జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను డమ్మీలను చేసిన టీడీపీ
జనసేన, బీజేపీల బలోపేత వ్యూహాల మధ్య టీడీపీ ఆధిపత్యం. కేంద్రం వద్ద వాపోతున్న జనసేన, బీజేపీ నేతలు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య అసలు పొసగటం లేదు. తెలుగుదేశం పార్టీ తన ఆదిపత్యాన్ని దక్కించుకుంటోంది. రాష్ట్రంలో జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అలాగే బీజేపీకి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అయినా వారు డమ్మీలుగానే విధుల్లో ఉన్నారని ఆయా పార్టీలో చర్చ మొదలైంది. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్ద వ్యక్తం చేసినప్పటికీ విని మిన్నకుండటం తప్ప సరైన సమాధానం ఎమ్మెల్యేలకు రాలేదు. వారు చెప్పింది విని తలూపుతూ మాట్లాడదాం అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.
పది నెలల క్రితం ఎమ్మెల్సీ కె నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇవ్వలేదు. ఏమి జరిగిందనేది ఇంతవరకు బయటకు రాలేదు. జనసేన పార్టీలో గట్టిగా ఎవరైనా నాయకులను తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యవహారాలపై ప్రశ్నిస్తే ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే మీ ఇష్టం అనే మాట పార్టీ అధ్యక్ష్య, కార్యదర్శుల నుంచి వస్తున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎలాగైనా పార్టీ బలం పెంచాలనే ఉద్దేశ్యంతో ఏడాదిన్నర తరువాత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీ అయ్యారు. వారు చెప్పిన అంశాలన్నీ నోట్ చేసుకున్నారు. అలాగే వారు ఇచ్చిన అర్జీలు స్వీకరించారు. మరికొందరు నియోజకవర్గ ఇన్ చార్జ్ లతోనూ ఆయన మాట్లాడుతూ వచ్చారు.
జనసేన సమావేశానికి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో హాజరైన నేతలు
ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లతో నాగబాబు ప్రత్యేకంగా ఎచ్చెర్లలో సమావేశం నిర్వహించి పార్టీ నిర్మాణం, ఎలా పార్టీని ముందుకు తీసుకుపోవాలనే అంశాలపై చర్చించారు. మాస్ మాటలే కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే తప్ప తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం సాధ్యం కాదనే ఆలోచనలు జనసేన వారు చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. కేంద్రంలో పార్టీ పరంగా అందరు నాయకుల వద్ద మంచి పట్టు ఉన్నప్పటికీ ఏపీలో తెలుగుదేశం పార్టీ చేతిలో డమ్మీగా ఉండాల్సిన పరిస్థితి ఉందనేది పవన్ కల్యాణ్ లోనూ ఉంది. ఎలాగైనా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇన్చార్జ్ ల పెత్తనం తగించాలనే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారు.
ఇక బీజేపీ వారు కూడా మల్లగుళ్లాలు పడుతున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంది. ప్రధాన మంత్రి నుంచి ప్రతి ఒక్కరూ ఏపీలో బీజేపీ అడుగులు ముందుకు పడేందుకు సహకరిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వారు నియోకవర్గాల్లో దూళితో సమానంగా చూస్తున్నారు. దీనిని ఎలా అరికట్టాలనే ఆలోచనలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఉన్నారు. పార్టీలోని ముఖ్య నాయకులు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు వారిని కలిసి మాట్లాడుతున్నారు. వారి సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి జిల్లాల్లో పార్టీని బలాన్ని మరింత పెంచేందుకు గ్రౌండ్ లెవెల్ లో ఆర్ఎస్ఎస్ సహకారం తీసుకుంటున్నారు.
ఈ ఏడాది ప్రథమంలో గన్నవరంలో జరిగిన బీజేపీ నిర్మాణ సభ ఎలా సక్సెస్ అయిందో ఇంటర్నల్ గా ప్రభుత్వం లోనూ అదే విధమైన సక్సెస్ సాధించాలనే ఆలోచనలో బీజేపీ వారు ఉన్నారు. బిజేపీ విశాఖ నాయకులు ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర సమావేశంలో తెలుగుదేశం తీరును తీవ్రంగా తప్పు పట్టారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రస్తుతం మాధవ్ అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో ఉన్నారు. ఈనెల 25న అమరావతిలోని వెంకటపాలెంలో అటల్ జీ విగ్రహావిష్కరణతో కార్యక్రమం పూర్తవుతుంది.
ఈ రెండు పార్టీలు తమ బలాన్ని పెంచుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలు ప్రధానంగా గ్రాస్‌రూట్ బలోపేతం, కేంద్ర సహకారం, ఆంతరిక సమావేశాలపై ఆధారపడి ఉన్నాయి. జేఎస్‌పీ విషయంలో, పవన్ కల్యాణ్ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావాన్ని తగ్గించడానికి ఎమ్మెల్యేలతో సమన్వయం పెంచుతున్నారు. బీజేపీ విషయంలో, ఆర్‌ఎస్‌ఎస్ సహాయంతో స్థానిక స్థాయిలో పార్టీని విస్తరించడం, కేంద్ర నాయకత్వంతో సమన్వయం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కూటమి ఐక్యతను 15 సంవత్సరాలు కొనసాగించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, క్యాడర్ మధ్య భావోద్వేగ ఘర్షణలు, సీట్లు పంచుకోవడంలో పూర్వ వివాదాలు ఇంకా పూర్తిగా తొలగలేదు. ఈ పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు దారి తీయవచ్చు, ముఖ్యంగా జేఎస్‌పీ, బీజేపీలు తమ స్వతంత్ర గుర్తింపును నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాయి.