తవ్వుతున్న కొద్ది బయటపడుతున్న ‘ఖేద్కర్’ లీలలు

దివ్యాంగుల ప్రయోజనాలను పొంది ఐఏఎస్ సాధించిన వివాదాస్పద అధికారిణి పూజా ఖేద్కర్ గురించి రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా తన వయస్సుకు సంబంధించిన..

Update: 2024-07-16 10:39 GMT

వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు సంబంధించి తవ్వుతున్న కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుత యూపీఎస్సీకి సమర్పించిన పత్రాల్లో ఆమె వయస్సులో వ్యత్యాసం రావడంతో అధికారులు పత్రాలను పరిశీలిస్తున్నారు.

2020లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్), 2023లో జరిగే UPSC పరీక్ష కోసం ఖేద్కర్ అందించిన వివరాలు, అప్లికేషన్‌ల మధ్య మూడు సంవత్సరాల గ్యాప్ ఉందని ఓ జాతీయ మీడియా పరిశోధనాత్మక కథనాన్ని ఆధారాలతో సహ బహిర్గతం చేసింది. ఇందులో వయస్సు తేడా చాలా స్పష్టంగా కనిపించింది.
అలాగే రెండు అప్లికేషన్ లలో కూడా రెండు పేర్లను వాడినట్లు కథనంలో ప్రచురించారు. 2020 లో రాసిన క్యాట్ పరీక్షలో ఖేద్కర్ పేరును పూజ దీలిప్రావ్, 2023 నాటి యూపీఎస్సీ పరీక్షలో పూజ మనోరమ దిలీప్ ఖేద్కర్ గా ఉన్నట్లు గుర్తించారు.
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 34 ఏళ్ల IAS అధికారి, ఖేద్కర్ సివిల్ సర్వీస్ పరీక్షకు అర్హత సాధించడానికి తనకు వైకల్యం ఉన్నట్లు చెప్పడంతో పాటు, అర్హత లేకున్నా ఓబీసీ ధృవీకరణను ఉపయోగించారని ఇప్పటికే అభియోగాలు నమోదు అయ్యాయి. వీటిపై విచారణ జరగుతుండగానే తాజాగా వయస్సుకు సంబంధించిన వివాదం కూడా బయటపడింది. పూణేలో పోస్టింగ్ సమయంలో ఆమె తన పదవిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన
పూణే పోలీసులు ప్రస్తుతం ఖేద్కర్ సమర్పించిన వైద్య ధృవీకరణ పత్రాల ప్రామాణికతను పరిశీలిస్తున్నారు. ఆమె సమర్పించిన పత్రాల్లో ఒకటి దృష్టిలోపం ఉందని పేర్కొంది. అహ్మద్‌నగర్‌లోని ఓ జిల్లా ఆసుపత్రి నుంచి దృష్టిలోపం, మానసిక కుంగుబాటుకు సంబంధించిన వైకల్య ధృవీకరణ పత్రాలు తీసుకున్నప్పటికీ, 2022 ఆగస్టులో రెండు పూణే ఆసుపత్రులలో వైకల్య ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది.
మీడియా నివేదికల ప్రకారం, ఆమె ఔంధ్‌లోని జిల్లా సివిల్ హాస్పిటల్, పూణేలోని యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్ రెండింటి నుంచి లోకోమోటర్ వైకల్యం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి.
దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఖేద్కర్ ఇప్పటికే 2018లో తక్కువ దృష్టి, 2021లో అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రి నుంచి మానసిక కుంగుబాటు, తక్కువ దృష్టి కోసం వైకల్య ధృవీకరణ పత్రాలను పొందారు. పూణేలోని ఔంధ్‌లోని జిల్లా సివిల్ హాస్పిటల్ "డబుల్ సబ్‌మిషన్" కారణంగా ఆమె దరఖాస్తును తిరస్కరించింది. అయితే పింప్రీలోని యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్ పాత ACL ఆమె కంటి పరీక్ష ఆధారంగా ఆమెకు 7 శాతం లోకోమోటర్ వైకల్య ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేసింది.
2007లో 'మెడికల్ ఫిట్'
ఈ ఆరోపణలు కొనసాగుతూ ఉండగా 2007లో పూణే మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కోసం ఖేద్కర్ సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ బయటపడింది. ఇందులో ఖేద్కర్ కు ఎలాంటి వైకల్యం లేదని "వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు" ఆ పత్రాల్లో ఉంది.
పూజా ఖేద్కర్ సమర్పించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లో శారీరకంగా లేదా మానసికంగా ఎలాంటి వైకల్యం ఉన్నట్లు ప్రస్తావన లేదని పూణేలోని కాశీబాయి నావాలే మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ బోరే జాతీయ మీడియాకి చెప్పారు.
ప్రస్తుతం మహారాష్ట్ర లోని వాషిమ్ జిల్లాలో పోస్టింగ్ లో ఉన్న ఖేద్కర్, డిజేబిలిటీస్ కింద దృష్టి లోపం ఉన్నట్లు సూచించే వైద్య ధృవీకరణ పత్రాలను UPSCకి సమర్పించారు. వీటికి సంబంధించి ఐదు సార్లు ఎయిమ్స్ లో పరీక్ష లు నిర్వహించడానికి ప్రయత్నించిన, ఖేద్కర్ ఏదో ఒక కారణంతో పరీక్షలను తిరస్కరిస్తూ వచ్చారు.
ప్యానెల్‌ను నియమించిన కేంద్రం ..
ఖేద్కర్ సమర్పించిన సర్టిఫికెట్లను ధృవీకరించాలని వికలాంగుల కమిషనర్ కార్యాలయం పూణే పోలీసులకు, జిల్లా కలెక్టరేట్‌కు లేఖ రాసింది. ఈ అంశంపై  సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “వికలాంగుల కమిషనర్ కార్యాలయం నుంచి మాకు లేఖ వచ్చింది.
పూజ ఖేద్కర్ సమర్పించిన సర్టిఫికెట్ల ప్రామాణికతను తనిఖీ చేయాలని వారు మమ్మల్ని కోరారు. మేము ఈ సర్టిఫికేట్‌ల గురించి వాస్తవాలను ధృవీకరిస్తాము, అవి ఎక్కడ నుంచి వచ్చాయి, ఏ వైద్యుడు లేదా ఆసుపత్రులు వాటిని ధృవీకరించాయో కూడా తనిఖీ చేస్తామని అని పోలీసు అధికారి తెలిపారు. ఖేద్కర్ వివాదాన్ని పరిశీలించడానికి, రెండు వారాల్లో నివేదికను సమర్పించడానికి కేంద్రం ఏక సభ్య కమిటీని గతవారం ఏర్పాటు చేసింది.
ఐఏఎస్ అధికారి ఖేద్కర్ అభ్యర్థిత్వం, క్లెయిమ్‌లు సహ ఇతర వివరాలను ధృవీకరించడానికి అదనపు సెక్రటరీ-ర్యాంక్ అధికారి ద్వారా విచారణ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఖేద్కర్ ను మహారాష్ట్ర ప్రభుత్వం వాషిమ్ కు బదిలీ చేశారు. అక్కడి వెళ్లిన తరువాత పోలీసులకు తెలియజేయగా, సోమవారం రాత్రి ముగ్గురు మహిళా అధికారులు రాత్రి 11 గంటలకు ఆమె ఇంటికి వచ్చారు. రెండు గంటల తర్వాత వారు తిరిగి వెళ్లిపోయారు. అయితే, అక్కడ ఏమి జరిగిందనేది బయటకు రాలేదు.
అయితే మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె ఖండించారు. తనపై మీడియా ట్రయల్ నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నియమాల ప్రకారం తాను ఇప్పుడు ఏం మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఖేద్కర్ తల్లిదండ్రులు కూడా పలు కేసుల్లో చిక్కుకున్నారు.
“మన రాజ్యాంగం నేరం రుజువయ్యే వరకు నిర్దోషి అనే వాస్తవంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, నన్ను దోషిగా నిరూపించే మీడియా విచారణ నిజానికి తప్పు. అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఇది ఆరోపణ అని మీరు అనవచ్చు కానీ ఇలా నన్ను దోషిగా నిరూపించడం తప్పు” అని ఆమె అన్నారు.
పరారీలో తల్లిదండ్రులు
వేరే క్రిమినల్ కేసులో ఆమె తల్లిదండ్రుల కోసం పూణె పోలీసులు కూడా వెతుకుతున్నారు. పూజ ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్, గ్రామ సర్పంచ్, భూవివాదానికి సంబంధించి కొంతమంది వ్యక్తులను తుపాకీతో బెదిరించినట్లు చూపించే వీడియో ఒకటి బయటకు రావడంతో ఖేద్కర్ తల్లితండ్రులతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పూజా ఖేద్కర్‌ వినియోగించిన లగ్జరీ కారుపై అక్రమంగా రెడ్‌ బీకాన్‌ లైట్‌ను అమర్చారని ఆరోపిస్తూ పూణె పోలీసులు ఆదివారం కారును జప్తు చేశారు.
Tags:    

Similar News