ఓటర్ అధికార్ యాత్ర: ఓట్ల దొంగతానానికి అనుమతించం’
బీజేపీ, ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజం..;
బీహార్(Bihar)లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఎన్డీఏ(NDA) ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్(Congress) నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆదివారం (ఆగస్టు 24) ఆరోపించారు. 'ఓటరు అధికార్ యాత్ర'లో భాగంగా బీహార్‌లోని అరారియాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ యువతకు ప్రధాని మోదీ(PM Modi) ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘ఇప్పుడు ఎన్నికల సంఘం(EC)తో కుమ్మకై SIR ద్వారా పేదల ఓట్లను దొంగించాలని చూస్తున్నారు. అలా జరగనివ్వం. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం సమాన హక్కు కల్పించింది. SIR రాజ్యాంగ విరుద్ధం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రదేశాలకు బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు," అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అన్నారు.
1,300 కి.మీ.ల 'ఓటరు అధికార్ యాత్ర' ఆగస్టు 17న ససారాం నుంచి ప్రారంభమైంది. ఇది 16 రోజుల పాటు 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో మెగా ర్యాలీతో ముగుస్తుంది.
అంతకుముందు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి బీహార్‌లో పూర్నియా జిల్లాలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఇద్దరు నాయకులను చూడటానికి ప్రజలు వీధుల్లో బారులు తీరారు.