రేవంత్ బడ్జెట్ పద్మనాభంలాగ మిగిలిపోతాడా ?
నెలజీతంలో నిత్యావసరాలు, ఇతర ఖర్చులు వేసుకునే బడ్జెట్ పద్మనాభంమాదిరిగా లెక్కలు వేసుకుంటున్నట్లు రేవంత్(Revanth) చెప్పాడు;
రేవంత్ ను తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారేమో తెలీదు. ఎందుకంటే ప్రతినెలా తాను బడ్జెట్ పద్మనాభం లాగ లెక్కలు వేసుకుంటున్నట్లు చెప్పాడు. నెలజీతంలో నిత్యావసరాలు, ఇతర ఖర్చులు వేసుకునే బడ్జెట్ పద్మనాభంమాదిరిగా లెక్కలు వేసుకుంటున్నట్లు రేవంత్(Revanth) చెప్పాడు. ఈ విషయంలోనే తథాస్తు దేవతలు రేవంత్ ను ఆశీర్వదిస్తారేమో అనే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ రేవంత్ చెప్పిన సందర్భం ఏమిటంటే ప్రతినెలా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయానికి, చేయాల్సిన ఖర్చులకు ఏమాత్రం పొంతన ఉండటంలేదట. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ప్రతినెలా రు. 18,500 కోట్ల ఆదాయం వస్తుంటే వివిధ ఖర్చులకు, చెల్లింపులకు రు. 30 వేల కోట్లు అవసరం ఉందని చెప్పాడు. వస్తున్న ఆదాయానికి, చేయాల్సిన ఖర్చులు, చెల్లింపులకు మధ్య సుమారు రు. 12 వేల కోట్లు గ్యాప్ ఉన్నట్లుగా రేవంత్ ఆవేధన వ్యక్తంచేశాడు.
నిజానికి రేవంత్ మాటలను పక్కనపెట్టేసి ఆర్ధికవేత్తల కోణంలో చూస్తే ప్రభుత్వం దివాలాతీసినట్లే చెప్పుకోవాలి. ఆదాయానికన్నా ఖర్చులు అపరిమితంగా ఉన్నాయంటే ఏ సంస్ధయినా నష్టాల ఊబిలో కూరుకుపోయినట్లే లెక్క. నష్టాలఊబిలో కూరుకుపోయిన సంస్ధ ఏరోజైనా దివాలాతీయాల్సిందే తప్ప వేరేదారిలేదు. కాని ఇక్కడున్నది ప్రభుత్వం. ప్రభుత్వానికి మూతపడటం అన్నది ఉండదుకదా. అందుకనే అప్పు ఎన్ని లక్షల కోట్లరూపాయలైనా అలా నెట్టుకురావాల్సిందే. ప్రభుత్వానికి వస్తున్న రు. 18,500 కోట్ల ఆదాయంలో రు. 6 వేల కోట్లు ఉద్యోగుల జీత, బత్యాలకు, మరో రు. 6 వేల కోట్లు ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి, మిగిలిన రు. 6 వేలకోట్లను సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఖర్చు చేస్తున్నట్లు రేవంత్ చెప్పాడు. రేవంత్ తాజా లెక్కలు చూసిన తర్వాత ప్రభుత్వం లోటుబడ్జెట్లో కూరుకుపోవటమే తప్ప కోలుకోవటం అన్నది ఎప్పటికీ సాధ్యంకాదు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ మిగులుబడ్జెట్లోకి వచ్చే అవకాశంలేదని.
రాష్ట్రంఅప్పుల్లో కూరుకుపోవటానికి కచ్చితంగా పాలకులే కారణమని చెప్పాలి. ఎన్నికల్లో గెలవటానికి రాష్ట్ర ఆర్ధికపరిస్ధితితో సంబంధంలేకుండా నోటికొచ్చిన ఉచిత ఫథకాలు ప్రకటిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల అమలును పక్కనపెట్టేస్తారు లేకపోతే అరాకొరా అమలుచేసి తమపాలన బ్రహ్మాండమని తమ భుజాలను తామే చరుచుకుంటారు. పథకాల అమలు ఒకవిషయం అయితే అవినీతి మరో కీలకవిషయం. 2014లో తెలంగాణ ఏర్పడటం మిగులుబడ్జెట్ తోనే ఏర్పడినా కొద్దికాలంలోనే అప్పుల్లోకి వెళ్ళిపోయిందంటే అదంతా కేసీఆర్(KCR) పుణ్యమనే చెప్పాలి. ఆచరణసాధ్యంకాని హామీలు, అవినీతి కారణంగా తెలంగాణ(Telangana) ఇపుడు సుమారు రు. 8.29 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.
ఇదే విషయమై రేవంత్ మాట్లాడుతు కేసీఆర్ పదేళ్ళ పాలనలో 8 లక్షల కోట్లరూపాయలు అప్పులుచేసినట్లు మండిపడ్డాడు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి రు. 1.58 లక్షల కోట్లు అప్పుచేస్తే కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలకే రు. 1.52 లక్షల కోట్లు చెల్లించినట్లు చెప్పాడు. ప్రభుత్వ ఆదాయం అంచనాకు తగ్గట్లుగా రావటంలేదు కాబట్టి ఇచ్చిన హామీలఅమలు, సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా అనుకున్నట్లుగా చేయలేకపోతున్నట్లు ఆవేధన వ్యక్తంచేశాడు. అయితే 2023 ఎన్నికల్లోనే తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని తెలిసీ రేవంత్ ఆచరణసాధ్యంకాని హామీలు ఎందుకు ఇచ్చాడంటే మాత్రం సమాధానం ఉండదు.
రేవంత్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచితబస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్లు, 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్ పథకాలు కావాలని జనాలెవరూ అడగలేదు. తమకు నెలకు రు. 2500 పెన్షన్ ఇవ్వాలని మహిళలు ఎవరూ డిమాండ్ చేయలేదు. స్కూటీలు కావాలని విద్యార్ధులు అడిగారా ? తులం బంగారం ఇవ్వమని అడిగిన మహిళలు ఎవరు ? తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవటానికి కేసీఆర్ ఎంత కారణమో రేవంత్ కూడా అంతే కారణమని చెప్పకతప్పదు. కాబట్టి రేవంత్ అధికారంలో ఎంతకాలం ఉంటే అంతకాలమూ బడ్జెట్ పద్మనాభంలాగ నెట్టుకురావాల్సిందే తప్ప వేరేదారిలేదు.
రేవంత్ చేయగలిగింది ఏమీలేదు
ప్రతినెలా బడ్జెట్ పద్మనాభం లాగ లెక్కలు వేసుకుంటున్నట్లు రేవంత్ చెప్పటం స్వయంకృతమే అని ఆర్ధిక, సామాజిక విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు(Pentapati Pullarao) అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాటానికి సరిపడా రెవిన్యు పెంచుకోవటం రేవంత్ చేతిలో లేనిపని’గా పుల్లారావు చెప్పారు. ‘రెవిన్యూ పెంచుకోవాలని అనుకున్నా పెంచుకునేందుకు మార్గాలు లేవ’న్నారు. అందుకనే ‘రెవిన్యు పెరగదు, పథకాలను ఆపే పరిస్ధితిలేద’ని పుల్లారావు చెప్పారు. ‘ఒకవేళ పథకాలను నిలిపేయాలంటే జనాలు అంగీకరించర’న్న విషయాన్ని చెప్పారు. ఈ విషయంలో రేవంత్ చేయగలిగింది కూడా ఏమీలేదన్నారు.
పథకాలు ఎగ్గోట్టే ఆలోచనే
‘ఆదాయాలు సరిపడా లేదని చెప్పి హామీ ఇచ్చిన పథకాలను రేవంత్ ఎగ్గొట్టే ఆలోచన’లో ఉన్నట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంఎల్సీ ఎన్ రామచంద్రరావు(BJP x MLC N. Ramachandra Rao) అనుమానం వ్యక్తంచేశారు. ‘అధికారంలోకి వచ్చిన 15 మాసాల తర్వాత అవసరానికి సరిపడా ఆదాయం రావటంలేదని చెప్పటంలో అర్ధం ఏమిట’ని మాజీ ఎంఎల్సీ అడిగారు. ‘సరిపడా ఆదాయం రావటంలేదు కాబట్టి పథకాన్నింటినీ అమలుచేయలేకపోతున్నట్లు రేవంత్ చెబుతారేమో’ అన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నా నిధుల మంజూరులో కేంద్రం సహకరించటంలేదని నరేంద్రమోడీ(Narendra Modi)పై బురదచల్లేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు’ మండిపడ్డారు. ‘తెలంగాణకు వివిధ రూపాల్లో గడచిన పదేళ్ళల్లో కేంద్రప్రభుత్వం రు. 11 లక్షల కోట్లు ఇచ్చిన విషయాన్ని రేవంత్ చెప్పటంలేద’న్నారు. ‘గతంలో ఎంఎల్ఏ, ఎంపీగా పనిచేసిన రేవంత్ కు తెలంగాణ ఆర్ధికపరిస్ధితి తెలీకుండానే 2023 ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని హామీ ఇచ్చారా’ అని రామచంద్రరావు మండిపడ్డారు.