కలెక్టర్ల సమావేశం ఉపయుక్తంగా జరిగింది

స్వర్ణాంధ్ర 2047 - 10 సూత్రాలపై కలెక్టర్ల సమావేశంలో ఎక్కువ సేపు చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు.

Update: 2025-12-18 16:19 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం అభినందనీయమని మంత్రి కొలుసు పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలోని మంత్రి పార్థసారథి రెండు రోజుల పాటు నిర్వహించిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ విశేషాలను గురువారం మీడియకి వెల్లడించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన స్థితిలో అధికారం చేపట్టిన దార్శనీకుడు చంద్రబాబు నాయుడు అని,  కేవలం 18 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ పట్టాలెక్కించారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి, ఆర్ధికంగా బలోపేతం చేసి 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చారని పేర్కొన్నారు.

రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా రెండు రోజుల కలెక్టర్ల సమావేశం జరిగిందని, కలెక్టర్ల మధ్య అబివృద్ది, సంక్షేమంలో పోటీ తత్వాన్ని పెంపొందించేలా చర్చలు జరిగాయని మంత్రి పార్థసారథి వివరించారు. ప్రజలకు వేగంగా సుపరిపాలన అందించేలా, పలు సమస్యల పరిష్కారం దిశగా సమావేశం జరిగిందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా కలెక్టర్ ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీ విద్యార్థుల విద్య, ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వారి భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ఐఐటీ, నీట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
పీజీఆర్ ఎస్ లో లక్షల సంఖ్యలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి లాజికల్ పద్దతిలో పరిష్కరించాలని, ఆర్థికేతర సమస్యలన్నింటినీ వీలైనంత త్వరలో పరిష్కరించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నిర్దిష్ట కాల పరిమితి లో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని, రీసర్వే, 22 ఎ, పాస్ పుస్తకాల జారీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో తమకు దక్కని, దక్కించుకోవాలనుకున్న భూములను 22ఎ లో చేర్చి ప్రజలను ఇబ్బందులు పెట్టారని, లింక్ డాక్యుమెంట్లు అంటూ ఇబ్బంది పెట్టకుండా అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లతో సమస్య పరిష్కరించాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. భూ వివాదాలను ప్రోత్సహించే వారిపై పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. రెవెన్యూ డేటా ను డేటా వేర్ హౌసింగ్ లో పెట్టి భద్రపరచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. అడవుల్లో, గ్రామాలు, పట్టణాల్లో కోతులు, ఏనుగులు, కుక్కల వల్ల ఏర్పడే సమస్యల ను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారన్నారు.
రాష్ట్రంలో కేవలం 18 మాసాల వ్యవధిలోనే 13.5 లక్షల కోట్లు ఎంవోయు లు జరిగాయని, వాటిలో ఇప్పటి వరకు 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా ప్రతి నెలా సమీక్ష నిర్వహించి పారిశ్రామికవేత్తలు ఎదుర్కొనే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నూటికి నూరు శాతం పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని సీఎం కోరారన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, వినూత్న విధానాలను ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చును సాద్యమైనంత మేర తగ్గించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారన్నారు. రాష్ట్రంలో నేరాల శాతం 5.5 శాతం తగ్గాయని, 16 జిల్లాల్లో నేరాల శాతం బాగా తగ్గిందని డీజీపీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై నమోదైన నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. రాష్ట్రంలో క్రైం రేట్ ను తగ్గించాలని ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశించారని వివరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వహననానికి పాల్పడే వారిపై, అరాచకాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు.
పీపీపీ పద్దతిలో వైద్య కళాశాలల నిర్మాణం అంటే పూర్తిగా ప్రైవేటు పరం అన్న విధంగా కొందరు భావిస్తున్నారని, వారికి తెలిసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంతో పేద విద్యార్థులకు అధిక సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. గత ప్రభుత్వం తక్కువ ధరకు లభించే సోలార్ పవర్ ను కాదని, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. ఫలితంగా ప్రభుత్వం రూ. 9వేల కోట్ల మేర అదనపు బారాన్ని మోయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News