ఎన్జీ రంగాతో నాది ప్రత్యేక అనుబంధం
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వ్యవసాయ యూనివర్సిటీకి ఎన్జీ రంగా పేరు పెట్టాం. విభజన తర్వాత నవ్యాంధ్రలో వ్యవసాయ వర్సిటీకీ ఆయన పేరు పెట్టాం. రూరల్ డెవలప్ మెంట్‌పై నేను పీహెచ్‌డీ చేయాలనుకున్నప్పుడు రంగా రచనలు, అధ్యయనాలే నాలో స్పూర్తిని నింపాయి. 33 ఏళ్ల వయసులోనే ఆయన ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. వెంకటగిరి జమీందారీ అణచివేతకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచారు. 1964లో 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రసంగించి రైతు భూమిని కట్టడి చేసే చట్టాన్ని ఆయన ఆపారు. ఎన్జీ రంగా 50 ఏళ్ల పాటు పార్లమెంటెరియన్ గా చేసిన సేవలకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డులకు ఎక్కడం అరుదైన గౌరవం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
‘తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతు సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గి ఉత్పత్తి పెరగాలి. 2014-2019 మధ్య కాలంలో వ్యవసాయ రంగం జీఎస్ డీపీలో 16.6 శాతం వృద్ధి రేటు సాధించింది. గత ఐదేళ్ల పాలనలో 10 శాతానికి తగ్గిపోయింది. 2024-25లో 15.45 శాతానికి పెంచాం. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రైతులు రోడ్డున పడ్డారు. రబీలో 48 లక్షల ధాన్యం కొనుగోలుకు రూ. 6 వేల కోట్లు మాత్రమే చెల్లించి రూ. 1,674 కోట్లు బకాయిలు పెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బకాయిలు క్లియర్ చేశాం. 2024 -25లో 55 లక్షల 79 వేల టన్నుల ధాన్యాన్ని రూ. 12,857 కోట్లకు కొనుగోలు చేశాం. 8 లక్షల రైతులకు 24 గంటల్లోనే వారి అకౌంట్లకు నగదు జమ చేశాం. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7 వేలు జమ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
95 శాతం పంట బీమా చెల్లించాం
‘ ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో టెక్నాలజీ వినియోగించి ఇటీవల తుఫాను నష్టాన్ని గణనీయంగా తగ్గించాం. విపత్తుల్లో నష్టపోయిన రైతులకు 2014-19లో హెక్టారుకు రూ. 20 వేలు అందిస్తే గత ప్రభుత్వం దాన్ని రూ. 17 వేలకు తగ్గించింది. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రూ. 25 వేలకు పెంచాం. మూడేళ్లు పంటల బీమా సొమ్ము ఎగ్గొట్టినవారు విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే 95 శాతం పంట బీమా చెల్లించాం. మామిడికి రూ. 240 కోట్లు అదనంగా గిట్టుబాటు ధర ఇచ్చాం. పొగాకుకు రూ. 273 కోట్లు ఖర్చు చేశాం. కోకో రైతుకు రూ. 14 కోట్లు ఇచ్చాం. కాఫీకి 50 కేజీల చొప్పున ఎకరాకు రూ. 5 వేలు ఇచ్చాం. మిర్చికి రూ. 130 కోట్లు, టమాటాకు రూ. 12 కోట్లు, ఉల్లి దెబ్బ తిన్న చోట హెక్టారుకు రూ. 50 వేల చొప్పున రూ. 100 కోట్లు వ్యయం చేశామని ముఖ్యమంత్రి వివరించారు.
సమర్థ నిర్వహణతోనే నీటి భద్రత
సమర్థ నీటి నిర్వహణ, ముందస్తు చర్యల వల్ల రిజర్వాయర్లు 95 శాతం నిండాయి. గత ప్రభుత్వంలో రిజర్వాయర్ల గేట్లను కూడా నిర్వహించలేకపోయారు. ఎన్టీఆర్ స్పూర్తితో జలాశయాలను పూర్తిచేశాం. రాయలసీమలో కరువును జయించాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ , మిగిలిన వారికి 50 నుంచి 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. కౌలు రైతులు అధైర్యపడొద్దు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. అన్ని విధాలా ఆదుకుంటాం. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పండించిన పంటలను కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకు కారణం రసాయన ఎరువుల వాడకమే. సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, పంటలకు సేంద్రీయ ఎరువులను మాత్రమే వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు సూచించారు. అనంతరం ఆధునిక రాజ్యాంగ వ్యవస్థలు అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు, తదితరులు హాజరయ్యారు.