తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు || పటిష్ట భద్రతా ఏర్పాట్లు..!

సెప్టెంబర్ 24 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ ముందస్తు చర్యలు;

Update: 2025-08-02 13:43 GMT

తిరుమలలో ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి ప్రారంభమయ్యే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై టీటీడీ సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ ఆధ్వర్యంలో విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం నాడు ఒక సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ తెలిపారు. పెద్దశేష వాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం వంటి ముఖ్యమైన రోజుల్లో భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు.
వాహన సేవలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News