యువత ఓటు కీలకమే..

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువత ఓటు కీలకం కానున్నది. విభిన్న వయసులో వారు కూడా ఆ కోవలో కోటి మంది వరకు ఉన్నారు.

Update: 2024-05-12 03:44 GMT

తిరుపతి: ఈ సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. 2024 ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువ ఓటర్లు కీలకంగా మారారు. ఉపాధి చూపించే పార్టీ అధికారంలోకి రావాలని కొందరు అంటున్నారు. తమ చదువులకు ఊతమిచ్చిన ప్రభుత్వాన్ని ఆదరిస్తామని ఇంకొందరు చెబుతున్నారు. మిశ్రమ స్పందన ఉండడం సర్వసాధారణమే. అయితే, అధిక శాతం మంది కొత్త ఓటర్లు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని అభిప్రాయపడ్డారు.

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మరో రోజు తరువాత జరగనున్నది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల పరిధిలో పాత ఓటర్లతో పాటు ఈసారి కొత్తగా ఓటు హక్కుకు అర్హత సాధించిన యువతరం కూడా తీర్పు ఇవ్వనున్నది. కొత్తగా ఓటు వేసే యువత ఉత్సాహంతో ఉంది. "పన్నుల రూపంలో వసూలు అవుతున్న సొమ్ము ఉచితంగా పంచడం కంటే, వనరుల సృష్టించడానికి వెచ్చించి ఉంటే బాగుండేది" అని అభిప్రాయం వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు.

" ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా నాకు మేలు జరిగింది" అని మొదటిసారి ఓటు వేయనున్న తిరుపతికి చెందిన వై. భవ్యశ్రీ.. ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. ‘‘కొత్తగా ఓటు వేస్తున్నా అనే ఫీలింగ్ ఏమీ లేదు. ఈ ప్రభుత్వాలు చేస్తున్న విధానాలపై అవగాహన ఉంది. ఆలోచన చేసే ఓటు వేస్తా" అని ఆమె వ్యాఖ్యానించారు.

పెరిగిన ఓటర్లు

2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ తర్వాత 4.02 కోట్ల నుంచి ఓటర్ల సంఖ్య 4.08కు పెరిగింది. సవరణ నేపథ్యంలో 22, 38, 952 కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,08,07,256 మంది ఉన్నారు. పురుషులు 2,07,29, 452 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 2,00,74,322 మంది ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 67, 434 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 3482 మంది, ఎన్ఆర్ఐ ఓటర్లు 7,603 మంది ఉన్నట్లు ఎన్నికల రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో విడుదలైన ముసాయిదాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 మంది ఓటర్లు పెరిగారు.

యువ ఓటర్లు

ముసాయిదా జాబితా సమయంలో 18-19 సంవత్సరాల మధ్య ఉన్న సంఖ్య 8,13,544కు చేరింది. ఆ లెక్కన 5,25,389 మంది కొత్త యువ ఓటర్లు నమోదు అయినట్లు స్పష్టమవుతుంది. 2019లో మూడో పాయింట్ 9 3 కోట్లుగా ఓటర్ల సంఖ్యతో పోలిస్తే, ఈ ఎన్నికల్లో అదనంగా 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,55,130 మంది ఎక్కువగా ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,036 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికల్లో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారే కాదు. యువ ఓటర్లు కూడా కీలకం కానున్నారు. యువతతో పాటు అన్ని వయసులో వారు కొత్తగా ఓటు నమోదు చేయించుకున్న వారి సంఖ్య 1.10 కోట్లు ఉంటుంది అనేది ఒక అంచనా. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న సాయిలక్ష్మీ మాట్లాడుతూ..

"చదువుకు తగిన ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ ఆధారిత చదువుల కోసం ప్రభుత్వం ప్రణాళిక అమలు చేయాలి" అని సాయి లక్ష్మి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై మాకు కూడా అవగాహన ఉంది అని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామంటూ, వైఎస్ఆర్సిపి, టిడిపి కూటమి మేనిఫెస్టోను ప్రకటించింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా కూడా ఇచ్చారు. వీటిని నిరుద్యోగ యువత ఎంతవరకు విశ్వసిస్తారు అనేది వేచి చూడాలి.

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో మరిన్ని పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో రోజు తర్వాత జరుగును పోలింగ్‌లో యువ, కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్ల తీర్పు కూడా ఇందులో కీలకం కానున్నది. వారు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News