తిరుపతి పాలిటెక్నిక్ కాలేజీలో ఏసుక్రీస్తు పాఠాలు...

ఈ వివాదంపై టీటీడీ సీరియస్..

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-13 15:23 GMT
తరగతి గది బోర్డుపై వాక్యాలు రాస్తున్న అధ్యాపకురాలు

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంగ్లీషు పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకురాలు ఏసుక్రీస్తు వాక్యాలు బోర్డుపై రాస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఇదే అవకాశంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ విద్య సంస్థల్లో అన్యమత ప్రచారం చేస్తున్న మహిళా అధ్యాపకురాలిపై చర్యలు తీసుకోవాలని పాలిటెక్నిక్ వద్ద నిరసనకు దిగారు.

తిరుపతి నగరం కపిలతీర్థం రోడ్డు (కేటీ రోడ్డు)లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలనా భవనానికి ఎదురుగానే ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఈ కాలేజీ తరగతి గదిలో ఇంగ్లిషు కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న మాధవి బోర్డుపై రాసిన వాక్యాలు వివాదం రేకెత్తించాయి.

తరగతి గదిలో ..
"తమ్ముడు.. అమ్మ... నాన్న .. యేసుక్రీస్తు
చెల్లి.. అక్క. అన్న యేసుప్రభువు"
అనే పదాలు బోర్డుపై రాస్తూ, విద్యార్థులకు పాఠం చెప్పడం ప్రారంభించారు. తరగతిలోనే ఉన్న ఓ విద్యార్థి రికార్డు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంతో నలుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలు పాలిటెక్నిక్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సమాచారం అందడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, వారు కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
విధుల నుంచి తొలగింపు
ప్రభుత్వ కాలేజీలో మత బోధన చేసిన ఇంగ్లీషు అధ్యాపకురాలపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వేంకటేశ్వర్ ఆదేశాలతో సాంకేతిక విద్యా శాఖ రీజనల్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియ స్పందించారు.
"ఎస్బీ పాలిటెక్నిక్ లో మత బోధన చేసిన అధ్యాపకురాలిని విధుల నుంచి సస్పెండ్ చేశారు" ఆ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.
పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనపై టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ. భానుప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
"ప్రభుత్వ కాలేజీల్లో అన్యమత ప్రచారం చేయడం దారుణం. ఆమెపై చర్య తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. భక్తి ఉంటే ఇంట్లో ఏసుక్రీస్తును ప్రార్థించుకోవాలి, తరగతి గదుల్లో మతప్రచారం చేయడంపై ఆయన అభ్యంతరం చెప్పారు.

టీటీడీ సీరియస్

హిందూ సంఘాల ఆరోపణలు, మీడియా కథనాలపై టీటీడీ స్పందించింది. పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత ప్రచారంపై టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ తలారి రవి ఓ ప్రకటన విడుదల చేశారు.
"ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో జరిగిన ఘటనపై టీటీడీకి ఆపాదించడం సరైంది కాదు. పాలిటెక్నిక్ కాలేజీకి టీటీడీకి సంబంధం. లేదు. ఆ కాలేజీ ప్రభుత్వ రంగంలో ఉంది. టీటీడీకి సంబంధం లేదు" అని టీటీడీ చీఫ్ పీఆర్ఓ రవి స్పష్టం చేశారు.


Tags:    

Similar News