కుదిపేసిన 17ఏళ్ల బాలిక మరణం
బస్సులో వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. అక్కడ తగిన న్యాయం జరగదని ఆత్మహత్య చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. బస్సులో ఓ విద్యార్థి తన పట్ల వ్యవహరించిన తీరు, దీనిపై పోలీసులు రెస్పాండ్ అయిన తీరుకు తీవ్ర మనోవేదనకు గురైన ఓ విద్యార్థిని నిండు ప్రాణం తీసుకుంది.
పులేటిపల్లికి చెందిన స్పందన (17), ధర్మవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రతి ఉదయం కలలతో కళాశాలకు బయలుదేరే ఆమె ప్రయాణం, ఒక రోజు అనూహ్య మలుపు తిరిగి… ఆ చిన్నారి ప్రాణాలకే ముప్పు ఏర్పడింది.
బస్సులో విద్యార్థి అసభ్య ప్రవర్తన – అడ్డుకున్న స్పందనపై దాడి
ఎనిమిది రోజుల క్రితం, స్పందన సాధారణంగా రోజూ లాగే బస్సులో కళాశాలకు వెళ్తుండగా, ఓ విద్యార్థి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ధైర్యంగా అతన్ని మందలించిన స్పందనపై ఆ విద్యార్థి ఆగ్రహంతో బస్సులోనే రెండుసార్లు దాడి చేసినట్టు ప్రయాణికులు కూడా చూశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత స్పందన తీవ్ర భయభ్రాంతులకు గురైంది.
ధర్మవరం పోలీస్ స్టేషన్ మా పరిధి కాదు
భవిష్యత్తుపై కలలు కన్న చిన్నారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి న్యాయం కోరింది. అయితే ధర్మవరం పోలీసులు ఆ ఘటన తమ పరిధిలోకి రాదని, ఫిర్యాదు తీసుకోవడాన్ని తప్పించుకున్నారనే ఆరోపణలు బాధితురాలి కుటుంబం చేస్తోంది. బాధితురాలి వేదనను అర్థం చేసుకోకుండా తిరస్కరించడంతో స్పందన మనసును మరింత నొచ్చుకుంది.
పిలిపించి మందలిస్తాం.. అన్న మాట
నిరాశలో కూడా న్యాయం కోసం మరో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన స్పందన, చెన్నేకొత్తపల్లి పోలీసుల వద్ద కూడా తగిన విధంగా వాగ్దానం లభించలేదు. తనకు జరిగిన అవమానానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామనే మాట పోలీసుల నుంచి స్పందనకు రాలేదు. “వాడిని పిలిపించి మందలిస్తాం” అన్న మాట మాత్రమే పోలీసుల నుంచి రావడంతో స్పందన మరింత కుంగిపోయిందని కుటుంబం తెలిపింది. ఒక బాలికపై బస్సులో దాడి జరిగినా కేవలం “మందలింపు”తో సరిపెట్టాలనుకోవడం బాధితురాలైన స్పందనకు మనోధైర్యము కోల్పోయేలా చేసింది.
ఎనిమిది రోజుల జీవన్మరణ యుద్ధం
న్యాయం దొరకదనే భావనతో, తీవ్ర మనస్తాపంలో ఇంటికి తిరిగివచ్చిన స్పందన ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది రోజుల పాటు ఆమె మృత్యువుతో పోరాడింది.
అయితే చివరికి… బుధవారం స్పందన ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ఈ దుర్ఘటనతో పులేటిపల్లి గ్రామం మొత్తం విషాదంతో మునిగిపోయింది. అయితే ఈ దుర్ఘటనపై అటు కుటుంబ సభ్యుల్లోను, ఇటు స్థానికుల్లోను అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. ఒక బాలిక తీవ్ర వేధింపులకు గురై ఫిర్యాదు చేసినా, పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? మొదటి ఫిర్యాదే స్వీకరించి చర్య తీసుకుని ఉంటే స్పందన బతికి ఉండేదా? ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బాధ్యత ఎవరిది? అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.