మహిళల మౌనం బలహీనత కాదు

కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్

Update: 2025-12-13 13:04 GMT

మహిళల్లో మౌనం బలహీనతగా మారకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తుళ్ళూరులో శనివారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డి.ఆర్.డి.ఏ సహకారంతో నిర్వహించిన 'నయీ చేతన 4.0' లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సి.ఆర్.డి.ఎ స్కిల్ హబ్‌లో జెండర్ రిసోర్స్ సెంటర్ (జిఆర్‌సి)ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.


మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ గృహ హింస, బాల్య వివాహాలు, లింగ వివక్షలను నిర్మూలించడమే కార్యక్రమ ఉద్దేశ్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదైనప్పటికీ పరువు ప్రతిష్ఠల భయంతో అనేకం నమోదు కావడం లేదని పేర్కొన్నారు. గృహ హింస జరిగితే 181 హెల్ప్‌లైన్‌కు సంప్రదించాలని, ఫొటోలతో సహా సమాచారం అందించాలని సూచించారు.

రాష్ట్రంలో 200 జెండర్ రిసోర్స్ సెంటర్లు మంజూరు చేసినట్లు, వంద కేంద్రాలు ప్రారంభమైనట్లు తెలిపారు. 8 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 80 లక్షల మంది మహిళలు ఉన్నారని, వారి సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.


రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ లింగ సమానత్వం వంటగది నుంచే ప్రారంభం కావాలని, మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడారు.

జెండర్ ఛాంపియన్లు చలివెంద్రి సుగంధి, తురకా శ్యామలల అనుభవాలను పంచుకున్నారు. వారిని మంత్రులు సత్కరించారు. లింగ సమానత్వంపై లఘు నాటిక, అవగాహన కరదీపిక విడుదల, వివిధ శాఖల ప్రదర్శన శాలలు, వైద్య శిబిరం నిర్వహించారు.

Tags:    

Similar News