రిజిస్ట్రార్‌ ఆఫీసులపై చుట్టపు చూపు దాడులా?

రాష్ట్రంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడుల తీరు చర్చనీయాంశంగా మారింది.

Update: 2025-11-07 15:20 GMT
ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి జగమెరిగిన సత్యం. ఆ సంగతి అటు జనానికీ, ఇటు ప్రభుత్వానికీ బహిరంగ రహస్యం. అందువల్ల భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారు అక్కడ లంచాల గురించి మానసికంగా సిద్ధపడతారు. కొనుగోలుదార్లు, రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో సిబ్బందికి మధ్య దస్తావేజు లేఖర్లే (డాక్యుమెంట్‌ రైటర్లు) దళారులుగా వ్యవహరిస్తారు. మిగతా ప్రభుత్వ శాఖల్లో చాటుమాటుగా అవినీతి, లంచాల వ్యవహారాలు సాగుతుంటాయి. కానీ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో మాత్రమే పబ్లిక్‌గా జరుగుతాయి. అయినా అక్కడ అవినీతి గురించి ఏ ప్రభుత్వమూ సీరియస్‌గా తీసుకోదు. ఇక అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కూడా అంతగా పట్టించుకోదు. ఎవరైనా ఫలానా రిజిస్ట్రార్‌ ఆఫీసులో అవినీతి పెచ్చుమీరుతుందనో, అదుపు తప్పుతుందనో ఫిర్యాదు చేస్తేనే అక్కడకు వెళ్లి తనిఖీలు చేస్తుంటారు. లేదంటే అటుపక్కే తొంగి చూడరు. దీంతో కొన్నాళ్లకు అక్కడ మామూళ్ల తంతు షరామామూలే. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి లేకుండా ఒక్క సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయా రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏడాదికి సగటున ఒకట్రెండు సార్లు కూడా ఏసీబీ దాడులు జరగడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని రిజిస్ట్రార్లు, వారి సిబ్బంది నిర్భీతిగా, నిశ్చింతగా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి ఏసీబీ దాడులు చేస్తుందన్న సమాచారం ముందుగానే రిజిస్ట్రార్‌ ఆఫీసులకు ముందుగానే ఉప్పందుతోంది. దీంతో వారు ఏసీబీ అధికారులు తనిఖీలకు రాకముందే సెలవుపై వెళ్లిపోతున్నారు. దీన్నిబట్టి ఏసీబీ, రిజిస్ట్రార్‌ ఆఫీసుల సిబ్బంది మధ్య ఎంతటి సత్సంబంధాలున్నాయో స్పష్టమవుతుంది.


రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఏసీబీ సిబ్బంది

అక్రమాలు, అవకతవకలు ఇలా..
స్టాంపు డ్యూటీ, చలానా, రిజిస్ట్రేషన్‌ ఫీజు వంటివన్నీ బ్రోకర్లే చూస్తారు. గతంలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సంబంధిత రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోనే చేయించుకోవలసి వచ్చేది. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ఆ నిబంధనను సడలించి రాష్ట్రంలో ఏ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనైనా (ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌) చేయించుకునే వెసులుబాటు కల్పించింది. ఇదే వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇలా ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌లో ఎక్కువ అవకతవకలు జరుగుతున్నట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. కొన్నిచోట్ల డాక్యుమెంట్‌ రైటర్లు, బ్రోకర్లు, రిజిస్ట్రార్లు, కార్యాలయాల సిబ్బంది, అధికారులు కుమ్మక్కై.. నిషేధిత భూములను కలెక్టర్‌ అనుమతి లేకుండా తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా మామూళ్లు ఇవ్వని వారికి ఏవేవో కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. మామూళ్లిస్తే లోపాలున్నా ఓకే అంటున్నారు. ఒక్కో లిటిగేషన్‌/లొసుగుకు ఒక్కో రేటు నిర్ణయించి అక్రమాన్ని సక్రమం చేస్తున్నారు. ఇలా కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు రూ.లక్షల్లో మూమూళ్లు వసూలు చేస్తున్నారు.
కాసులు కురిపించే చోటకు రూ.లక్షలు చెల్లించి..
కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు ఏడాదిలోనే రూ.కోట్లను కురిపిస్తున్నాయి. అలాంటి చోట పోస్టింగ్‌ కోసం పై అధికారులకు సబ్‌ రిజిస్ట్రార్లు రూ.లక్షల్లో ముడుపులు సమర్పించుకుంటున్నారు. అందువల్ల బహిరంగంగానే వీరు భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు. కొంతమంది ఏసీబీ అధికారులు/ సిబ్బందిని కూడా ప్రసన్నం చేసుకుని తమ జోలికి రాకుండా చూసుకుంటారన్న ఆరోపణలున్నాయి. అలాంటి వారి నుంచి దాడులపై ముందస్తు సమాచారం అందిస్తున్నారన్న ప్రచారం ఉంది.
ఒక్కో పనికి ఒక్కో రేటు..
సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అవినీతి ఒకే మాదిరిగా ఉండదు. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయిస్తారు. అవతలి వ్యక్తి అవసరాన్ని, అత్యవసరాన్ని, లొసుగులను గుర్తించి అందుకనుగుణంగా బేరం కుదుర్చుకుంటారు. వివాదాల్లో ఉన్న భూములకు సెప‘రేటు’ ఉంటుంది. ఇక సాధారణ రిజిస్ట్రేషన్ల విషయానికొస్తే రిజిస్ట్రేషన్‌ విలువలో సగటున ఒక శాతం మొత్తాన్ని రిజిస్ట్రార్, ఆఫీసు సిబ్బందికి లంచంగా చెల్లించాల్సిందే. ఆ సొమ్మును పర్సంటేజిల ప్రకారం పంచుకుంటారు. గతంలో దస్తావేజు లేఖర్ల ద్వారా మామూళ్ల వసూలు జరిగేది. ఇప్పడు నేరుగా కాకుండా తమ బినామీలకు ఫోన్‌/గూగుల్‌ పేల ద్వారా చెల్లింపులు చేయించుకుంటున్నారు. ఎవరికీ దొరక్కుండా కొన్నాళ్ల తర్వాత మరో నంబరు ఇస్తున్నారు.
నేరుగా రిజిస్ట్రేషన్లు చేయించుకునే వీలున్నా..
దళారులు/డాక్యుమెంట్‌ రైటర్లతో పనిలేకుండా నేరుగా రిజిస్ట్రేషన్లు చేయించుకునే వీలున్నా ఎక్కడా అది అమలు జరగడం లేదు. ఒక్క శాతం మంది కూడా అలా చేయించుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా అలా వెళ్తే వారికి చుక్కలు చూపిస్తారు. సవాలక్ష కొర్రీలతో వెనక్కి పంపుతారు. ఆ బాధలు పడలేక బ్రోకర్లను ఆశ్రయించి వారితో తమ పనులు/రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
ఒక శాతం మామూళ్లివ్వాల్సిందే..
ఇక సాధారణంగా జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రేషన్‌ విలువలో ఒక శాతం సొమ్మును రిజిస్ట్రార్‌కు, కార్యాలయ సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ వాల్యూలో 7.5 శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. మామూళ్లు మరో శాతం ఇవ్వాలి. ఈ లెక్కన పది లక్షల విలువైన ఆస్తికి రూ.8 వేలు లంచంగా సమర్పించుకోవాలి. దీనికి దస్తావేజు లేఖరి ఫీజు అదనం. డాక్యుమెంట్‌ రైటర్‌ ఉదయమే తన రిజిస్ట్రేషన్లు ఎన్ని ఉన్నాయో రిజిస్ట్రార్లకు చెబుతారు. సాయంత్రానికి ఆ మేరకు మామూళ్లు చెల్లిస్తాడు. లెక్కల్లో తేడా వస్తే తర్వాత రిజిస్ట్రార్‌ నుంచి ఇబ్బంది వస్తుందన్న భయంతో లేఖర్లు చెల్లింపులు జరుపుతారు.
గోడకు వేలాడే దిష్టిబొమ్మలవి..
రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లావాదేవీలు నిర్వహించుకునే వారి కోసం నిబంధనలు, సదుపాయాలు తెలియజేసే సిటిజన్‌ చార్టర్‌ గోడలకు వేలాడదీసి ఉంటాయి. రిజిస్ట్రేషన్‌ పేపర్లు ఎన్ని రోజులు/గంటల్లో పూర్తి చేస్తారో అందులో ఉంటాయి.. వాటిపై నిబంధనలతో పాటు లంచాలకు తావులేదని తాటికాయంత అక్షరాలూ కనిపిస్తాయి. కానీ వాటిని అమలు చేసేవారు గాని, పాటించే వారు గాని ఉండరు. దీంతో అవి గోడకు వేలాడే దిష్టిబొమ్మలుగానే దర్శనమిస్తాయి.
రెండ్రోజుల పాటు ఏసీబీ దాడులు..
చాలా రోజుల తర్వాత బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. అక్రమాలు, అవినీతి ఆరోపణలు అత్యధికంగా ఎదుర్కొంటున్న విశాఖçలోని పెదగంట్యాడ, మధురవాడ, జగదాంబ సెంటర్, విజయనగరం జిల్లా భోగాపురం, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు జిల్లా స్టోన్‌హౌస్‌పేట, తిరుపతి జిల్లా రేణిగుంట, సత్యసాయి జిల్లా చిలమత్తూరు, అన్నమయ్య జిల్లా రాజంపేట, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేపట్టారు. ఆయా ఆఫీసుల తలుపులు మూసేసి, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రాత్రిళ్లు పొద్దుపోయే దాకా రికార్డులను తనిఖీ చేశారు.
ఏసీబీ అధికారుల రాకతో పరుగో పరుగు..
ఏసీబీ అధికారులు తనిఖీలకు రావడంతో కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల ఆఫీసు సిబ్బంది నుంచి ఏసీబీ అధికారులు లెక్క చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వోద్యోగులతో పాటు అనధికారికంగా నియమించుకున్న ప్రైవేటు ఉద్యోగులనూ గుర్తించారు. ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ మొదటి అంతస్తులోని జాయింట్‌ 1, 2 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఏసీబీ అధికారుల రాకను గమనించి కొందరు కిందకు రూ.30 వేల నగదు విసిరేశారు. వాష్‌రూమ్‌లో మరో రూ.18 వేలను గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో రూ.74,600 క్యాష్‌ను, నరసారావుపేటలో రూ.35 వేల నగదును, స్టోన్‌హౌస్‌పేటలో కొంత నగదును, ఆ సొమ్ము ఎవరు దాచారు? రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎంతమేర చేతులు మారుతున్నాయి? అన్న దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
తరచూ దాడులతోనే అవినీతికి అడ్డుకట్ట..
స»Œ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో బహిరంగంగా జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట పడాలంటే ఏసీబీ ఎప్పుడో ఒకసారి కాకుండా తరచూ దాడులు చేయడమే పరిష్కారంగా కనిపిస్తోంది. ఎప్పుడో ఫిర్యాదులు అందినప్పుడే తనిఖీలకు వస్తారన్న ధీమా రిజిస్ట్రార్లు, సిబ్బందిలో బలంగా పాతుకుపోయింది. పైగా ఒక్కోసారి ముందుగానే వారి రాక సమాచారం కూడా లీకవుతోంది. దీంతో ఇష్టారాజ్యంగా అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమాలకు కొంతవరకైనా ఫుల్‌స్టాప్‌ పడుతుందన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News