BPSC Row: నితీష్ సర్కారుకు ప్రశాంత్ కిషోర్ 3 రోజుల డెడ్‌లైన్..
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలపై ఆ రాష్ట్రంలో సివిల్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలపై ఆ రాష్ట్రంలో సివిల్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త, జన్ సూరాజ్ పార్టీ (జెఎస్‌పి) చీఫ్ ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ ప్రభుత్వానికి మూడు రోజుల అల్టిమేటం జారీచేశారు.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని గత వారం చీఫ్ సెక్రటరీ అమృత్ లాల్ మీనాకు కిషోర్ లేఖ రాశారు. భవిష్యత్తులో అభ్యర్థులపై లాఠీచార్జి చేస్తే నిరసనకు దిగుతామని హెచ్చరించారు కూడా.
మూడు రోజుల అల్టిమేటం..
JSP చీఫ్ గురువారం (డిసెంబర్ 26) కూడా గర్దానీ బాగ్‌ను సందర్శించారు. డిసెంబర్ 13న నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని కొన్నిరోజులుగా ఆందోళన చేపడుతున్న సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. సోమవారం లోపు ప్రభుత్వం నుంచి స్పందకరాకపోతే అదే రోజు అభ్యర్థులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు.
లాఠీలకు భయపడను: కిషోర్
“విద్యార్థులకు మద్దతివ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.. సోమవారం విద్యార్థుల నిరసన ప్రదర్శనలో నేనూ పాల్గొంటాను. పోలీసులు లాఠీచార్జి చేస్తే మొదట నేనే ఎదుర్కొంటాను.” అని అన్నారు.
పోలీసుల లాఠీచార్జి..
ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (CCE) 2024ని రద్దు చేయాలని కోరిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో బుధవారం BPSC కార్యాలయం వెలుపల గందరగోళం నెలకొంది. పేపర్ లీక్‌లతో సహా పరీక్షలో అవకతవకలు జరిగాయని, తిరిగి పరీక్షను నిర్వహించాలన్నది ఆందోళనకారుల డిమాండ్. తమ డిమాండ్‌ను ప్రభుత్వ అధికారులకు చెప్పేందుకు BPSC కార్యాలయం వైపు ముందుకు సాగిన అభ్యర్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనను ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఖండించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చర్యలు తీసుకోవడం సరికాదని లాలూ గురువారం పాట్నాలో విలేఖరులతో అన్నారు.
'ఆత్మహత్య'పై ఆగ్రహం
సివిల్ సర్వీస్‌కు సిద్ధమవుతున్న పాలిగంజ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సోను మంగళవారం పాట్నాలో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించాలని కిశోర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా బీపీఎస్సీ సహా పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సోను గత కొన్ని నెలలుగా వివిధ పరీక్షలు, కెరీర్‌పై ఆందోళన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని స్థానికులు, అతని బంధువులు తెలిపారని పోలీసులు అంటున్నారు.
మాకు వారి మద్దతు అవసరం లేదు.
పాట్నాకు చెందిన ప్రముఖ వ్లాగర్ గురు రెహమాన్ అని పిలిచే మోతియుర్ రెహమాన్ ఖాన్ కూడా గురువారం గర్దానీ బాగ్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేను విద్యార్థుల పక్షాన నిలుస్తాను. అభ్యర్థులు గత తొమ్మిది రోజులుగా నిరసన చేస్తున్నారు. రాజకీయ మైలేజీ పొందేందుకు వచ్చే ప్రతిపక్ష నాయకులెవరిని ఇక్కడకు రానివ్వం. డిసెంబర్ 13న నిర్వహించిన పరీక్షకు సంబంధించి మాట్లాడేందుకు అధికార పార్టీ నుంచి ఎవరైనా వస్తే వారితో మాట్లాడతాం’’ అని ఖాన్ అన్నారు. "గత తొమ్మిది రోజులుగా కిషోర్ ఎక్కడ ఉన్నాడు? ప్రశ్నించారు ఖాన్. వారికి కిషోర్ మద్దతు అవసరం లేదని కూడా చెప్పారు. విద్యార్థులను రెచ్చగొట్టినందుకు తనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని ప్రశ్నించగా.. వాటిని నేను భయపడడని సమాధానమిచ్చారు.
జనవరి 1న బీహార్ బంద్?
నిరసనకారులపై పోలీసుల చర్యను ప్రతిపక్ష కాంగ్రెస్, పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ ఖండించారు. డిసెంబర్ 13 పరీక్షను రద్దు చేయకుంటే జనవరి 1న బీహార్ బంద్‌కు పిలుపునిస్తానని యాదవ్ చెప్పారు.
కార్యాలయ ముట్టడిపై దర్యాప్తు చేస్తున్నాం..
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ..“BPSC కార్యాలయం వద్ద జరిగిన నిన్నటి ఘటనపై విచారణ జరుపుతున్నాం. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు సివిల్ సర్వీస్ అభ్యర్థులను రెచ్చగొట్టారు. నిన్నటి నిరసనకు రోహిత్ సూత్రధారి.”అని పేర్కొన్నారు.