కర్నూలు బస్సు ప్రమాదం, వైసీపీ శ్రేణులపై కేసులు
కర్నూలు పోలీసులు శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలనికి వెళ్లి నోటీసులు అందజేశారు.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో అక్టోబర్ 24, 2025న జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సు అక్రమ మార్పులు (సీటర్‌ను స్లీపర్‌గా మార్చడం), లగేజీలో అక్రమంగా తరలిస్తున్న మొబైల్ ఫోన్లు పేలడం వంటి కారణాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అయితే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు కల్తీ మద్యం, బెల్ట్ షాపుల వల్లే జరిగిందంటూ దుష్ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కర్నూలు పోలీసులు 27 మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేశారు. వీరిలో యాంకర్ ఆరే శ్యామల (వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి), సీవీ రెడ్డి, కందుకూరి గోపీకృష్ణ, పార్టీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు. అక్టోబర్ 31న కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసులు రిజిస్టర్ అయ్యాయి.
నవంబర్ 4న ఆరే శ్యామల పోలీసు విచారణలో "ప్రమాద కారణాలు తెలియవు, పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివాను" అని అంగీకరించినట్లు సమాచారం. తాజాగా శుక్రవారం నాడు తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్రకార్యాలయానికి వెళ్లారు. వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి కూడా నోటీసులు జారీ చేశారు. మరో వైపు ప్రమాదపు ఘటనకు సంబంధించి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను ఇంతకుముందే అరెస్టు చేశారు.
అయితే వైఎస్ఆర్‌సీపీ ఈ కేసులను "కక్ష సాధింపు రాజకీయాలు" అంటూ ఖండిస్తోంది. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ కేసు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో అని ఆసక్తి నెలకొంది.