మోదుకూరి డైలాగులు విన్నపుడంతా హాల్లో ఈలలు చప్పట్లే...
దార్శనిక సాహిత్య దీపధారి మోదుకూరి
చరిత్రలో దీపధారుల్ని (‘విజిల్ బ్లోయర్స్’) వారి స్థలకాలాలలో ఉంచి చూసినప్పుడే, వారి కాలానికి ముందు తర్వాతి సామాజిక సాంస్కృతిక పరిణామాలకు వాళ్ళు వారధి ఎలా అయింది సరితూకంగా ‘రికార్డు’ అవుతుంది.
అయితే సుప్రసిద్ద సినీ, నాటక రచయిత మోదుకూరి జాన్సన్ (1936- 1988) విషయంలో ఆయన కన్నుమూసి నలభై ఏళ్లు అవుతున్నా అది ఇంకా జరగలేదు. తెనాలి వద్ద కొలకలూరు నుంచి ఆయన అందరిలా మఖలో పుట్టి పుబ్బలో పోయిన బాపతు కాదు. ఆ ప్రాంతంలో రూపం తీసుకోవలసిన ఒక భవిష్యత్ పరిణామానికి మోదుకూరి ముందుగా రంగం సిద్దం చేశారు. ఈ ప్రాంతంలో ‘బకింగ్ హాం’ కాలవ నిర్మాణం నాటి (1806- 1882) సామాజిక ఆర్థిక సాంస్కృతిక చేతన మూలాల ప్రభావం యువ మోదుకూరిపై బలంగా ఉన్నాయి.
దానికి కారణంఉంది. సర్కారు జిల్లాల్లో గోదావరి తీరం హరిజన అభ్యుదయం వద్ద ఆగితే, కృష్ణా తీరంలోని గుంటూరులో ఆదశ దాటి 'దళిత క్రైస్తవ్యం' అంది! ఈ రెండు నదీ ప్రాంతాల మధ్య తేడాకు బలమైన హేతువు ఉంది. ‘బకింగ్ హాం’ కాల్వ నిర్మాణం పూర్తయ్యే 1885 నాటికి గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజి వచ్చింది. దాని ప్రతిఫలనాలు 55 ఏళ్ల క్రితమే మోదుకూరి రూపంలో మన తెలుగు ‘వెండితెర’పై మెరిశాయి. 1970లోఅదుర్తితో అక్కినేని సొంత చిత్రం ‘మరో ప్రపంచం’ తీయాలి అనుకుంటే, అప్పటికే దాని రచనకు 34 ఏళ్ల మోదుకూరి కొలకలూరు మాదిగ గూడెంలో సిద్దంగా ఉన్నాడు! చిత్రసీమలో కులవివక్ష కంచెను తన ఎడమ కాలితో పక్కకు నెట్టినవాడు జాన్సన్!
తెలుగు సాహిత్య చరిత్రలో కృష్ణాగోదావరుల మధ్య వైవిధ్యాన్ని ‘కాలం’ ప్రధానంగా చూసినప్పుడు, కులవివక్ష పట్ల పల్నాడు నివాసి గుఱ్ఱం జాషువా ఆర్ధ్రమైన ఆవేదన వద్ద ఆగితే, ఆవేశం ఎత్తుకు దాన్ని చేర్చింది మోదుకూరి. మహారాష్ట్ర 'దళిత్ పాంథర్స్' ప్రభావం నేరుగా మోదుకూరిపై ఉంది కనుకనే, బలమైన సినిమా ‘మీడియం’ ద్వారా దక్షిణ కోస్తా ‘హరిజన్’ను దళిత స్పృహ దశకు చేర్చి వారి చేతనలోని 'మిలిటెన్సీ' ఛాయలు తెరపై చూపాడు. మోదుకూరి రచన 'మానవుడు - దానవుడు ' (1972) శోభన్ బాబు పోషించిన జగన్ పాత్రలో ఆ ఆవేశాన్ని చూస్తాము. జాన్సన్ రాసిన "ఎవడురా దొంగ ఎవడురా..." అంటూ ఎస్వీఆర్ పాడే 'డాక్టర్ బాబు' (1973) సినిమా పాటలో మోదుకూరి ప్రశ్నలకు ఇంకా మన వద్ద జవాబులు లేవు! క్యారక్టర్ నటుడు కైకాల సత్యనారాయణ హీరోగా వచ్చిన ‘మొరటోడు' (1978) చిత్రంలో హీరో కారుణ్యమున్న మాంసం కొట్టు ఓనర్! ఆ చిత్ర నిర్మాత కారంచేడు నివాసి డి. రామానాయుడు. ఇక మోదుకూరి రచనతో విజయ చందర్ ‘కరుణామయుడు' (1978) తెలుగునాట ఇంటింటా జీసస్ ను పరిచయం చేసింది.
డెబ్భై ఎనభై దశకాల్లో మన సినీ నిర్మాతలు తీసింది కమర్షియల్ సినిమాలే. అప్పటి అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు వంటి వారికి హిట్ సినిమాలకు రచన చేశారు. అయినా, వాటి కధనాన్ని సంభాషణాలుగా లేదా పాటగా చెప్పేప్పుడు దొరికిన ప్రతి సందర్భాన్ని మోదుకూరి తనదైన వాదనకు వాడుకున్నాడు. సినిమా హాళ్లల్లో 70-80 దశకాల్లో డైలాగులకు ప్రేక్షకులతో ఈలలు వేయించిన రచయిత మోదుకూరి. ఇది ఎలా సాధ్యం అని చూడడానికి సినిమా హాలు నుంచి మోదుకూరిని బయటకు తెచ్చి ఆయన ఎందుకు దీపధారుడు (‘విజిల్ బ్లోయర్’) అయ్యాడు చూడాలి. జాన్సన్ సినిమా ప్రవేశానికి సరిగ్గా ఏడాది ముందు ఇదే తెనాలి ప్రాంతం నుంచి కమ్యూనిస్టు నేపధ్యం నుంచి వచ్చిన బొల్లిముంత శివరామకృష్ణ రచన ‘మనుష్యులు మారాలి’ (1969) వద్ద ఆగితే, ఏ వామపక్ష నేపధ్యం లేని జాన్సన్ ఆ మనుష్యులని మనమే మార్చాలి అనే ‘లైన్’ తీసుకున్నారు.
అందుకు మొదట సృజనకారులు మారాలి అనేది స్వతహాగా జాన్సన్ ‘లైన్’. ఈ చిన్న ఉదంతంలో ఈ విషయంలో ఆయన ప్రమాణాలు ఎటువంటివో అర్ధం అవుతాయి. తెనాలి వద్ద కొలకలూరులోని మిత్రులు కొందరు మోదుకూరి సంస్మరణ ప్రచురణ తీసుకు రావాలని 2003లో అనుకున్నారు. ఆ పనిలో భాగంగా పద్మశ్రీ బోయ భీమన్నను సీనియర్ జర్నలిస్టు ఆర్. భరద్వాజ కలిసి మోదుకూరితో భీమన్న అనుబంధం వివరాలు ‘రికార్డు’ చేసారు. “ఏపీ అనువాద శాఖలో మావద్ద కొన్నాళ్ళు ఆయన పనిచేశారు. నేను జాన్సన్ తో నువ్వు మీ ‘మోదుకూరి’ ఇంటి పేరుతో చెలామణి అయితే నీకు మంచిది, నీ పేరు పెట్టుకోవద్దు అని చెప్పాను, మొండివాడు నా మాట వినలేదు” అని భీమన్న తనతో చెప్పినట్లు భరద్వాజ రాశారు. ‘కెరియర్’ విషయంలో జాన్సన్ ఎంత ఉపేక్ష భావంతో ఉండేవారో తెలిపే విషయమిది.
అదే జరిగింది. అతడు మోదుకూరా? లేక జాన్సనా? అనే పట్టింపు లేకుండా యాభై ఏళ్ల క్రితం తెలుగు సినిమా ‘మార్కెట్’ కేవలం ఆయన ప్రతిభకు పట్టం కట్టింది. ఆయనకు ‘కెరియరిజం’ అంటే తెలీదు. తన సాహితీ జీవితమంతా అతడొక ‘మండుతున్న పొద’. చెన్నైలో 1983లో మహాకవి శ్రీశ్రీ కన్నుమూసినప్పుడు పాడె మోసిన జాన్సన్ అప్పటికే నేరుగా తెలుగు వైతాళికుల జాబితాలో ఉన్నారు. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశంతో మోదుకూరి రెండు సినీ దశాబ్దాలు పాటు ‘సినిమా మీడియం’ ద్వారా తెచ్చిన విస్మృత వర్గ చైతన్యం, తొలి కదలికలు దక్షణ కోస్తా కాల్వపక్కన ఊళ్ళల్లో దళిత యువత కార్యాచరణకు కారణమయ్యాయి. ఎనభై దశకంలో దక్షణకోస్తా సామాజిక చరిత్రలో రికార్డు అయిన కారంచేడు చుండూరు ఘటనలు డెబ్భై దశకానికి కొనసాగింపు. అంతిమంగా అది 'దళిత మహాసభ' స్థాపనకు (1985) కారణమైంది. మోదుకూరి 1988లో కన్నుమూసినా, రెండు కాలాల మధ్య వారధిగా ఈ నేలపై ఆయన నాటిన చేతన విత్తనాలు వృక్షాలై బలమైన దళిత తాత్వికతతో తదనంతర కాలంలో- ఎస్సీ వర్గీకరణ, గుంటూరును ఐదు జిల్లాలుగా చేసిన ప్రాంతీయ విభజనకు దారితీసింది.