అదిగదిగో, నరసాపురానికి 'వందే భారత్' రైలు!

నరసాపురానికి 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు రేపట్నుంచి (డిసెంబర్ 15)అందుబాటులోకి రానుంది

Update: 2025-12-14 16:08 GMT
నరసాపురానికి 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు రేపట్నుంచి (డిసెంబర్ 15)అందుబాటులోకి రానుంది. రైలు నంబర్లు 20677/ 20678గా ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరికొన్ని గంటల్లో చెన్నై నుంచి నరసాపురం రైల్వే స్టేషన్‌కు చేరనుంది. ప్రస్తుతం చెన్నై సెంట్రల్–విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్‌ను నరసాపురం వరకు పొడిగించారు.
కేంద్ర మంత్రి చొరవతో నెల ముందే ప్రారంభం
మొదట ఈ సర్వీసును జనవరి 12న ప్రారంభిస్తామని రైల్వే బోర్డు ప్రకటించినప్పటికీ, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ చొరవతో ఒక నెల ముందుగానే జిల్లాకు వందే భారత్ రైలు రానుంది. ఈ మేరకు నరసాపురం రైల్వే స్టేషన్‌లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కూటమి నేతలు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం
వందే భారత్ రాక సందర్భంగా కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలు, ప్రత్యేక టికెట్లు అందజేస్తూ అతిథులను ఆహ్వానిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వందే భారత్ నరసాపురం స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌పైకి రానుంది.
చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురం
ప్రస్తుతం చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం 5.30కు బయలుదేరే వందే భారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా మధ్యాహ్నం 12.10కి విజయవాడ చేరుకుంటుంది.
పొడిగించిన సర్వీసు ప్రకారం, రైలు 11.45కి విజయవాడకు చేరుకుని 11.50కి అక్కడి నుంచి బయలుదేరి,
12.25కి గుడివాడ,
1.30కి భీమవరం,
2.10కి నరసాపురం చేరుకుంటుంది.
రైలు నంబరు 20678: నరసాపురం నుంచి చెన్నై సెంట్రల్ వరకు..
రైలు నంబరు 20678 మధ్యాహ్నం 2.50కు నరసాపురంలో బయలుదేరి,
3.20కి భీమవరం,
4.10కి గుడివాడ,
4.50కి విజయవాడ చేరుకుంటుంది.
అక్కడి నుంచి 4.55కు బయలుదేరి,
5.20కి తెనాలి,
6.30కి ఒంగోలు,
7.40కి నెల్లూరు,
8.50కి గూడూరు,
9.50కి రేణిగుంట మీదుగా,
రాత్రి 11.45కి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
నరసాపురం వరకు వందే భారత్ రైలు పొడిగింపుతో పశ్చిమ గోదావరి జిల్లాకు రైల్వే అనుసంధానం మరింత మెరుగుపడనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
Tags:    

Similar News