liquor scam | స్వామి భక్తే వారిద్దరినీ జైలుకు పంపిందా?

వైఎస్ కుటుంబానికి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి ఆంతరంగికులు. ఈ ఎపిసోడ్ లో కృష్ణమోహన్ రెడ్డి సేవలు వైఎస్ఆర్ వాడుకున్నారు. ఆయన కొడుకు జగన్ వద్ద ఎలా తిరగబడింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-17 11:34 GMT

మాజీ సీఎం వైఎస్. జగన్ కోటరీగా ఉన్న నాయకులు జైలుపాలయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదీ అదే బాట. చివరికి వైఎస్ఆర్ కుటుంబానికి ఆంతరంగికులుగా ఉన్న ధనుంజయరెడ్డి, అదనపు పీఎస్ గా పనిచేసిన పీ. కృష్ణమోహన్ రెడ్డిని కూడా మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లేలా చేసింది. ఇదే రాయలసీమలో చర్చకు తెరతీసింది.

ఇడుపులపాయ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ చిక్కుముడిని కృష్ణమోహన్ రెడ్డి తేలిగ్గా పరిష్కరించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ ను వివాదాల నుంచి గట్టెక్కించారు. ఆయన కొడుకు జగన్ దగ్గర పనిచేసిన కృష్ణమోహన్ కటకటాల్లోకి వెళ్లారు. వారిని వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులను చేసిన అంశాలేమిటి?
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఓగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి పనితీరును గుర్తించి, ఆయన సేవలను పులివెందుల ప్రాంతానికి దివంగత సీఎం వైఎస్ఆర్ వినియోగించుకున్నట్లు ఈ ప్రాంతవాసులు చెప్పే మాట.
కడప జిల్లాకు చెందిన ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కు ఎంపిక కావడానికి ముందే ఉన్న రాజకీయ పరిచయాలు సమర్థవంతంగా వినియోగించుకుని వైఎస్ కుటుంబానికి నమ్మినబంటు అయ్యారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాగా,
మద్యం కుంభకోణంలో అరెస్టయిన కృష్ణమోహన్ రెడ్డి రెవెన్యూ చట్టాలపై పట్టు ఉంది. పులివెందుల, నిజామాబాద్ జిల్లాలో ఏమంటున్నారు? ఇంతకీ ఈ కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా మార్చిన పరిస్థితి ఏమిటి?
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. గతంలో కడప కలెక్టర్ గా పనిచేసిన డాక్టర్ పి. సుబ్రమణ్యం (సీఎంఓ), ఏఎస్సీ వెస్లీ (సీఎం భద్రతాధికారి)ను నియమించుకున్నారు.
2006 నవంబర్ 5 ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ఆర్ భూ భారతి (The Integrated Land Information System) పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించి పైలట్‌ ప్రాజెక్టుగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను ఎంపిక చేశారు. అప్పటి రాష్ట్ర సర్వే ల్యాండ్ సెటిల్ మెంట్ కమిషర్ వినోద్ కుమార్ అగర్వాల్ కూడా ఆ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, అదే సమయంలో నెల్లూరు జిల్లా విడవలూరు మండలానికి చెందిన కృష్ణమోహన్ రెడ్డి గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన చెందిన పీ. కృష్ణమోహన్ రెడ్డి నిజామాబాద్ ఆర్డీఓగా పనిచేస్తున్నారు.
ఆ జిల్లాలో భూ భారతి ప్రాజెక్టులో సమగ్ర వివరాలు సేకరించడం, లెక్కలు తేల్చడంలో కృష్ణమోహన్ రెడ్డి పనితీరును దివంగత సీఎం పరిగణలోకి తీసకున్నారని అంటారు. ఆయనకు రెవెన్యూ చట్టాలపై మంచి పట్టు ఉంది. భూముల వివరాలు సేకరించడం, ప్రభుత్వ స్థలాలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించారు" అని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు గోనుగుండ్ల సోమనాథ్ చెప్పారు.
"బ్రిటీష్, నిజాం, కాలం నాటి భూముల రికార్డులు క్రమపద్ధతిలోకి తీసుకుని రావడానికి భూ భారతి కారణమైతే.. కృష్ణమోహన్ రెడ్డి పనితీరు. కూడా పనిచేసింది" అని నిజామాబాద్ జిల్లాకు చెందిన లక్మా రమేష్ గుర్తు చేశారు.
పులివెందులకు మారిన సీన్
నిజామాబాద్ జిల్లాలో అమలు చేసిన పైలెట్ ప్రాజెక్టులో అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి దివంగత సీఎం వైఎస్ఆర్ దృష్టిలో పడ్డారు.
వైఎస్ఆర్ కుటుంబానికి నెల్లూరు జిల్లా నుంచి సన్నిహితంగా మెలిగిన నేతలు కూడా ఉండడం. కృష్ణమోహన్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం వల్ల వైఎస్ కుటుంబానికి చేరువ కావడానికి మార్గం కలిగిందంటున్నారు. కాగా, 
నిజామాబాద్ ఆర్డీఓగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ (పడా) చైర్మన్ గా  నియమించారు. కష్టించి పనిచేయడం. పనులు సకాలంలో పనిచేయడంలో కృష్ణమోహన్ రెడ్డి పనితీరే వైఎస్ఆర్ కుటుంబానికి మరింత దగ్గర చేసిందని చెబుతారు.
" పులివెందులలో రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోవడం, నెట్టుకురావడం అంతసులువు కాదు. నాయకులను బ్యాలెన్స్ చేయడం, పనులన్నీ చక్కదిద్దడంతో అందరినీ మెప్పించారు" అని నిజామాబాద్, కడప జిల్లాలో జర్నలిస్టుగా పనిచేయడంతో పాటు కృష్ణమోహన్ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన సీనియర్ జర్నలిస్ట్ సోమనాథ్ చెప్పారు.
ఇడుపులపాయ వివాదంలో..
దివంగత సీఎం వైఎస్ఆర్ ఉన్న సమయంలో ఇడుపులపాయ భూముల వివాదం తెరమీదకు వచ్చింది.
"మా తండ్రి కాలంలో తెలియక డీకేటీ భూములు కొన్నారు" అని వైఎస్ఆర్ వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఆయన ప్రమాణస్వీకారానికి ముందు రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహారం మళ్లీ వివాదంగా మారింది. ఏమి చేయాలనేది అధికారులతో వైఎస్ఆర్ సమాలోచనలు చేశారు.
పడా చైర్మన్ గా ఉన్న ఆర్డీఓ పి. కృష్ణమోహన్ రెడ్డికి రెవెన్యూ చట్టాలపై మంచి పట్టు ఉంది. పరిష్కారమార్గాలు కూడా సూచించగలరనేది ఆయనకు ఉన్న పేరు. వైఎస్ఆర్ సలహా కోరగానే, ఇడుపులపాయ భూముల్లో కొంత వైఎస్. షర్మిలకు పసుపు కుంకుట కింద గిఫ్ట్ డీడ్ రాయించి, ప్రభుత్వ సంస్థలకు విరాళంగా ఇవ్వడానికి కృష్ణమోహన్ రెడ్డి సలహానే పనిచేసిందని కృష్ణమోహన రెడ్డిని దగ్గరగా చూపిన వారు చెబుతున్నారు. దీంతో వైఎస్ఆర్ కుటుంబంలో ఆంతరంగికుడిగా మార్చిందని అంటున్నారు.
మళ్లీ పులివెందులకు..
వైఎస్ఆర్ మరణం తరువాత కృష్ణమోహన్ రెడ్డి హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కి బదిలీ అయ్యారు. కడప ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన వైఎస్. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో కృష్ణమోహన్ రెడ్డిని ఓఎస్డీగా నియమించుకున్నారు. ఐదేళ్లు సర్వీసు ఉండగానే కృష్ణమోహన్ రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, వైఎస్. జగన్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉండిపోయారు.
అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలల పాటు జైలులో ఉన్నప్పుడు కూడా వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న వైఎస్. విజయమ్మకు ఓఎస్డీగా పనిచేశారు.
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కృష్ణమోహన్ రెడ్డిని నెలకు 3.8 లక్షల వేతనంపై సీఎంఓలో అదనపు పీఎస్ గా వైఎస్. జగన్ నియమించుకున్నారు.
రాష్ట్రంలో ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో వైఎస్. జగన్ కోటరీలో అత్యంత సన్నిహితుడైన కృష్ణమోహన్ రెడ్డి సీఎంఓలో నంబర్ 2 వ్యవహరించారనేది ఆయన ఉన్న ముద్ర.
2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలను లోడడం ప్రారంభించింది.
అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు, "జె బ్రాండ్" పేరిట బాగా పాపులర్ అయిన మద్యం కొనుగోళ్లు, విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై సెట్ దర్యాప్తులోకి దిగిన విషయం తెలిసిందే. ఇందులో.. మొత్తం నిందితుల్లో కడప జిల్లాకు చెందిన వారిలో ఏ1 రాజ్ గనిరెడ్డి, ఏ6, సజ్జల శ్రీధరరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఏ37 గోవిందప్ప బాలాజీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా సీఎంఓలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి తోపాటు కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా కేసులో కీలక మలుపు తిరిగినట్లు భావిస్తున్నారు.
కుమారుడి పేరట లావాదేవీలు?
పనిని దైవంగా భావిస్తాడనే పేరున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి 2021లో స్కూబీ ల్యాబ్స్ నరోబొటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2022 ఆగస్టు నెలలో నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలతో పాటు ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ కు కూడా రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారని సమాచారం. మద్యం లావేదేవీల్లో వచ్చిన ముడుపులు ఈ సంస్థల ద్వారా వివిధ మార్గాల్లో మళ్లించారని సందేహిస్తున్నారు. ఇంకొన్ని సంస్థల ద్వారా ముడుపుల సొమ్ము స్థిరాస్ఠి రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారని తెలిసింది. అంతేకాకుండా ఈ సంస్థల ద్వారా తండ్రీ కొడుకు కృష్ణమోహన్ రెడ్డి, రోహిత్ రెడ్డి మధ్య లావాదేవీలపై ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. కడప జిల్లాలో షిర్డీసాయి ఎలక్ట్రికల్ కు కాంట్రాక్టులు అప్పగించిన వ్యవహారంలో కూడా కృష్ణమోహన్ రెడ్డి పాత్ర ఏమిటి? అనేది కూడా చర్చనీయాంశమైంది.
ధనంజయ రెడ్డి స్వామి భక్తి
వైసిపి పాలనలో అన్నీ తానేగా వ్యవహరించినట్లు ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిపై అభియోగం. ఈయన ఈ స్థాయికి రావడానికి దారి తీసిన పరిస్థితి పరిశీలిస్తే..
కడప జిల్లా వ్యక్తి కావడం. వైయస్సార్ కుటుంబంతో రాజకీయ పరిచయం. వైయస్సార్ ఆశీస్సులతో ఐఏఎస్ పోస్టులోకి వచ్చిన ధనంజయ రెడ్డి ఆ కుటుంబానికి భక్తుడుగా మారినట్లు చెబుతారు.
కడప జిల్లా రాయచోటి మండలం చెందిన ధనంజయ రెడ్డి 1988లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మద్దతుతో ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నిక అయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నా, పోటీ పరీక్షలకు హాజరయ్యారు. ఢిల్లీ, అండమాన్ నికోబార్, డామన్ దేవ్ , దాద్రానగర్ హవేలి) సర్వీసుకు ఎంపికయ్యారు. కేంద్ర సర్వీసులో ఉన్నప్పటికీ మొదటి నుంచి వైయస్ తో ఉన్న రాజకీయ సంబంధాలను ఆయన కొనసాగించేవారు.
2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాగానే డిప్యుటేషన్ పై వచ్చిన ధనుంజయ రెడ్డి దాదాపు 8 ఏళ్ల పాటు జిహెచ్ఎంసి లో డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. చట్టంలోని వెసులుబాటును ఆసరాగా చేసుకుని వైఎస్ ఆశీస్సులతో ధనుంజయ రెడ్డి సర్వీస్ రాష్ట్రంలో విలీనం చేసుకున్నారు.
గోదావరిలో తొక్కిసలాట
రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఆ సమయంలో కూడా ధనుంజయ రెడ్డికి వ్యవసాయ శాఖ కమిషనర్, విపత్తుల నిర్వహణ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీ టి డి సి ఎండి ఒంటి కీలక పదవుల్లో పనిచేశారు. గోదావరి పుష్కరాల సమయంలో కూడా ధనుంజయ రెడ్డి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది మరణించిన సంఘటన తెలిసిందే.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్య సంబంధాల నేపథ్యంలో సీఎంఓలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఐదేళ్లపాటు ఆయనే షాడో సీఎంగా వ్యవహరించారని అంటారు. సీఎంఓలో ధనుంజయ రెడ్డి అపాయింట్‌మెంట్ కూడా దొరికేది కాదని చాలామంది అధికారులు గగ్గోలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ధనుంజయ రెడ్డిని కలిస్తే సీఎం జగన్ ను కలిసినట్టే భావించే విధంగా అన్ని పనులు ఆయనే చక్కదిద్దరంలో కీలకంగా వ్యవహరించాలని ఆరోపణలు ఉన్నాయి. 2006 బ్యాచ్ కు చెందిన ధనుంజయ రెడ్డి 2024 జూన్ లో రిటైర్డ్ అయ్యారు. ఐదేళ్లలో పాటు సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు కూడా మద్యం కుంభకోణంలో పాత్ర ఉందనే వ్యవహారంలో అరెస్టు చేయడం ఈ ప్రాంతంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Similar News