ప్రపంచం నలుచెరగులా తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీని ఆదేశించారు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా తిరుమల తిరుపతి దేవస్థానం మారాలని సూచించారు. గురువారం సచివాలయంలో దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో అనుసరించే అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలు చేసేందుకు ఆలోచన చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రసాదం తయారీ, క్యూ మేనేజ్మెంట్ సిస్టం సహా వివిధ అంశాల్లో ఈ విధానాలను అనుసరించాలని దేవాదాయశాఖకు సూచనలు చేశారు. ప్రసాదాల తయారీ కోసం ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల నిర్వహణకు సంబంధించి సాంకేతికతను వినియోగించాలని పేర్కొన్నారు. భక్తులకు దర్శన సౌలభ్యం కల్పించటమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలని సూచనలు చేశారు. టీటీడీ భక్తుల పోర్టల్ ను ఆర్టీజీఎస్ తో అనుసంధానించాలని ఆదేశించారు.
టీటీడీ ఆస్పత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు
తిరుపతిలో ఉన్న ఆస్పత్రులన్నీ ఓ మోడల్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రులను అనుసంధానిస్తూ మెరుగైన వసతులు కల్పించాలని అన్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆస్పత్రుల తరహాలోనే వీటి నిర్వహణ కూడా చేపట్టాలని సీఎం సూచించారు. అత్యుత్తమ వైద్య నిపుణులైన డాక్టర్లను కూడా శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి ఈ ఆస్పత్రుల ద్వారా వైద్య సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి టీటీడీని ఆదేశించారు. అలాగే నేరుగా ఉత్పత్తిదారుల నుంచే ఔషధాలు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. అత్యవసర సమయాల్లో క్యూలైన్లలోని భక్తులను వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తిరుమల లో కాలుష్య నివారణకు ఈవీ వాహనాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను నిర్వహించాలని అన్నారు. అలాగే అన్ని సేవల్నీ వాట్సప్ గవర్నెన్సు లోకి తీసుకువచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. వైకుంఠ ఏకాదశికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని టీటీడీకి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వైకుంఠ ఏకాదశికి అన్ని భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచనలు చేశారు. వీలైనంత మంది ఎక్కువ భక్తులు దర్శనాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. తిరుమలలో దివ్య ఔషధవనం, బయోడైవర్సిటీ కాపాడేలా చర్యలు చేపట్టాలన్నారు. తిరుమల కొండలపై వివిధ రకాల పుష్పజాతుల మొక్కలు నాటాలన్నారు.
కొత్తగా నిర్మించే 5 వేల దేవాలయాల రీడిజైన్
రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను రీడిజైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఆ దేవాలయాల్లో ఆధ్యాత్మికత, ప్రశాంతత ఉట్టిపడేలా ప్రత్యేకంగా ప్రణాళిక చేయాలని సూచించారు. వీటి నిర్మాణాన్ని పాలకమండలి సభ్యుల కమిటీ పర్యవేక్షించేలా చూడాలన్నారు. కొత్త దేవాలయాల నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ పై కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 8 దేవాలయాలతో పాటు నవీ ముంబై, తమిళనాడు లోని ఉలందూర్ పేటలో కొత్తగా టీటీడీ దేవాలయాలను నిర్మాణం చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోయంబత్తూర్ లోనూ ఆలయ నిర్మాణానికి ఓ భక్తుడు ముందుకు వచ్చారని తెలిపారు. అస్సాంలోనూ టీటీడీ ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించారని సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మరింత స్థలాన్ని కేటాయించాలని కోరనున్నట్టు తెలిపారు. దేశంలోనూ విదేశాల్లోను నిర్మించే ప్రతీ ఆలయం టీటీడీ ప్రధాన ఆలయానికి అనుసంధానం కావాలని సీఎం పేర్కొన్నారు. శ్రీవారి ధనానికి, ఆస్తులకు జవాబుదారీగా ఉండాలని ఎక్కడా దుర్వినియోగానికి చోటు లేకుండా పారదర్శకంగా వాటిని నిర్వహించాలని సీఎం సూచనలు జారీచేశారు. అలాగే ఒంటిమిట్ట రామాలయంలో భక్తుల సంఖ్య పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని దేవాదాయశాఖను సీఎం ఆదేశించారు. దేవాలయాల పవిత్రతను కాపాడుతూనే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు.
వేగంగా భక్తుల దర్శనానికి చర్యలు
తిరుమల ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు వేగంగా దర్శనాలు జరిగేలా వినూత్న కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం నిముషానికి 8 మంది భక్తుల చొప్పున దర్శనాలు చేసుకుంటున్నట్టు టీటీడీ అధికారులు వివరించారు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తున్నట్టు సీఎంకు తెలిపారు. దర్శనంతో పాటు కాటేజీ బుకింగ్ ఒకే మారు జరిగేలా చూస్తున్నామని తద్వారా దుర్వినియోగం అరికట్టామని సీఎంకు తెలియచేశారు. లడ్డూ నాణ్యతను గణనీయంగా పెంచటంతో పాటు అన్న ప్రసాదంలో వడ కూడా అందిస్తున్నామని తెలిపారు. కిచెన్ ను కూడా ఆటోమేషన్ చేసి 2.75 లక్షల మందికి అన్న ప్రసాదం చేసేలా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణను అడ్డా తరహా యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. తిరుమలలో కాటేజీలు, వీధుల పేర్లను కూడా పురాణాలు, క్షేత్ర పాశస్త్యం వచ్చేలా పెట్టనున్నట్టు అధికారులు వివరించారు. ఈ సమీక్షకు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్,జేఈఓ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు హాజరయ్యారు.