శ్రీసిటి నుంచి ఈజిప్ట్‌కు భారీ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్ ఎగుమతి

మరో మైలురాయిని అధిగమించిన శ్రీసిటీ-వీఆర్వీ పరిశ్రమ

Update: 2025-12-18 14:44 GMT

ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా లోని  శ్రీసిటీ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఈ రోజు మరొక రికార్డు నమోదయింది.  ఇక్కడి  క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ  సంస్థ USA చార్ట్ ఇండస్ట్రీస్ కు చెందిన వీఆర్వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్, అత్యాధునిక క్రయోజెనిక్ సాంకేతికతతో తయారైన భారీ లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఈజిప్ట్‌లోని ప్రముఖ సంస్థ ఎయిర్ లిక్విడ్‌కు ఎగుమతి చేసింది. దీనితో  ఎగుమతులకు సంబంధించి శ్రీసిటీ మరో ప్రధాన మైలురాయిని అధిగమించింది. 531 కిలోలీటర్ల సామర్థ్యం, 168 టన్నుల బరువు, సుమారు 39 మీటర్ల పొడవు, 5.45 మీటర్ల వ్యాసం కలిగిన ఈ ట్యాంక్ క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలబడుతుంది. ఈ భారీ నిర్మాణాన్ని చెన్నై పోర్ట్‌కు తరలించేందుకు ప్రత్యేక మల్టీ-యాక్సిల్ లాజిస్టిక్స్‌ను వినియోగించారు.


ఈ ఎగుమతిని ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి గొప్ప విజయంగా  శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వర్ణించారు.  ప్రపంచ స్థాయి క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో VRV ప్రతిభను ఇది మరింత బలపరుస్తుందని అన్నారు. శ్రీసిటీలో మొట్టమొదటి కంపెనీగా అడుగుపెట్టిన VRV, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో ఏరోస్పేస్, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలకు తమ ఉత్పత్తులను సరఫరా చేసే గ్లోబల్ సంస్థగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు.

ఇస్రోతో భాగస్వామ్యం, కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడే ఆక్సిజన్ మౌళిక వసతుల సరఫరా వంటి ఘన చరిత్ర కలిగిన VRV, తాజా ఎగుమతితో క్రయోజెనిక్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.


Tags:    

Similar News