TTD : కల్తీ నెయ్యి కేసులో తొలి టీటీడీ వికెట్ పడింది!
టీటీడీ కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను SIT అదుపులోకి తీసుకుంది
By : The Federal
Update: 2025-11-27 12:31 GMT
టీటీడీ Laddu
తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కీలక దశకి చేరినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో తొలిసారి టీటీడీ అధికారిని SIT అరెస్టు చేసింది. టీటీడీ కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను SIT అదుపులోకి తీసుకుంది. ఆయనపై నెయ్యి కొనుగోలు ప్రక్రియలో అక్రమాలు, అనుమానాస్పద అనుమతులపై ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ఆయన పాత్ర ఉన్నట్లు SIT గుర్తించినట్టు తెలుస్తోంది.
ఈ అరెస్టుతో కల్తీ నెయ్యి కేసులో అరెస్టుల సంఖ్య 10కు చేరింది. కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత SIT ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను విచారించింది.
టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పూర్వ అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కూడా విచారించింది. ఈ కేసులో వారి పాత్ర, నిర్ణయాలపై సమాచారం సేకరించినట్టు సమాచారం.
ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నను అరెస్ట్ చేశారు. ప్రస్తుత అరెస్ట్ తో టీటీడీ అధికారుల్లో భయం పట్టుకుంది. ఇంకొందర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల అరెస్టయిన వారిలో ప్రాధాన్యం కలిగిన వ్యక్తి సుబ్రమణ్యం. సప్లయర్లతో ఆయన సంబంధాలు, కొనుగోలు వ్యవస్థలో ఆయన ప్రమేయం, మధ్యవర్తులతో ఆయన జరిపిన లావాదేవీలు వంటివి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
SIT పరిశీలనలో ఉన్న అంశాలు...
కల్తీ నెయ్యి కేసులో SIT పలు అంశాలను పరిశీలిస్తోంది. వాటిలో నెయ్యి సరఫరా చేసే కంపెనీల ఎంపిక, క్వాలిటీ పరీక్షల లోపాలు, టెండర్ల మంజూరు విధానం, బిల్లుల ఆమోదం, ధృవీకరణ, మధ్యవర్తుల పాత్ర, టీటీడీ కొనుగోలు విభాగంలో జరిగిన అనుమానాస్పద నిర్ణయాలు వంటి అంశాలు సిట్ పరిశీలిస్తోంది.
జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్‌తో ఈ అంశాల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.
టీటీడీ లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యత లోపాలున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం SIT ను ఏర్పాటు చేసింది. అనంతరం పలు నమూనాల్లో ప్రమాణాలు పాటించలేదని నివేదికలు రావడంతో కేసు వేగంగా ముందుకు సాగింది. SIT మున్ముందు మరింత మంది అధికారులు, సప్లయర్లను విచారణకు పిలిచే అవకాశం ఉంది. కొందరిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.