వైజాగ్ బీచ్‌లో మారథాన్ సోయగం!
విశాఖ సాగరతీరంలో ఆదివారం నిర్వహించిన నేవీ మారథాన్ ఎందరిలోనో స్ఫూర్తిని నింపింది.
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-12-14 11:49 GMT
సూర్యుడు అప్పటికింకా మేల్కొనలేదు. తూర్పు ఇంకా తెల్లారనే లేదు. ఆదివారం విశాఖ సాగరతీరం మాత్రం జనసంద్రమైపోయింది. వేలాది మందితో కిక్కిరిసిపోయింది. ఒకపక్క నీలి సముద్రం.. మరోపక్క నీలిరంగు దుస్తులు ధరించిన జనం. తమలోని ఉత్సాహాన్ని ఉరకలెత్తించడానికి నగరంలోని ఆర్కే బీచ్‌కు గబగబా చేరుకున్నారు. వీరిలో చిన్న. పెద్ద తేడా లేదు. స్త్రీ, పురుష బేధం లేదు. వయసుతో పనీ లేదు. వీరంతా తూర్పు నావికాదళం నిర్వహించిన మారథాన్‌లో పాల్గొనడానికి ఉరుకులు, పరుగులతో వచ్చారు.
విశాఖ బీచ్‌లో నేవీ మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు
నావికాదళ దినోత్సవం సందర్భంగా..
నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఇండియన్ నేవీ విశాఖలో మారథాన్‌ను నిర్వహిస్తుంది. ఆర్కే బీచ్ వేదికగా ఇది జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఆదివారం ఈ మారథాన్‌ను నిర్వహించింది. ఇండియన్ నేవీకి పదవ ఎడిషన్ ఇది. ఈ మారథాన్ పోటీలపు నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించారు. 42 కిలోమీటర్లు ఎయిర్‌క్రాఫ్ట్ మారథాన్, 21 కిలోమీటర్ల సబ్‌మెరైన్ హాఫ్ మారథాన్, , 10 కిలోమీటర్ల ఎయిర్‌క్రాఫ్ట్ రన్, 5 కిలోమీటర్ల ఫ్రిగేట్ రన్‌ను నిర్వహించారు. ఈ మారథాన్‌లో దాదాపు 18 వేల మంది పాల్గొన్నట్టు అంచనా. వీరిలో నావికాదళ సిబ్బందితో పాటు పోలీసులు, ఉద్యోగులు, నగరవాసులు ఉన్నారు. ఇంకా 17 దేశాల నుంచి 35 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వెయ్యి మంది సిబ్బంది, రెండు వేల మంది వరకు వలంటీర్లు సేవలందించారు.
మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్
ఆదివారం వేకువజామునే..
ఆదివారం తెల్లవారుజామున తొలుత 42 కిలోమీటర్ల మారథాన్‌ను తూర్పు నావికాదళ ప్రధానాధికారి (ఈఎన్‌సీ) సంజయ్ భళ్లా ప్రారంభించారు. అనంతరం 21 కి.మీల హాఫ్ మారథాన్‌ను నేవీ వెల్ఫేర్ అండ్ వెల్‌నెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ఈఎన్‌సీ సతీమణి ప్రియ భళ్లా, 10 కిలోమీటర్ల 10కె రన్‌ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, 5 కి.మీల 5కె రన్‌ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు శ్రీకారం చుట్టారు. మారథాన్ విశాఖ ఆర్కే బీచ్‌లోని విశ్వప్రియ ఫంక్షన్ హాలు నుంచి ప్రారంభమై భీమిలి వరకు నిర్దేశిత ప్రాంతాల్లో కొనసాగింది. ఈ మారథాన్‌లో పాల్గొన్న వారికి డ్రై ఫ్రూట్స్, టీ షర్ట్స్, వాటర్ బాటిళ్లను అందించారు. వీరికి సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేశారు.
మారథాన్‌లో పాల్గొనడానికి వచ్చిన బాలికలు
ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికే..
ఈ సందర్భంగా తూర్పు నావికాదళ ప్రధానాధికారి సంజయ్ భళ్లా మాట్లాడుతూ ఇండియన్ నేవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మానసిక ఒత్తిడికి గురవుతున్న ప్రజలను ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమేనని చెప్పారు. ఇండియన్ నేవీ విశాఖపట్నం ప్రజలకు ఎంతో చేరువైందని, దానికి నిదర్శనమే ఈ రోజు మారథాన్‌లో పాల్గొన్న జనమని పేర్కొన్నారు. ఈ మారథాన్‌లో పాల్గొన్న వారికి, మారథాన్ విజయవంతానికి కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశాలతో పార్కింగ్, హైడ్రేషన్ పాయింట్లు, వైద్య సదుపాయాలు, ఇతర అత్యవసర సేవలు అందించారు. దీంతో ఈ సుదీర్ఘ మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించగలిగారు.