‘ఈసీ అండతోనే అధికార పీఠం..’

'ఓటు చోర్ గడ్డి చోడ్' ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

Update: 2025-12-14 13:10 GMT
Click the Play button to listen to article

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandh) ఎలక్షన్ కమిషన్‌(Election Commission)‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి భారతీయ జనతా పార్టీ (BJP) కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. బీహార్(Bihar) ఎన్నికల సమయంలో బీజేపీ రూ. 10వేలు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినా ఎలక్షన్ కమిషన్ వారిపై ఏ చర్య తీసుకోలేదని మండిపడ్డారు. 'ఓటు చోర్ గడ్డి చోడ్' పేరిట కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం (డిసెంబర్ 14న) భారీ ర్యాలీ నిర్వహించింది. సత్యం, అసత్యానికి మధ్య జరుగుతోన్న ఈ పోరాటంలో చివరకు సత్యమే విజయం సాధిస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈసీకి అనుకూలంగా ప్రధాని మోదీ తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేస్తామన్నారు.


‘ఓటర్లు ప్రశ్నించాలి..’

వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. ‘‘ఎన్నికల ప్రతి దశలోనూ ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రజల ఓటు హక్కు దుర్వినియోగమవుతుంది. సమాధానం చెప్పాల్సిన ఎన్నికల అధికారులు మౌనంగా ఉంటున్నారు. సంస్థలు బలహీనపడినపుడు వాటి పనితీరును ఈ దేశపౌరులుగా మీరు నిలదీయాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను బీజేపీ ఎంతోకాలం రక్షించలేదు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘వారికి ధైర్యముందా? ’’

"బ్యాలెట్ పేపర్‌ ఆధారంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బీజేపీకి ఉందా? ఆ పద్ధతిలో తాము ఎప్పటికీ గెలవలేమన్న విషయం వారికి తెలుసు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా..బీహార్‌లో ప్రతి మహిళ బ్యాంకు అకౌంట్‌లో రూ. 10 వేలు జమ చేశారు. ఇది ‘ఓట్ చోరీ' కాకపోతే ఇంకేమిటి? బీహార్‌లో దొడ్డిదారిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ ఓటమిపై కార్యకర్తలు నిరుత్సాహపడవద్దు.’’ అని పేర్కొన్నారు.


బీజేపీ నేతలను 'గద్దర్లు'గా అభివర్ణించిన ఖర్గే..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే( Kharge) కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. "ఓటు చోరీ"లో పాల్గొన్న వారిని "గద్దర్లు" అని సంభోదించారు. ఓటు హక్కును, రాజ్యాంగాన్ని హరిస్తున్న వారిని గద్దె దింపాలి. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశాన్ని అంతం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని రక్షించగలదు. నా కొడుకు శస్త్రచికిత్స కోసం నేను బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే 140 కోట్ల మంది ప్రజలను కాపాడటానికి నేను ఇక్కడకు వచ్చాను.’’ అని చెప్పారు.  

Tags:    

Similar News