూటమి ప్రభుత్వంలో మారిన పరిస్థితులను ఆయనతో పంచుకున్నారు.