5.5 శాతం తగ్గిన క్రైమ్ రేటు
రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, 16 జిల్లాల్లో నేరాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
By : The Federal
Update: 2025-12-18 16:09 GMT
రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్త చెప్పారు. గురువారం జరిగిన రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతల అంశంపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు 5.5 శాతం తగ్గుదల నమోదైందన్నారు. 2023 డిసెంబరు నుంచి నవంబరు 2024 వరకు 110111 నేరాలు నమోదైతే, డిసెంబరు 2024 నుంచి నవంబరు 2025 మధ్య కాలంలో 104095 నేరాలు నమోదయ్యాయని తెలిపారు. ప్రధానంగా 26 జిల్లాల్లో నేరాల చాలా తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ఇందులో గొడవలు, అల్లర్లు వంటి సంఘటనలు గణనీయంగా తగ్గాయన్నారు.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 52.4 శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. ఎస్సీ ఎస్టీలపైన నేరాలు తగ్గాయని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ నేరాలు 22.35 శాతం తగ్గాయని చెప్పారు. మహిళల భద్రత కూడా పెరిగిందని చెప్పారు. క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ లో 4శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. అదృశ్యమైన మహిళల ఆచూకీ కనుగోనడంలో కూడా పోలీసు శాఖ విశేష కృషి చేసి ఫలితాలు రాబడుతోందన్నారు. నాలుగు నెలల కాలంలో మొత్తం 2,483 మంది అదృశ్యమైన మహిళల ఆచూకీ కనుగొన్నామని, అందులో 1177 మంది యువతులున్నారని తెలిపారు. నేరాలలో 56 శాతం మేర డిటెక్షన్ రేటు ఉందని, 55 శాతం మేర రికవరీ రేటు సాధించామన్నారు.
ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఐదు జిల్లాల్లో సీసీటీవీ కెమెరాల అనుసంధానం పటిష్ట పర్యవేక్షణ, టెక్నాలజీ వినియోగంతో నేరాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయన్నారు. విజయవాడ నగరంలో నిఘా కోసం 10వేల సీసీ కెమెరాలతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.