‘సమాజానికి తిరిగి ఇవ్వడం మానవ ధర్మం’

- శ్రీసిటీలో సాహితీ వేత్త కిరణ్‌ప్రభ

Update: 2025-12-13 20:18 GMT
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కిరణ్‌ప్రభ, రవీంద్ర సన్నారెడ్డి

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఆరోగ్యకరమైన, ఆనందదాయక జీవనం సాగిస్తున్న మనం సమాజానికి కొంత తిరిగివ్వడం మానవ ధర్మం అంటూ ప్రఖ్యాత 'టాక్ షో' ప్రయోక్త, సాహితీ వేత్త కిరణ్‌ప్రభ వ్యాఖ్యానించారు. శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శనివారం శ్రీసిటీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తన సతీమణి కాంతికిరణ్ తో కలసి పాల్గొన్నారు.

కార్యక్రమంలో "జీవన సాఫల్యం, సమాజానికి తిరిగివ్వడం" అనే అంశంపై కిరణ్ ప్రభ మాట్లాడారు. ఇందులో భాగంగా కార్ల్ మార్క్స్, గిడుగు రామమూర్తి, దుర్గాబాయి దేశ్ ముఖ్, డా. యల్లాప్రగడ సుబ్బారావు, చక్ ఫీని, జార్జి ఈస్టమన్, చెగువేరా వంటి మహా వ్యక్తుల జీవిత గాధలు, వారు చేసిన సమాజ సేవ, త్యాగాలు, గుప్త దానాలు గురించి కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఇలాంటి త్యాగధనులను గుర్తు చేసుకుంటూ అందరం సమాజానికి కొంత తిరిగివ్వాలన్నారు. ఇవ్వడంలో ఎంతో తృప్తి ఉందని, అలా ఇస్తూ దానిని వ్యసనంగా మార్చుకోవాలని సూచించారు. 

కిరణ్‌ప్రభ కు మెమెంటో బహుకరిస్తున్న ఎమ్మెల్సీ

కిరణ్‌ప్రభ ఇప్పటివరకు దాదాపు 800 మంది ప్రముఖ వ్యక్తుల జీవితాలను వివరిస్తూ 1800 రేడియో టాక్ షోలను నిర్వహించారు. ఖచ్చితమైన పరిశోధన, అంతర్దృష్టి కథనాలకు ఆయన ప్రసిద్ధి చెందాడు.
రెండవ పర్యాయం శ్రీసిటీలో తన స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన కిరణ్‌ప్రభ ను శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి చేతుల మీదుగా కిరణ్ ప్రభ దంపతులను ఘనంగా సత్కరించారు. శ్రీసిటీ శ్రీవాణి వేదిక ద్వారా భవిష్యత్తులో ఈ తరహా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 

కార్యక్రమం అనంతరం, శ్రీసిటీ సమీపంలోని ఇరుగుళం జిల్లా పరిషత్ హైస్కూల్ సందర్శించిన కిరణ్ ప్రభ, అక్కడ విద్యార్థులను ఉద్దేశించి క్రమశిక్షణ, దేశభక్తి, విద్యలో ఎలా రాణించాలి, చెడు అలవాట్లకు దూరంగా ఎలా ఉండాలి వంటి పలు అంశాలపై ప్రత్యేక ప్రసంగం చేశారు.
శ్రీసిటీ పీఆర్వోరచయిత పల్లేటి బాలాజీ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. హైదరాబాద్, తిరుపతి, చెన్నై, సూళ్లూరుపేటకు చెందిన సాహితీప్రియులు, పరిశ్రమల ఉద్యోగులు హాజరై, కిరణ్‌ప్రభ బహుముఖ ప్రజ్ఞను మెచ్చుకుని కార్యక్రమాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన పలు సందేహాలను కిరణ్ ప్రభ నివృత్తి చేశారు.


Tags:    

Similar News