'తిరుమల' లడ్డూల్లో 'గొడ్డు కొవ్వు' ఉందన్న చంద్రబాబు మాటలపై దుమారం

లడ్డూ ప్రసాదం తయారీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్లులతో తిరుమల కేంద్రంగా రాజకీయ దుమారం చెలరేగింది. టీటీడీ ఈఓ పాత వివరణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. దీనిపై ప్రమాణానికి సిద్ధమా? అని సీఎంకు మాజీ చైర్మన్ సవాల్ విసిరారు.

Update: 2024-09-19 11:57 GMT

గత వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన వ్యవహారాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజాగా లడ్డూ ప్రసాదాల తయారీలో గతంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై దుమారం చెలరేగింది.   సీఎం చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ ప్రతినిధుల ఆరోపణలు, సవాళ్లు చోటుచేసుకున్నాయి. టీటీడీ ఈఓ జే. శ్యామలరావు  తిరుమలలో గతంలో ఇచ్చిన వివరణ వీడియో బయటికి వచ్చింది. ఇది టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉంది. 


"శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు వాడారు" అని

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే సీఎం చంద్రబాబు మాటల నేపథ్యంలో రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో తీర్చమైన చర్చకు తెరలేసింది. ఈ వ్యవహారం కాస్తా, టీడీపీ కూటమి ప్రభుత్వంలోని నేతలతో పాటు వైసీపీ నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు.

"తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం" అని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, వైస్. జగన్ స్వయానా బాబాయ్ వైవి. సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడంతో పాటు మీడిమాతో కూడా మాట్లాడారు.

"కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరు. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. చంద్రబాబు సిద్ధమా?' అని సవాల్ విసిరారు.

తేదీ.. సమయం.. నిర్ణయించండి

"సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వెనుక వాస్తవం ఉంది" అని సమర్ధించారు. "టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి సవాల్ స్వీకరిస్తున్నాం. తేదీ. సమయం నిర్ణయం నిర్ణయించండి" అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ. భానుప్రకాష్ రెడ్డి  ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల వెనుక కథేమిటో పరిశీలిద్దాం..
రోజూ వేలమంది దర్శనం

తిరుమల శ్రీవారిని రోజుకు సగటున 80 వేల నుంచి 85 వేల మంది వరకు దర్శించుకుంటారు. వారంతపు సెలవుల్లో ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారంతా శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఆ లడ్డూకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజుకు రెండు నుంచి మూడు లక్షల వరకు తయారు చేస్తుంటారు. చిన్న లడ్డూ రూ.50, పెద్దలడ్డూ రూ.200కు యాత్రికులకు తిరుమల కౌంటర్లలో విక్రయిస్తుంటారు. ఈ లడ్డూ తయారీలో సంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. ఆందుకోసం.. ఉపయోగించే పదార్థాల కొలతల ప్రకారం వినియోగిస్తారు. ఇందుకోసం 1950లో దిట్టం (వినియోగించే పదార్థాల మోతాదు) 1950లో నిర్ణయించారు. ఆ మేరకు తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో 2001లో దిట్టంలో మార్పు చేశారు.
5,100 లడ్డూల తయారీకి 803 కిలోల ముడిసరుకులు వినియోగిస్తారు. ఈ విషయం పక్కన ఉంచితే 100 లడ్డుల తయారీకి వినియోగించే పదార్థాలు ఇవే..
శనిగపిండి :180 కిలోలు
ఆవునెయ్యి: 165 కిలోలు
చక్కెర : 400 కిలోలు
జీడిపప్పు : 30 కిలోలు
ఎండుద్రాక్ష : 16 కిలోలు
యాలకులు : 5 కిలోలు వినియోగిస్తారు.
రూ.50కి విక్రయించే చిన్నలడ్డూ 60 నుంచి 75 గ్రాములు ఉంటుంది. రూ.200 కి అందుబాటులో ఉండే పెద్ద లడ్డూ 750 గ్రాములు బరువు ఉండే విధంగా టీటీడీ అదికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ లడ్డూల తయారీకి అవసరమైన ముడిసరుకులు టెండర్ ప్రక్రియ ద్వారా టీటీడీ కొనుగోలు చేస్తుంది. తీసుకువచ్చిన వస్తువుల నాణ్యత పరిశీలించడానికి తిరుమల ప్రత్యేక టీటీడీ క్యాలిటీ కంట్రోల్ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించిన తరువాత అన్లోడ్ జరుగుతుంది. నాణ్యతలో ఎక్కడ లోపం అనిపించినా, తిరస్కరిస్తారు.
నందిని నెయ్యి
దశాబ్దాల కాలంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే కర్ణాటక ప్రభుత్వ సారధ్యంలోని సహకార సంస్థ "నందిని" కంపెనీ నుంచి సరఫరా చేసేవారు. 2022 - 23లో ఐదు వేల టన్నుల నెయ్యి టీటీడీకి అందించారు. ఈ తరువాత ధరల సవరణపై టీటీడీ కర్ణాటక ప్రభుత్వం మధ్య సమన్వయం కుదరని కారణం గా గత ఏడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిచిపోయింది. దీంతో..
కొరవడిన నాణ్యత
వైసీపీ ప్రభుత్వం ఉండగా, తిరుమల అదనపు ఈవోగా ఏవి. ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వ సారధ్యంలోని సహకార సంఘం డెయిరీ ప్రతినిధులతో ధరల వ్యవహారంపై పీటముడిపడడం వల్ల 2021లో నెయ్యి సరఫరాకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో లడ్డూ నాణ్యత కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బరువు కూడా తగ్గిందనే వార్తలు, యాత్రికుల ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం..
"లడ్డూ కౌంటర్లలో బరువు తూచే మిషన్ (వేయింగ్ మిషన్)పై లడ్డూ ఉంచి, నిర్ధారించారు. అంతేకాకుండా. ఆ తరువాత కూడా లడ్డూ తయారీకి అందించిన ఏ ట్యాంకర్లో నెయ్యి గ్రేడ్3లో ఉందని బయటపడడంతో తిరస్కరించిన ఆ టెండర్ రద్దు చేశారు. ఈ చర్య ద్వారా నాణ్యమైన నెయ్యి వాడడం లేదనే వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఆ తరువాత 2024 ఎన్నికల తరువాత ఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్వహించిన ఓ సమీక్షలో జే. శ్యామాలరావు ఆసక్తికరమైన అంశం తెరమీదకు తెచ్చారు.
"తిరుమల ల్యాబ్ కల్తీని నిర్ధారించే పరికరాలు లేవు. వాటి అవసరం ఉంది" అని గుర్తు చేశారు. దీని ద్వారా తిరుమలలో తయారు చేసే అన్నప్రసాదాలు, లడ్డూల్లో నాణ్యత కొరవడిందని గ్రహించి, వాటిని చక్కదిద్దారు. ఇదిలావుంటే...
సీఎం వ్యాఖ్యలతో దుమారం
"తిరుమల లడ్డు ప్రసాదంలో ఆవు కొవ్వు, నూనెలు వాడారు" అని సీఎం చంద్రబాబు నాయుడు సంచలన విషయాలు బయటపెట్టారు. యాత్రికుల మనోభావాలతో ఆడుకున్నారని కూడా ఆయన ఆవేదన చెందారు.
"ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ" ఈ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయిందనే విషయం కూడా చర్చకు వచ్చింది. ఉన్నఫళంగా ఇప్పుడు సీఎం. చంద్రబాబు చేసిన ఆరోపణలు వెనుక రాజకీయ లబ్ధితో కూడిన కోణం ఉందా? అనే మాటలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు స్పందించారు..
భక్తుల మనోభావాలు దెబ్బ తీశారు 

తిరుమల లడ్డూ ప్రసాదంలోనెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ చేసి, వైసీపీ ప్రభుత్వంలో భక్తుల మనోభావాన్ని దెబ్బతీసింది అని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి జీ. నరసింహయాదవ్, తెలుగు యువత నేత, శ్రీధరవర్మ , ఆర్సీ మునికృష్ణ, చేజర్ల మనోహర్ ఆచారి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో నీతులు వల్లిస్తూ గోతులు తీసే పాలన చేశారన్నారు. స్వామి వారి ఖజానాను లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనను చేస్తున్నదన్నారు.
జగన్ దేవస్థానంగా చేశారు..
"వైసీపీ పాలనలో టీటీడీని జగన్ దేవస్థానంగా మార్చేశారు" అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ. భాను ప్రకాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్య చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీని బ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తాము ప్రశ్నిస్తే మతతత్వ పార్టీ అంటారు. టీటీడీ పాలకమండలిలో 85 మందిని సభ్యులుగా వైసీపీ పాలనలో నియమించడంసై తాము కోర్టుకెళ్లగా 52 మందిని న్యాయస్థానం సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు నెయ్యిలో కల్తీ చేయడం వెనుక.. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు వ్యాఖ్యలు టీటీడీకి భంగకరం

తిరుమలను అపవిత్రం చేస్తూ,హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిళారెడ్డి వ్యాఖ్యనించారు. " ఈ వ్యవహారాన్ని టీడీపీ,వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయి. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించాయి" అని షర్మిళారెడ్డి ఆక్షేపణ తెలిపారు. ఆరోపణల్లో రాజకీయ దురుద్దేశం లేకుంటే, ఉన్నత స్థాయి కమిటీ నియమించండి. లేదా సీబీఐ విచారణకు ఆదేశించండి" అని ఆమె డిమాండ్ చేశారు.
ఉద్యోగులను అవమానించడమే..

తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానించడమే అని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఆభ్యంతరం తెలిపారు. "ఏ ప్రసాదమైనా తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉంది. ల్యాబ్ లో తనిఖీ తర్వాతే వినియోగిస్తారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ, మైసూరు) లో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉందన్నారు. విశ్రాంత శాస్త్రవేత్త, మరో 12 మంది నిపుణులైన ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ తనిఖీ జరుగుతుందని ఈ తనిఖీ పర్యవేక్షణకు టీటీడీ నుంచి రోజుకొక బృందం చొప్పున ప్రతిరోజూ సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు. కరోనా సమయం మినహా మిగిలిన 3.5 సంవత్సరాల నెయ్యి వినియోగానికి సంబంధించిన ట్యాంకర్లు నాణ్యతా ప్రమాణాలకు లోబడి లేవని 20కి పైగా ట్యాంకర్లను తిప్పి పంపిన విషయం రికార్డుల్లో ఉందని గుర్తు చేశారు. ఇది వాస్తవం కాగా సీఎం స్థాయిలోని వ్యక్తి తేలికగా ఇట్లాంటి ఆరోపణలు చేయటం సమంజసం కాదు" అని అన్నారు.
నైతికత కాదు...

"వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పై బురదచల్లడానికి సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు తన నైతికతను తానే దిగజార్చకోవడమే అని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం శ్రీవారి అన్న ప్రసాదాలు, లడ్డూ తయారీలో నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారని దారుణాతి దారుణమైన ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణలు స్వామివారి భక్తులు ఎవరు తట్టుకునే పరిస్థితిలో లేరు" అన్నారు. "స్వామివారికి అపరిమిత భక్తుడైనని చెప్పుకునే సీఎం చంద్రబాబు తిరుమలలో జరగని పనిని, తెలిసి కూడా ఇంత ఆరోపణలు చేయడం అంటే ఇక మానసిక స్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం కాలేదు. ఆయన ఆరోపణలకు ఒకటే సమాధానం. మీరు చేసిన ఆరోపణ నిజమైతే చేసిన వారు సర్వనాశనం అయిపోతారు" అని శాపనార్థాలు పెట్టారు.
బిగ్ ట్విస్ట్... కూటమికి ఇరకాటమే?

తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీలో జరిగిన వ్యవహారంపై టీటీడీ ఈఓ జే. శ్యామలరావు కొత్తగా బాధ్యతలు తీసుకున్న సమయంలోనే సమీక్షల అనంతరం స్పందించారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.  ఆ వ్యాఖ్యలతో టీడీపీ కూటమి ఇరుకునే పడే పరిస్థితి ఏర్పడింది. టీటీడీ ఈఓ శ్యామలరావు ఏమన్నారంటే...
"లడ్డూ ప్రసాదాల తయారీకి వచ్చిన నెయ్యిలో వెజిటబుల్ ఫాట్స్ కనిపించాయి. అది వనస్పతి అనే నూనె కావచ్చని అన్నారు. నాణ్యత పరీక్షలో ఆ విషయం తెలియడంతో ఒక ట్యాంకర్ నెయ్యి తిరస్కరించడమే కాకుండా కాంట్రాక్టర్కు నోటీస్ ఇవ్వడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టాం. అన్ లోడ్ కాకుండా ఉంచిన మరో రెండు ట్యాంకర్ల నెయ్యిని కూడా తిరస్కరించాం" అని స్పష్టం చేశారు. దీంతో లడ్డూ ప్రసాదంలో వాడింది ఆవు కొవ్వుతో కూడిన నెయ్యి ఉందా? ఈవో శ్యామలరావు చెప్పినట్లు కూరగాయల తయారైన వనస్పతి ద్రావణం ఉందా? అనేది తెరమీదకు వచ్చింది. ఇది ఓ రకంగా సీఎం చంద్రబాబును ఇరకాటంలో పడేసే చర్యగానే కనిపిస్తుంది. ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News