అసెంబ్లీ స్పీకర్‌కు అతిశీ లేఖ..

ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై రాష్ట్రపతితో భేటీ కానున్న ప్రతిపక్ష నేత అతిశీ;

Update: 2025-02-28 10:02 GMT

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీ ప్రతిపక్ష నేత అతిశీ.. స్పీకర్ విజేందర్ గుప్తా(Vijender Gupta)కు లేఖ రాశారు. తమ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు.

‘బాధతో ఈ లేఖ రాస్తున్నా’

అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు అతిశీ. "నేను ఈ లేఖను బాధ, వేదనతో రాస్తున్నా. ప్రజాస్వామ్యంలో సమానత్వం, న్యాయం ముఖ్యమైన అంశాలు. కానీ ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ గొంతును వినిపించే హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఎమ్మెల్యేలకు లేకపోతే, ప్రజాస్వామ్యం ముందుకెలా సాగుతుంది?," అని లేఖలో పేర్కొన్నారు.

మోదీ..మోదీ అన్న వారిపై చర్యలేవి?

‘‘లెఫ్టినెంట్ గవర్నర్ వి.కే. సక్సేనా ప్రసంగ సమయంలో అధికార పక్ష ఎమ్మెల్యేలు "మోదీ మోదీ" నినాదాలు చేసినా.. వారిపై ఏ చర్య తీసుకోలేదు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు "జై భీమ్" నినాదాలు చేసినందుకు 21 మందిని మూడు రోజుల పాటు సస్పెండ్(Suspension) చేశారు. ఇది చాలా దురదృష్టకరం," అని ఆమె తెలిపారు.

ప్రజాస్వామ్యం ఖూనీ..

సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు ప్రయత్నించగా.. వారిని అసెంబ్లీ ఆవరణలోకి కూడా అనుమతించలేదని అతిశీ(Atishi) ఆరోపించారు. "ఇది ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి. ఎన్నికైన ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఆవరణలో అడుగు పెట్టనీయకపోవడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధం" అని అన్నారు.

అసెంబ్లీలో, ముఖ్యమంత్రి రేఖా గుప్తా కార్యాలయం నుంచి భగత్ సింగ్, అంబేడ్కర్ చిత్రాలను తొలగించారని ఆరోపిస్తూ ఆప్(AAP) ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ 21 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వారిని బలవంతంగా అసెంబ్లీ హాల్లో నుంచి బయటకు పంపాలని ఆదేశించారు.

ప్రజాస్వామ్య విలువలు కాపాడండి

అతిశీ స్పీకర్‌ను ఉద్దేశిస్తూ.."గౌరవనీయ స్పీకర్ గారూ..మీరు ఈ అసెంబ్లీకి రక్షకుడు. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సమానంగా చూడాలి," అని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రపతికి లేఖ..

అతిశీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా లేఖ రాశారు. భేటీకి అపాయింట్‌మెంట్ కోరారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను ఆమె దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. 

Tags:    

Similar News