కేంద్రాన్ని ఒప్పించేలా చర్చించాలి
కృష్ణా–గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, గోదావరి ట్రైబ్యునల్, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్‌లో రాష్ట్ర గొంతుకను వినిపించాలని ఎంపీలకు సూచించారు. వంశధార–గోదావరి-నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్‌ని నిర్ణయిస్తాయని... నీటి భద్రతే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలన్నారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం, సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని ఎంపీలకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు పంటల మార్పిడికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని... అలాగే హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
అభివృద్ధిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లకు అవసరమైన శక్తి వసతులపై కేంద్ర సహాయం సాధించాలి. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు, 4G–5G కనెక్టివిటీ, క్వాంటం వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు మద్దతు సాధించేలా ఎంపీలు కృషి చేయాలి. విశాఖ–విజయవాడ మెట్రో రైలు, విశాఖ-తిరుపతి-అమరావతి ఎకనామిక్ రీజియన్స్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో చురుకైన చర్చలు జరపాలి. పీపీపీ మోడల్‌లో తీసుకొస్తున్న మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తులేనని, 70 శాతం సేవలు ఉచితమని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. ప్రతి పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్, విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలపై ఎంపీల సహకారం అవసరం.’ అని అన్నారు.
ప్రజల మధ్య ఎంపీలు ఉండాలి
పార్లమెంటులో చురుగ్గా ఉండటంతో పాటు, తమ తమ నియోజకవర్గాల్లో పేదల కోసం జరుగుతున్న ‘పేదల సేవలో’ వంటి కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టీడీపీలో ఉన్న యువ పార్లమెంటేరియన్లు ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. ప్రజా సేవే మనం అనుసరించాల్సిన మార్గమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, నీటి భద్రత, టెక్నాలజీ పురోగతి, పారిశ్రామిక పెట్టుబడులు—ఈ అంశాలన్నింటిని పార్లమెంటులో ప్రస్తావించి, రాష్ట్రానికి వీలున్నంతలో ఎక్కువ ప్రయోజనం చేకూర్చడమే అజెండాగా పెట్టుకోవాలన్నారు.
ప్రజలకు చేసింది చెప్పుకోవాలి..విజిబిలిటీ ఉండాలి
పార్టీ కార్యక్రమాల్లో ఎంపీలు క్రియాశీలకంగా ఉండాలని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు చెప్పుకోవాలని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. పార్లమెంటు చర్చల్లో భాగస్వాములు కావాలని అన్నారు. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కేవలం 17 నెలల్లోనే అభివృద్ధిని గాడిలో పెట్టగలిగామని సీఎం వ్యాఖ్యానించారు. గత పాలకుల విధ్వంసం కారణంగా ఏపీకి మరికొంత కాలం ఇబ్బందులు తప్పవని... అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతామని స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ కార్పోరేషన్ ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రానున్నామని వివరించారు. అటు పరిశ్రమలకు వినూత్నంగా ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలను రియల్ టైమ్‌లో వేసేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మరో మెట్టుగా ఎస్క్రో అకౌంట్ నిలుస్తుందన్నారు. ఎంపీలు రాజకీయంగా నియోజకవర్గంలో గుడ్ విల్ సంపాదించాలని సీఎం సూచించారు. అనవసరపు వివాదాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. వివాదాలతో ఎంపీలకు వ్యక్తిగతంగానూ.. పార్టీకి కూడా నష్టం కలుగుతుందని హితవు పలికారు. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతీ వారం వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని బేరీజు వేస్తున్నామని అన్నారు.
ప్రశ్నల్లో ప్రజాహితమే ముఖ్యం : లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... గత పాలకులు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో కేవలం 42 శాతం సీట్లు మాత్రమే విద్యార్ధులకు ఇస్తామని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కనీసం 50 శాతం సీట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యంగా వివరించారు. పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలు ప్రజాహితంగా, రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, లోక్‌సభ-రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు.