లక్నోలో BSP మాయవతి మెగార్యాలీ దేనికి సంకేతం?

ఉత్తర్ ప్రదేశ్‌లో ఏనుగు గుర్తు పార్టీ మళ్లీ పుంజుకుంటుందా?;

Update: 2025-09-12 12:01 GMT
Click the Play button to listen to article

ఉత్తరప్రదేశ్ (Utter Pradesh) రాజకీయాల్లో ఓడిపోయిన బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తిరిగి పుంజుకునేందుకు సిద్ధమవుతుందా? BSP వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వర్ధంతి (అక్టోబర్ 9) సందర్భంగా లక్నోలో చేపట్టే మెగా ర్యాలీ అందులో భాగమేనా?

బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) దాదాపు పదేళ్ల పాటు స్తబ్దుగా ఉన్నారు. ఉన్నట్టుండి లక్నోలో మెగా ర్యాలీకి ప్లాన్ చేశారు. కార్యక్రమం విజయవంతానికి పార్టీ శ్రేణలు, నాయకులకు బాధ్యతలు కూడా అప్పగించారు. అక్టోబర్ 9 వరకు ఆమె తన కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసుకుని కేవలం ఈ కార్యక్రమంపైనే దృష్టి పెట్టారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మాయావతి మెగా ర్యాలీ వెనక సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తన రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసరడానికి మాయవతి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారన్న ప్రచారం ఉంది. 2014 నుంచి బీఎస్పీ రాజకీయాల్లో తన ప్రబల్యాన్ని కోల్పోయింది. 2016 నుంచి మాయావతి లక్నోలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించలేదు.


పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం..

గతంలో కాన్షీరాం వర్ధంతిని పార్టీ నిర్వహించింది. కానీ ఆ కార్యక్రమాలు జిల్లా స్థాయికే పరిమితమయ్యాయి. కాని అక్టోబర్ 9న జరిగే ర్యాలీకి మాత్రం పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆహ్వానం పంపారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నది మాయవతి ఆకాంక్ష. ఈ మేరకు ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. నాయకులు, సమన్వయకర్తలకు బాధ్యతలు అప్పగించి జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా హాజరయ్యేలా చూడాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. 'చలో లక్నో' నినాదం..పార్టీ భవిష్యత్తు, లక్ష్యాలను వివరించడానికి వేదిక అవుతుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.


బీహార్, యూపీ ఎన్నికలలో పోటీ..

పార్టీ పునరుజ్జీవనం కోసం మాయావతి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ ఉనికికి వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాబోయే పంచాయతీ ఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా తాము పోటీ చేస్తామని మాయావతి ఇప్పటికే ప్రకటించారు.


ఆకాష్ గురించి మాట్లాడతారా?

తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు మాయావతి పెద్ద బాధ్యత అప్పగించారు. బీహార్ ఎన్నికల బాధ్యతను కట్టబెట్టారు. పార్టీ జాతీయ సమన్వయకర్తగా నియమించడంతో పార్టీలో రెండో అతి ముఖ్యమైన నాయకుడిగా ఆయనకు పేరు. మార్చిలో పార్టీ నుంచి బహిష్కరించిన మాయవతి.. తిరిగి ఆకాష్‌ను మేలో జాతీయ సమన్వయకర్తగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదికపై నుంచి ఆకాష్ గురించి మాయావతి ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడతారా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

BSP మెగా ర్యాలీని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ కపూర్ పార్టీ పునరుజ్జీవన ప్రణాళికగా అభివర్ణించారు.

"చాలాఏళ్లుగా మాయావతి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సలహా ఇస్తూనే ఉన్నారు. అందుకే ఆమె ప్రత్యర్థులు మాయవతిని బీజేపీ 'బి టీం'గా చెబుతుంటారు. అంబేద్కర్, రాజ్యాంగం, దళిత సమస్యలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ పీడీఏ (పిచ్డా, దళిత్, అల్పసంఖ్యాక్) ఏర్పాటు చేసి వారి మద్దతు కూడగడుతున్నారు. ఇలాంటి సందర్భంలో మాయావతి తన ఓటర్లకు, తన ప్రత్యర్థులకు బలమైన సందేశాన్ని పంపే అవకాశం ఉంది,”అని అన్నారు.


బాగా పడిపోయిన పార్టీ గ్రాఫ్..

దశాబ్ద కాలంగా పార్టీ ప్రాబల్యం తగ్గిన నేపథ్యంలో.. ఈ మెగా ర్యాలీ బీఎస్పీ, మాయావతికి చాలా కీలకం. 2007 నుంచి 2012 వరకు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మమత.. ఆ తర్వాత ఎన్నికల్లో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 80 సీట్లకు పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. తిరిగి 2017 ఎన్నికలలో 19 సీట్లకే పరిమితమైంది. 2022 ఎన్నికలలో గెలిచింది ఒక్కరంటే ఒక్కరే. ఓట్ షేర్ కూడా బాగా పడిపోయింది. 2007లో 30 శాతం ఉన్న ఓట్ షేర్ 2022కి 12 శాతానికి తగ్గింది. మాయవతి తర్వాత అంతటి సమర్థవంతమైన నాయకుడు పార్టీలో లేకపోవడం మరో కారణం. అనేక మంది సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం మరో మైనస్.

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ వేదిక ద్వారా మాయవతి పార్టీ శ్రేణులకు పరోక్షంగా సందేశం పంపుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తిరిగి చురుకైన పాత్రకోసం ఈ వేదిక ఉపయోగపడుతుందేమో చూడాలి. 

Tags:    

Similar News