అమరావతి అభివృద్ధికి 29 గ్రామాల పరిధి సరిపోదు
అమరావతిలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. రెండో విడతలోనూ ల్యాండ్ పూలింగులో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నామని సీఎం చెప్పారు.
అమరావతి పూర్తిస్థాయి అభివృద్ధికి 29 గ్రామాల పరిధి సరిపోదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లా అమరావతి ఎదగాలంటే ఈ 29 గ్రామాలతో సాధ్యం కాదని, అలా జరిగితే అమరావతి కేవలం ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది అని ఆయన రాజధాని రైతులకు సూచించారు. గురువారం రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఐదో బ్లాకులో సమావేశమయ్యారు. రైతుల తమకున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని... ఈ అంశంపై కేంద్రంతో మరోసారి చరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంత కాలం పాటు పొడిగించే అంశంపైనా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. జరీబు, గ్రామ కంఠాలు, లంక భూములు, రిటర్నబుల్ ప్లాట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రైతుల అభిప్రాయాలు నా దృష్టికి వచ్చాయి. లంక భూములను పూలింగ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించండి. అవసరమైతే నేనూ మీతో మాట్లాడతాను. ఇకపై రెగ్యులర్‌గా అమరావతి రైతుల సమస్యలపై సమీక్షిస్తాను అని ముఖ్యమంత్రి వెల్లడించారు.